Business

బెంగుళూరులో ఎగిరే ట్యాక్సీలు-BusinessNews-Oct 15 2024

బెంగుళూరులో ఎగిరే ట్యాక్సీలు-BusinessNews-Oct 15 2024

* ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (Hyundai IPO) ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. రూ.27,870 కోట్ల ఐపీఓలో భాగంగా 9.97 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 1.77 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు 26 శాతం, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 13 శాతం, క్యూఐబీ కోటా 5 శాతం చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. హ్యుందాయ్‌ ఐపీఓ అక్టోబర్‌ 17తో ముగియనుంది. సోమవారం యాంకెర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.8315 కోట్లను హ్యుందాయ్‌ సమీకరించింది. ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, జేపీ మోర్గాన్‌ ఫండ్స్, గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ సింగపూర్‌ వంటి 225 సంస్థలు ఈ నిధులు అందించాయి. వీరికి 4.24 కోట్ల షేర్లను (ఒక్కోటి రూ.1,960 చొప్పున) కేటాయించారు. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖవిలువ కలిగిన షేరుకు ధరల శ్రేణి రూ.1,865-1,960గా నిర్ణయించారు. కనీస దరఖాస్తు ఒక లాట్‌ 7 షేర్లు అంటే రూ. 13,720కు రిటైల్‌ మదుపర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 14 లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీర్ఘకాల దృక్పథంతో ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చని బ్రోకరేజీ సంస్థలు పేర్కొంటున్నాయి.

* టాటా మోటార్స్‌ (Tata motors) నుంచి ఈ ఏడాది విడుదలైన కర్వ్‌ (Curvv), కర్వ్‌ ఈవీ (Curvv EV) కార్లు క్రాష్‌ టెస్టులో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించాయి. భారత్‌ న్యూకార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (Bharat NCAP) కింద ఈ రెండు కార్లూ అత్యధిక రేటింగ్‌ పాయింట్లు అందుకున్నాయి. అడల్ట్‌ సేప్టీ విషయంలో 32 పాయింట్లకు గానూ 29.5, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ విషయంలో 49కి 43.66 పాయింట్లు కర్వ్‌ సాధించింది. ఇక కర్వ్‌ ఈవీ.. అడల్ట్‌ ప్రొటెక్షన్‌లో 32కి గాన 30.81, ఐల్డ్‌ ప్రొటెక్షన్‌లో 49కి 44.83 పాయింట్లు పొందింది.

* దేశంలో ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆర్డర్ల కొనుగోలు కోసం, విమానాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత్‌ 2030 నాటికి సుమారు 170 బిలియన్‌ డాలర్లు(రూ.14.11 లక్షల కోట్లు) ఖర్చు చేయాల్సి ఉంటుందని S&P గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఇప్పటికే దేశంలోని విమానయాన సంస్థలు..ఎయిర్‌బస్‌, బోయింగ్‌ కంపెనీలకు రికార్డు స్థాయిలో ఆర్డర్స్‌ ఇచ్చాయి. భారతీయ వియానయాన సంస్థలు కొనుగోలు చేయనున్న 1,700 ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఆర్డర్ల కోసం, కొత్త విమానాశ్రయాలను నిర్మించడానికి, ఉన్న విమానాశ్రయాలను విస్తరించడానికి ఈ నిధులు అవసరమవుతాయని S&P నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్‌ ఒకటి. దేశీయ ప్రయాణీకుల రద్దీ 30 కోట్లకు చేరుతుందని, అంతర్జాతీయ ట్రాఫిక్‌ కూడా రెట్టింపు అవుతుందని ఏవియేషన్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ CAPA అంచనా. సింగపూర్‌, దుబాయ్‌, దోహాలకు ధీటుగా గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌లను నిర్మించే ప్రయత్నంలో 2030 నాటికి భారత్‌లో విమానాశ్రయాల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

* దిల్లీలో నిర్వహించిన ఇండియన్‌ మొబైల్ కాంగ్రెస్‌ 2024 (IMC) ఈవెంట్‌లో రిలయన్స్‌ జియో రెండు ఫీచర్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది. గతేడాదిలో వీ2 పేరిట తీసుకొచ్చిన ఫోన్‌కు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఇదే సిరీస్‌లో మరో రెండు మొబైల్స్‌ తీసుకొచ్చింది. జియో భారత్‌ వీ3, వీ4 పేరిట వీటిని పరిచయం చేసింది. 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేసేలా ఈ మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జియో తెలిపింది.

* మెటాకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ను (Whatsap) మన దేశంలో కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్లు దీన్ని అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఖాతాలపై వాట్సప్‌ నిషేధం విధించింది. ఒక్క ఆగస్టులోనే సుమారు 80 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సప్‌ తెలిపింది.

* దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు సూచీలను పడేశాయి. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్‌ రిఫైనింగ్‌, పెయింట్స్‌ స్టాక్స్ మాత్రం రాణించడం గమనార్హం. సెన్సెక్స్‌ ఉదయం 82,101.86 పాయింట్ల (క్రితం ముగింపు 81,973.05) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,300.44 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 152.93 పాయింట్లతో 81,820.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 70.60 పాయింట్ల నష్టంతో 25,057.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.04గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 73.35 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2669 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* ట్రాఫిక్‌ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో పర్యావరణహిత ప్రయాణ సేవలు అందించేందుకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (BLR Airport) సిద్ధమైంది. త్వరలోనే నగరంలో ఎగిరే ట్యాక్సీలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. విమానాశ్రయం, ఎలక్ట్రానిక్‌ సిటీ.. ఇలా ఎక్కువ ట్రాఫిక్‌ ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని పేర్కొంది. ‘‘ప్రస్తుతం ఇందిరానగర్‌ నుంచి విమానాశ్రయానికి చేరాలంటే గంటా 50 నిమిషాలు పడుతోంది. అదే ఎగిరే ట్యాక్సీలతో అయితే కేవలం 5 నిమిషాలు చాలు’’ అని సార్లా ఏవియేషన్‌ సీఈఓ అడ్రియన్‌ ష్మిత్‌ అన్నారు. ఇదో గేమ్‌ ఛేంజర్‌గా ఆయన అభివర్ణించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఆయన తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు 2- 3 సంవత్సరాలు పడుతుందన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z