Business

₹27వేల కోట్ల విలువ కోల్పోయిన డీమార్ట్-BusinessNews-Oct 14 2024

₹27వేల కోట్ల విలువ కోల్పోయిన డీమార్ట్-BusinessNews-Oct 14 2024

* సింగపూర్‌లో ఓ భారత జాతీయుడికి ఊహించని పరిణామం ఎదురయ్యింది. తన ఖాతాలో పొరపాటున పడిన డబ్బును తిరిగి ఇవ్వడంలో విఫలమైనందుకు జైలు శిక్ష పడింది. ఆ నగదు అతనిది కాదని తెలిసినప్పటికీ.. బ్యాంకుకు దాన్ని తిరిగి ఇవ్వనందుకు అక్కడి న్యాయస్థానం 9 వారాల జైలు శిక్ష విధించింది. భారత్‌కు చెందిన పెరియసామీ మథియాళగన్ (47) సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. ఆయన బ్యాంకు ఖాతాలోకి పొరపాటున వేరే ఖాతా నుంచి 25000 డాలర్లు (సుమారు రూ.16లక్షలు) బదిలీ అయ్యాయి. అయితే, అవి తనవి కాదని మథియాళగన్‌కు తెలుసు. అయినప్పటికీ.. ఆ డబ్బులతో తన అప్పులు తీర్చడంతోపాటు కొంత మొత్తాన్ని భారత్‌లోని కుటుంబానికి పంపాడు. కొన్ని నెలల క్రిందట జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి అతడు గతంలో పనిచేసిన సంస్థ నుంచి బ్యాంకుకు ఫిర్యాదు వచ్చింది. సదరు సంస్థ విజ్ఞప్తి మేరకు మథియాళగన్‌కు బ్యాంకు అధికారులు లేఖ రాశారు. అవి పొరపాటున ఖాతాకు బదిలీ అయ్యాయని, వాటిని తిరిగి ఇచ్చేయాలని కోరారు. సంస్థ డైరెక్టర్ కూడా వ్యక్తిగతంగా అతడికి విజ్ఞప్తి చేశాడు. ఆ నగదు తన దగ్గర లేదని, అప్పులను తీర్చుకున్నానని జవాబు ఇచ్చాడు. అనంతరం అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నవంబర్‌ 2023లో పోలీసులు అతడిని విచారించారు. అయితే, నెలకు కొంత తిరిగి ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ.. అలా చేయడంలో విఫలమయ్యాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం..అతడికి 9 వారాల జైలు శిక్ష విధించింది.

* 5జీ సాంకేతికత 2040 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలోకి అదనంగా 450 బిలియన్‌ డాలర్ల సొమ్మును తీసుకొస్తుందని కేంద్ర టెలికామ్‌ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. దిల్లీలోని భారత్‌ మండపంలో ఏర్పాటుచేసిన గ్లోబల్‌ స్టాండర్డ్స్‌ సింఫోజియంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద టెలికం ఈవెంట్లలో ఇదొకటి. ‘‘ఒక్క భారత్‌లోనే 2040 నాటికి 5జీ ద్వారా 450 బిలియన్లు సమకూరతాయని అంచనాలున్నాయి. ఇది కేవలం వేగవంతమైన ఇంటర్నెట్‌ లేదా లో లేటెన్సీ ఉన్నది కాదు.. స్మార్ట్‌సిటీలకు అవసరమైన క్షేత్రస్థాయి పని దీనితోనే సాధ్యం. అత్యాధునిక మౌలిక వసతులు, ‘అటానమస్‌’ ఆవిష్కరణలకు ఇది చాలా ముఖ్యం. ఇప్పటికే దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. కేవలం 22 నెలల్లోనే 98శాతం జిల్లాలు, 80శాతం జనాభా దీని పరిధిలోకి వచ్చాయి. భారత్‌లోని మార్పునకు ఇదే చిహ్నం. హెల్త్‌కేర్‌, విద్య, వ్యవసాయంలో అత్యాధునిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ సహకారంతో 5జీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఐవోటీ పూర్తి శక్తుల్ని వాడుకలోకి తెచ్చుకోవచ్చు’’ అని సింధియా పేర్కొన్నారు.

* ప్రధాని జస్టిన్ ట్రూడో వైఖరితో భారత్‌-కెనడా మధ్య సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసు దర్యాప్తులో భాగంగా భారత హైకమిషనర్‌(Indian High Commissioner In Canada) సంజయ్‌ కుమార్‌ వర్మ (Sanjay Kumar Verma) సహా పలువురు దౌత్యవేత్తలను ‘పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’లుగా (అనుమానితులుగా) పేర్కొంటూ ట్రూడో సర్కార్ తీసుకున్న నిర్ణయంపై భారత్ భగ్గుమంది. ఈ ఆరోపణలు కెనడా ప్రభుత్వపు ఓటు బ్యాంకు రాజకీయాలకు అద్దం పడుతున్నాయని తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. నిజ్జర్ హత్యకేసు విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని సంజయ్‌ కుమార్ వర్మ స్పష్టంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

* దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే క్రమంలో గాయపడే వారికి బీమా కల్పించే ఉద్దేశంతో ఫోన్‌పే (Phonepe) కొత్త తరహా బీమా పాలసీని తీసుకొచ్చింది. ప్రమాదవశాత్తూ ఎవరైనా బాణసంచా వల్ల గాయపడితే వారికి ఈ బీమా అండగా నిలుస్తుంది. రూ.9 చెల్లించడం ద్వారా రూ.25వేల వరకు కవరేజీ లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, ఐటీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ త్రైమాసిక ఫలితాల వేళ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,576.93 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,381) లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో మళ్లీ 82వేల మార్కును అందుకుని 82,072.17 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 591 పాయింట్ల లాభంతో 81,973 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 163.73 పాయింట్ల లాభంతో 25,127.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.06గా ఉంది.

* గిఫ్ట్‌లు, పార్శిళ్ల పేరిట మోసాలకు తెగబడుతున్న సైబర్‌ నేరగాళ్లు (Cyber criminals).. ఇప్పుడు మరో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. జీమెయిల్‌ (Gmail) యూజర్లే లక్ష్యంగా స్కాములకు పాల్పడుతున్నారు. ఫేక్‌ అకౌంట్‌ రికవరీ రిక్వెస్టులు పంపి.. వాటిని యూజర్ల చేత ఆప్రూవ్‌ చేసుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. పొరపాటున లింక్‌ క్లిక్‌ చేస్తే వ్యక్తిగత డేటా వారి చేతిలోకి వెళ్లినట్లే! స్వయంగా తనకే ఎదురైన ఈ అనుభవాన్ని ఐటీ కన్సల్టెంట్‌, టెక్‌ బ్లాగర్‌ సామ్‌ మిట్రోవిక్‌ తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఉచ్చులో సామాన్యులు సులువుగా చిక్కుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

* డీమార్ట్‌ (Dmart) పేరిట దేశవ్యాప్తంగా రిటైల్‌ వ్యాపారం నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం క్షీణించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో మదుపర్లను మెప్పించడంలో కంపెనీ విఫలమవడంతో ఈ ఉదయం 9 శాతం మేర క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.27 వేల కోట్ల మేర ఆవిరైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి డీమార్ట్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.659.44 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 5 శాతం మేర పెరిగింది. ఆదాయం సైతం 14.41 శాతం పెరిగి రూ.14,444.50 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో ఖర్చులు 14.94 శాతం మేర పెరిగినట్లు నివేదించింది. ఈ ఫలితాలు మదుపర్లను మెప్పించడంలో విఫలమయ్యాయి. దీంతో బ్రోకరేజీ సంస్థలు డీమార్ట్‌ టార్గెట్‌ ప్రైస్‌ను తగ్గించాయి. ఈ కారణంగా డీమార్ట్‌ షేర్లు నేడు పతనమయ్యాయి. మరోవైపు క్విక్‌ కామర్స్‌ సంస్థల నుంచి డీమార్ట్‌కు ఎదురవుతున్న పోటీ కూడా మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z