* డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్‌లకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ట్రైబ్యునల్‌లో నవంబరు 4న విచారణ ఉందని, అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాది కోరారు. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాదాన్ని తేలుస్తాం.. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘మీరంతా బాధ్యతాయుతమైన అధికారులు.. ప్రజలకు ఇబ్బంది కలగనీయొద్దు. ఎవరు ఎక్కడ పనిచేయాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది. మరోసారి పరిశీలించాలని డీవోపీటీని ఆదేశించమంటారా? ’’ అని ధర్మాసనం అడిగింది. రీలీవ్ చేసేందుకు 15 రోజుల గడువు ఇవ్వాలని రెండు రాష్ట్రాలు డీవోపీటీని కోరాయని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గత పదేళ్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని వాదనలు వినిపించారు. క్యాట్ తుది తీర్పు ఇచ్చే వరకు రిలీవ్ చేయవద్దని కోరారు.
* బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అఖండ 2 – తాండవం’ (Akhanda 2). తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని, ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో సందడి చేశారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్‌కు బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
* వరంగల్ జిల్లా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కూలి పనులు చేస్తూ కష్టపడి తమ బిడ్డలను చదివించినందుకు ప్రతిఫలంగా సర్కార్ ఉద్యోగాలు రావడం ఆనందంగా ఉందని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
* కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సీఈసీ, ఉత్తరాఖండ్ అదనపు సీఈవో విజయ్‌కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ప్రతికూల వాతావరణం కారణంగా అత్యవసర ల్యాడింగ్ చేశారు.
* భారత్‌కు చెందిన పలు విమానాలకు బాంబు బెదిరింపుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజులుగా 12 విమాన సర్వీసులకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఆకాశ, ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
* అన్న క్యాంటీన్‌లకు తెదేపా రంగులు వేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో గ్రామ సచివాలయాలకు బ్లూ కలర్ తొలగించాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
* ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా 3శాతం డీఏ పెంపునకు ఆమోదం తెలిపింది. అలాగే, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్(PM-AASHA)కు రూ.35వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్-యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి పచ్చజెండా ఊపింది. 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు గాను రబీ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ను పెంచింది. క్వింటాల్ గోధుమపై ఎంఎస్‌పీని తాజాగా రూ.150కు పెంచడంతో గతంలో రూ.2275గా ఉన్న కనీస మద్దతు ధర రూ.2425కి పెరిగినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
* కూకట్‌పల్లిలో 1980లో కాంగ్రెస్ ప్రభుత్వమే 20 వేల మందికి పట్టాలు ఇచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అవే ఇళ్లను ఇప్పుడు ఆక్రమణలని అంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు అండగా ఉంటామని.. రక్షణ కవచంలా నిలుస్తామన్నారు. రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు తాము అడ్డంగా నిలబడతామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎస్టీపీలు(మురుగు నీటి శుద్ధి కేంద్రాలు), ఎస్‌ఎన్‌డీపీ పనులను పరిశీలిస్తామని పేర్కొన్నారు.
* నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 15 కి.మీ వేగంతో దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 280 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు.. నెల్లూరుకు 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ప్రకటించింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
* భారత విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలకు గత మూడురోజులుగా వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. మూడురోజుల్లో 12 విమానాలకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దాంతో విమాన సంస్థల యాజమాన్యాలు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలు కలకలం రేపుతోన్న తరుణంలో.. ఈ వ్యవహారంపై ‘రవాణాపై పార్లమెంటరీ స్థాయి సంఘం’ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తొలుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులు, డీజీసీఏ (Directorate General of Civil Aviation) ఈ అంశంపై చర్చించి ఆ వివరాలను కమిటీకి వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనల్లో కొంతమంది అనుమానితుల జాడ గుర్తించినట్లు, కీలక సమాచారాన్ని సేకరించామని చెప్పినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
* జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) లీడర్ ఒమర్ అబ్దుల్లా (Omar Abdulla) ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయగా.. ఆయనతో పాటు ప్రమాణం చేసిన మంత్రుల్లో ఒకే ఒక్క మహిళ ఉన్నారు. ఆమే సకీనా ఈటూ (Sakina Itoo).
* ఎన్డీయే ప్రభుత్వం ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు తేల్చి చెప్పారు. కేబినెట్ సమావేశం అనంతరం ఉచిత ఇసుక విధానంపై అమాత్యులతో ఆయన కీలకంగా చర్చించారు. ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. 10 రోజుల్లో మార్పు రాకుంటే ఉపేక్షించనని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక విరివిగా దొరకాలన్నారు. అన్ని బంధనాలు తొలగించి, రవాణా, తవ్వకం ఛార్జీలు కూడా వీలైనంత తక్కువ ధర ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉచిత ఇసుక అందించి తీరాలని తేల్చి చెప్పారు. ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయవద్దని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమాలు జరగకుండా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కొందరు మంత్రులు సీఎం దృష్టికి తెచ్చారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని.. ఇకపై అలా ఉండకూడదని సీఎం వివరించారు.
* గత ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కోచింగ్ బృందంలో మార్పులు చేస్తోంది. మొన్నటివరకు హెడ్ కోచ్‌గా ఉన్న మార్క్ బౌచర్‌ను తొలగించి తిరిగి మహేల జయవర్ధెనెకు ఆ బాధ్యతలు అప్పగించింది. తాజాగా టీమ్‌ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే (Paras Mhambrey)ను కోచింగ్ బృందంలోకి తీసుకుంది. ప్రస్తుతం బౌలింగ్ కోచ్‌గా ఉన్న లసిత్ మలింగతో కలిసి మంబ్రే పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ముంబయి ఇండియన్స్ సామాజిక మాధ్యమాల్లో బుధవారం ప్రకటించింది. పరాస్ గతంలోనూ ముంబయి ఇండియన్స్ కోచింగ్ బృందంలో భాగంగా ఉన్నాడు. టీమ్‌ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత జట్టుకు మంబ్రే బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.
* పాకిస్థాన్‌లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు (SCO Summit)లో మాట్లాడిన భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar).. షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రభుత్వానికి చురకలు వేశారు. సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించి విమర్శలు చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నమ్మకం, సహకారం, స్నేహం లోపిస్తే పొరుగువారు దూరమవుతారని వ్యాఖ్యానించారు.
* వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. వైకాపా అధికారంలో ఉండగా 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన మూకలు తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. దీనిపై కేసు నమోదు కావడంతో ఇప్పటికే పలువురు వైకాపా నేతలను పోలీసులు విచారించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z