Business

గోద్రెజ్ కుటుంబానికి 3400 ఎకరాలు-BusinessNews-Oct 16 2024

గోద్రెజ్ కుటుంబానికి 3400 ఎకరాలు-BusinessNews-Oct 16 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, త్రైమాసిక ఫలితాల సీజన్‌లో ముఖ్యమైన కంపెనీలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, విదేశీ మదుపర్ల విక్రయాలు వంటివి నష్టాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. దీంతో నిఫ్టీ మరోసారి 25వేల దిగువకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 81,646.60 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,820.12) నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం కాసేపు లాభాల్లోకి వచ్చినప్పటికీ.. ఎంతోసేపు సూచీలు నిలవలేదు. ఇంట్రాడేలో 81,358.26 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 318.76 పాయింట్ల నష్టంతో 81,501.36 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 86.05 పాయింట్ల నష్టంతో 24,971.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.00గా ఉంది.

* సోలార్‌ ప్యానెల్‌ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్‌ (Waaree Energies IPO) మార్కెట్‌ నుంచి రూ.4,321 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమైంది. అక్టోబర్‌ 21న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై 23న ముగుస్తుంది. యాంకెర్‌ ఇన్వెస్టర్లకు అక్టోబర్‌ 18నే బిడ్డింగ్‌ విండో తెరుచుకోనుంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ.1427-రూ.1503గా కంపెనీ నిర్ణయించింది. 9 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు. అంటే ఒక్కో లాట్‌ కొనుగోలుకు రూ.13,527 వెచ్చించాల్సి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 14 లాట్లను కొనుగోలు చేయొచ్చు. ఐపీఓలో భాగంగా రూ.3,600 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లను జారీ చేస్తున్నారు. రూ.721.44 కోట్ల విలువైన మరో 48 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) ద్వారా విక్రయించనున్నారు. ప్రమోటర్‌ అయిన వారీ సస్టైన్‌బుల్‌ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, షేరు హోల్డర్‌ అయిన చందూకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆఫర్‌ పర్‌ సేల్‌ ద్వారా వాటాలను విక్రయిస్తున్నాయి. రూ.65 కోట్ల విలువైన షేర్లను సంస్థ ఉద్యోగుల కోసం రిజర్వ్‌ చేసింది. క్యూఐబీలకు 50 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు 15 శాతం చొప్పున రిజర్వ్‌ చేశారు.

* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ తమ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్ల (ఎంసీఎల్‌ఆర్‌)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్‌ కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ను 8.20 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 8.45 శాతంగా ఉండేది. దీంతో పావు శాతం దిగినైట్టెంది. మంగళవారం నుంచే కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఆయా రుణాలను తీసుకున్న ఎస్బీఐ కస్టమర్లకు లాభించనున్నది.

* స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ సర్వే ప్రకారం.. ముంబైలోని విఖ్రోలి ప్రాంతంలో గోద్రెజ్‌ కుటుంబానికి 3,400 ఎకరాలకు పైగా భూమి ఉంది. విఖ్రోలిలోని ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే పక్కనే ఈ భూమి ఉంది. అయితే ఈ భూమిపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులతో కూడిన భూమి విలువను పరిగణనలోకి తీసుకుంటే, అది దాదాపు రూ.30,000 కోట్లు ఉండవచ్చు. పరిమితులను లేకుండా అయితే రూ.50,000 కోట్లకు పైగా ఉంటుందని రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. గ్రోద్రెజ్‌ తర్వాత ఎఫ్‌ఈ దిన్షా ట్రస్ట్ రెండవ స్థానంలో ఉంది. మలాడ్, పరిసర ప్రాంతాల్లో ఇది దాదాపు 683 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఎఫ్‌ఈ దిన్షా ఒక పార్సీ న్యాయవాది, ఫైనాన్సర్. 1936లో మరణించారు. ఈ భూమిని క్రమంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ వస్తోంది. ఇక మూడవ స్థానంలో ప్రతాప్‌సింగ్ వల్లభదాస్ సూర్జీ కుటుంబం ఉంది. ఈ కుటుంబానికి ముంబైలోని భాండూప్, దాని పరిసరాల్లో సుమారు 647 ఎకరాల భూమి ఉంది. నాల్గవ స్థానంలో ఉన్న జీజీబోయ్ అర్దేషిర్ ట్రస్ట్‌కు ముంబైలోని చెంబూర్‌లో 508 ఎకరాల భూమి ఉంది. ఆ తర్వాత ఏహెచ్‌ వాడియా ట్రస్ట్‌కు కుర్లాలో 361 ఎకరాలు ఉంది. ఇందులో చాలామటుకు ఆక్రమణకు గురైంది. సర్వే ప్రకారం ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బైరామ్జీ జీజీబోయ్ ట్రస్ట్ 269 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఇవే కాకుండా, సర్ ముహమ్మద్ యూసుఫ్ ఖోట్ ట్రస్ట్, వీకే లాల్ కుటుంబం వంటి ఇతర ప్రైవేట్ భూస్వాములకు కూడా ముంబైలోని కంజుర్‌మార్గ్, కండివాలి ప్రాంతంలో భారీగా భూములు ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z