Devotional

తిరుమలలో భారీ వర్షం..భక్తుల ఇబ్బందులు-NewsRoundup-Oct 15 2024

తిరుమలలో భారీ వర్షం..భక్తుల ఇబ్బందులు-NewsRoundup-Oct 15 2024

* తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉదయం చిరు జల్లులు పడగా.. సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న, ఈరోజు కురుస్తున్న వర్షానికి శ్రీవారి సన్నిధిలో చలితీవ్రత పెరిగింది. స్వామివారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ పెరగటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులు భక్తులతో నిండిపోయాయి. ఏటీసీ క్యూలైన్‌ వరకు భక్తులు వేచి ఉన్నారు. వర్షం కారణంగా దర్శనానికి క్యూలైన్‌లో వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. దర్శనం తర్వాత లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్లే భక్తులు తితిదే ఏర్పాటు చేసిన షెడ్లలో తలదాచుకుంటున్నారు

* ఏపీ హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు జడ్జిలు రానున్నారు. జడ్జిలుగా ముగ్గురు న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు చేసింది. న్యాయవాదులు కుంచం మహేశ్వరరావు, టి.చంద్ర ధనశేఖర్‌, చల్లా గుణరంజన్‌ పేర్లను సిఫారసు చేసినట్టు సమాచారం.

* గాంధీభవన్‌లో ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతల సమీక్షా సమావేశం. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా సమీక్షలో పాల్గొన్న మంత్రి సీతక్క. గురుకులాలకు తాళాలు వేసిన పరిస్థితి కేటీఆర్‌ వల్లే వచ్చింది. హస్టల్‌ భవనాల పెండింగ్‌ బిల్లులన్నీ కేసీఆర్‌ హయాంలోనివే. గత ప్రభుత్వం రూ. లక్షల్లో బిల్లులు పెండింగ్‌ పెట్టింది. ఆదిలాబాద్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించాం.

* దేశ వ్యాప్తంగా భాజపా (BJP) సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను భాజపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్‌కు అప్పగించింది. ఈ మేరకు ఆయన్ను భాజపా సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నియమించింది. భాజపా ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ, భాజపా లోక్‌సభ ఎంపీ సంబిత్‌ పాత్రా, రాజ్యసభ ఎంపీ నరేశ్‌ బన్సల్‌లను సహాయ రిటర్నింగ్‌ ఆఫీసర్‌లుగా నియమిస్తూ మంగళవారం భాజపా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నియామకాలకు ఆమోదం తెలిపారు.

* రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై బుధవారం జరిగే కేబినెట్‌ చర్చించనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ రూపొందించారు. మొత్తం 10 శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వరుస సమీక్షలతో పలు శాఖల్లో నూతన విధానాలపై కసరత్తు కొలిక్కి వచ్చింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పన చేశారు. జాబ్ ఫస్ట్ (ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం) అనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం పాలసీలను సిద్దం చేసింది.

* విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం ప్రబలింది. మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్క రోజే నలుగురు మృతి చెందారు. తోండ్రంగి రామయ్యమ్మ (60) ఇంటివద్దే మరణించగా.. సారిక పెంటయ్య (65), కలిశెట్టి సీతమ్మ (45) వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. పైడమ్మ (50) అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది బాధితులు విజయనగరం, విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా వైద్యసేవలు అందించిన ఆశా కార్యకర్త రాజేశ్వరికి కూడా అతిసారం సోకింది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మృతి చెందిన వారందరికీ అతిసారంతోపాటు గుండె, కిడ్నీ, బీపీ, షుగర్‌ వంటి సమస్యలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

* పాకిస్థాన్ (Pakistan) ధోరణిని ఐరాస వేదికగా భారత్‌ మరోసారి ఎండగట్టింది. ప్రజాస్వామ్యం, వైవిధ్యానికి భారత్‌ ప్రతీక అయితే.. ఉగ్రవాదం, సంకుచిత విధానం, హింసకు పాకిస్థాన్‌ మారుపేరు అని పునరుద్ఘాటించింది. ‘వలసపాలన’ అనే అంశంపై ఐరాసలో సాధారణ చర్చ సందర్భంగా జమ్మూకశ్మీర్‌ ప్రస్తావనను పాకిస్థాన్‌ తీసుకురావడంపై భారత్‌ దీటుగా స్పందించింది. ‘‘బహుళత్వం, వైవిధ్యం, ప్రజాస్వామ్యానికి భారత్‌ ప్రతీక. కానీ, ఇందుకు విరుద్ధంగా పాకిస్థాన్‌ తీరు ఉంటుంది. ఉగ్రవాదం, సంకుచిత విధానం, పీడించడం వంటి చర్యలకు పాక్‌ పెట్టింది పేరు. ప్రార్థనా మందిరాలు, మైనార్టీ వర్గాలు, వారి ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడే చర్యలు సర్వసాధారణం’’ అని ఐరాసలో భారత ప్రతినిధి ఎల్డోస్‌ మాథ్యూ పున్నూస్‌ పేర్కొన్నారు. చర్చ సందర్భంగా జమ్మూకశ్మీర్‌ అంశాన్ని పాక్‌ లేవనెత్తడంపై స్పందించిన ఆయన.. అబద్ధాలు, నిరాధారమైన ఆరోపణల ద్వారా ఐరాస వేదికను పాకిస్థాన్‌ దుర్వినియోగం చేస్తూనే ఉందని మండిపడ్డారు.

* ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య జరిగిన దగ్గరినుంచి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోన్న కెనడా.. తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఇప్పుడు ఏకంగా భారత్‌పై ఆంక్షలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆ అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ రెచ్చగొట్టేలా స్పందించారు. నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మను చేర్చడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మళ్లీ భగ్గుమన్నాయి. దీనిపై తాజాగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో న్యూదిల్లీపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్‌ సహకరించడం లేదని ఆరోపించారు. అయితే, కెనడా ఆరోపణలు న్యూదిల్లీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వకుండా ఒట్టావా నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా కెనడా ప్రభుత్వం మన రాయబారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, పెద్దఎత్తున బురద జల్లే ప్రయత్నం చేస్తోందని తీవ్ర పదజాలంతో ఆక్షేపించింది.

* గుంటూరు వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. నగరంలోని శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూ.98కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వెల్లడించారు.

* జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొందరు మంత్రులకు రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఆ వివరాలివీ..

శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్‌
విజయనగరం- వంగలపూడి అనిత
పార్వతీపురం మన్యం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ- అచ్చెన్నాయుడు
విశాఖపట్నం- డోలా బాలవీరాంజనేయస్వామి
అల్లూరి సీతారామరాజు- గుమ్మిడి సంధ్యారాణి
అనకాపల్లి- కొల్లు రవీంద్ర
కాకినాడ- పొంగూరు నారాయణ
తూర్పుగోదావరి- నిమ్మల రామానాయుడు
ఏలూరు- నాదెండ్ల మనోహర్‌
పశ్చిమగోదావరి, పల్నాడు- గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్‌- సత్యకుమార్ యాదవ్‌
కృష్ణా- వాసంశెట్టి సుభాష్‌
గుంటూరు- కందుల దుర్గేష్‌
బాపట్ల- కొలుసు పార్థసారథి
ప్రకాశం- ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు- ఎన్‌ఎండీ ఫరూక్‌
నంద్యాల- పయ్యావుల కేశవ్‌
అనంతపురం- టీజీ భరత్‌
శ్రీసత్యసాయి, తిరుపతి- అనగాని సత్యప్రసాద్‌
వైఎస్‌ఆర్‌- ఎస్‌.సవిత
అన్నమయ్య- బీసీ జనార్దన్‌రెడ్డి
చిత్తూరు- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

* ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనల అనంతరం .. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన క్యాట్‌.. ప్రతివాదులైన కేంద్రం, డీవోపీటీలకు నోటీసులు ఇచ్చింది. నవంబరు 5లోపు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

* సమంత రూత్ ప్రభు, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ- బన్నీ. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈవెంట్‌లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నపై సామ్ ఈ విధంగా స్పందించింది.

* మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్‌ 20న, జార్ఖండ్‌కు రెండు విడతల్లో నవంబర్‌ 13న, 20న పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్స్ పోల్స్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ భారీ అంచనాలనే సృష్టిస్తాయని చెప్పారు. ఇందువల్ల ప్రజల్లో గంగరగోళం ఏర్పడుతోందని, ఈ విషయంలో మీడియా సహా భాగస్వామ్య పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి అవసరం ఉందని, స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు. అయితే ఈ ఎగ్జిట్‌ పోల్స్‌కు శాంపిల్‌ సైజ్‌ ఏంటి.,? సర్వేలు ఎక్కడ జరిగాయి. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే మన బాధ్యత ఎంతవరకు? అనే విషయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాలు.. తుది ఫలితాలకు మధ్య ఉండే తేడా.. పార్టీలకు, అభ్యర్థులకు, చివరకు ప్రజల్లో కూడా తీవ్ర నిరాశకు దారితీస్తోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z