* భారత సాయుధ దళాల్లో (Indian armed forces) పని చేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఐఏఎఫ్, ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దీన్ దయాళ్ దీప్ (32) ఆగ్రా (Agra)లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా (IAF officer) పని చేస్తున్నారు. అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో అతడి భార్య రేణు తన్వర్ ఆర్మీలో కెప్టెన్‌గా (Army officer) విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే.. ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం దిల్లీకి (Delhi) వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. ఒకేరోజు ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. భోజన సమయంలో దీప్ తమతో సరదగానే మాట్లాడారని.. అప్పుడు అతడి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని సహోద్యోగుల్లో ఒకరు వెల్లడించారు. ఉదయం ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి చూసేసరికి దీప్ విగతజీవిగా కనిపించారని పోలీసులకు తెలిపారు. మరోవైపు.. అదేరోజు తన్వర్ కూడా దిల్లీ కంటోన్మెంట్‌లోని అధికారుల మెస్ హాల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
* వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారించాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. సజ్జల వెంట న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తదితరులు ఉన్నారు. సజ్జలతో పాటు విచారణాధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని పొన్నవోలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వేలు చూపించి మరీ పోలీసులను బెదిరించారు. అయితే, విచారణ సమయంలో న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. దీనికి కోర్టు అనుమతి తప్పనిసరి అని, ప్రస్తుతం విచారణకు సజ్జలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో సజ్జల ఒక్కరే పోలీస్‌స్టేషన్ లోకి వెళ్లారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు విచారిస్తున్నారు.
* సీఎం రేవంత్ లోపభూయిష్ట విధానాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. పరీక్షలు రాస్తామో, రాయలేమోనన్న బాధలో వారున్నారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో భారాస విద్యార్థి విభాగం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ ప్రభుత్వ విధానాలతో రైతులు, యువకులతో పాటు అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నవంబర్ 5న ధర్నా చేస్తున్నామని ఆటో డ్రైవరు చెప్పారన్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నారని కొంతమంది వచ్చి ఫిర్యాదు చేశారని కేటీఆర్ తెలిపారు.
* బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)పై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT of Bangladesh) ఈ వారెంట్ ఇచ్చింది. నవంబరు 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
* ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య శత్రుత్వం గురించి ప్రపంచమంతటా తెలిసిందే. ఇరుదేశాల మధ్య వైరం కొనసాగుతోంది. ఈక్రమంలో ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణకొరియాను శత్రుదేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో మార్పులు చేపట్టినట్లు ఉత్తర కొరియా తాజాగా వెల్లడించింది.
* ఇరాన్‌పై ప్రతిదాడి చేస్తే ఆ తర్వాత చోటు చేసుకొనే పరిణామాలకు ఇజ్రాయెల్ బాధపడాల్సి ఉంటుందని ఐఆర్‌జీసీ చీఫ్ హసన్ సలామీ హెచ్చరించారు. ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పొరబాటున కూడా ఈ ప్రాంతంలో లేదా ఇరాన్‌పై గానీ దాడి చేస్తే.. మేము కచ్చితంగా తీవ్రంగా సమాధానం చెబుతాం’’ అని సలామీ పేర్కొన్నారు. అమెరికా పంపించిన థాడ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఏమాత్రం ఆధారపడదగినది కాదని సలామీ విమర్శించారు. తమపై దాడులు చేసి ఎవరూ సురక్షితంగా ఉండలేరన్నారు. ఇజ్రాయెల్ బలహీనతలు తమకు బాగా తెలుసని పేర్కొన్నారు.
* అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని వలసల వ్యవస్థపై ఉపాధ్యక్షురాలు రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమస్య ప్రధానమైనది. ఈ సమస్య పరిష్కారంపై మేం దృష్టిసారించాం. అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై సంతకం చేస్తాను. ఈ బిల్లులో వలసల సమస్య పరిష్కారానికి వనరులు పెంచడం, ఎక్కవమంది న్యాయమూర్తులను నియమించడం, జరిమానాలు కఠినతరం చేయడం వంటి అంశాలు ఉంటాయి. సరిహద్దులను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌లోని సంప్రదాయ సభ్యులతో సహా ద్వైపాక్షిక ప్రయత్నానికి మద్దతుగా 1,500 మంది బోర్డర్ ఏజెంట్లను నియమిస్తాం. ఇది అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు, సరిహద్దుల వెంబడి దేశంలోకి వస్తున్న మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. మరో 20 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఈ సమస్యను పరిష్కరించగలిగే అధ్యక్షుడు ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు’ అని హారిస్ పేర్కొన్నారు.
* యెమెన్‌లో హూతీ రెబల్స్‌పై అమెరికా తీవ్రస్థాయిలో దాడి చేసింది. ఏకంగా బి-2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. గురువారం తెల్లవారుజామున యెమెన్‌పై దాడులు చేసింది. ఈవిషయాన్ని రక్షణ మంత్రి లాయిండ్ ఆస్టిన్ స్వయంగా వెల్లడించారు. మొత్తం ఐదు అండర్‌గ్రౌండ్ ఆయుధ డిపోలను బి-2 స్టెల్త్ బాంబర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఎర్ర సముద్రంలో పౌర నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి హూతీలు వినియోగించే ఆయుధాలను భద్రపర్చే డిపోలని ముగ్గురు అమెరికా అధికారులు సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. ‘‘మా నుంచి తప్పించేందుకు వీలుగా శత్రువులు తమ ఆయుధాలను ఎంత లోతుగా దాచినా వదిలిపెట్టమన్న విషయం ఈ దాడితో నిరూపితమైంది. ఇక మా వాయుసేన బీ-2 స్టెల్త్ బాంబర్ వినియోగంతో.. అవసరమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాడి చేయడంలో మాకున్న సామర్థ్యం ఏమిటో చెప్పినట్లైంది. హూతీల సామర్థ్యాన్ని కుప్పకూల్చాలని అధ్యక్షుడు జోబైడెన్ జారీ చేసిన ప్రత్యేక ఆదేశాల మేరకే ఈ దాడిని చేపట్టాం. వారు భవిష్యత్తులో చేసే దాడులకు తీవ్ర పరిణామాలుంటాయని మేము హెచ్చరిస్తున్నాం’’ అని లాయిడ్ ఆస్టిన్ వ్యాఖ్యానించారు.
* ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో (Justin Trudeau) వ్యాఖ్యలు చేసినప్పటినుంచి భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ దౌత్య సంబంధాలను పణంగా పెట్టి, ట్రూడో తన నోటికి పనిచెప్తూనే ఉన్నారు. ఈ తరుణంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ.. కెనడా ప్రధానికి రాసిన పాత లేఖ వైరల్‌గా మారింది. నిజ్జర్ హత్యలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పాత్ర ఉందని ఆరోపిస్తూ, ఆయనను బహిష్కరించాలని ఆ లేఖలో కోరాడు. ఈ బహిష్కరణ వెంటనే జరగకపోతే.. కెనడాలో చురుకుగా ఉన్న భారత ఏజెంట్ల చేతుల్లో మరికొంతమందికి హాని జరగొచ్చని తాము భయపడుతున్నామని అందులో పేర్కొన్నాడు. అలాగే నిజ్జర్ శాంతిని కోరుకొనే, చట్టాన్ని గౌరవించే కెనడా పౌరుడని అందులో పేర్కొనట్లు సమాచారం.
* ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసులో నిందితుడు, వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ రిమాండ్ పొడిగించారు. విజయవాడ నాలుగో ఏసీఎంఎం కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో ఆయన ఏ1గా చేర్చారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
* పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం అని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ ఆహ్వానమంటూ స్వాగతించారు. ఏపీ ఇప్పుడు కొత్త అత్యుత్తమ విధానాలతో ఆహ్వానం పలుకుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యాపార అనుకూల రాష్ట్రమని చెప్పారు. కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను పరిశ్రమ అనుభవజ్ఞులతో రూపొందించామన్నారు.
* అన్నాడీఎంకే పార్టీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) ఈ పార్టీని స్థాపించి తమిళనాడులో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగారన్నారు. పేదలు, అన్నార్థులకు సాయం చేశారని.. వారికి హుందాగా జీవించే హక్కును కల్పించారని కొనియాడారు. ఆయన పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా చేపట్టారని.. తమిళనాడును దేశంలో సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు.
* భారీవర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో తితిదే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి మెట్టు కాలినడక మార్గాన్ని తితిదే మూసివేసింది. కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటోంది. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలగకుండా తితిదే ఏర్పాట్లు చేసింది. మరోవైపు వాయుగుండం తీరం దాటాక వర్షాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
* పెట్టుబడి దారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ ఆహ్వానమంటూ స్వాగతించారు. ఏపీ ఇప్పుడు కొత్త అత్యుత్తమ విధానాలతో ఆహ్వానం పలుకుతోందన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన చండీగఢ్‌లో ఎన్డీయే సీఎంల కౌన్సిల్ సమావేశం జరిగింది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్ , మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, ఒడిశా, మణిపూర్, ఛత్తీస్‌గఢ్, సీఎలు హాజరయ్యారు.
* జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబై వస్తున్న విస్తారా విమానానికి (Vistara flight) బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. 134 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బందితో విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 787 బోయింగ్ విమానం మంగళవారం రాత్రి 8:20 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంక్‌ఫర్ట్ (Frankfurt) నుంచి ముంబైకి (Mumbai) బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7.45 గంటలకు ఆ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు విస్తారా అధికారి తెలిపారు. అనంతరం విమానాన్ని భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ రన్‌వేకు పంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, దేశంలో విమానాలకు వరుసగా వస్తున్న బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో 19 విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
* బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు కివీస్ ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపించారు. పర్యాటక జట్టు పేసర్ల దాటికి భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు. వచ్చినవారు వచ్చినట్లగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లతో అదరగొట్టగా.. యువ పేసర్ విలియం ఓ రూర్క్ 4 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్‌ఖాన్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ(2), జైశ్వాల్(13) పరుగులు మాత్రమే చేశారు. కాగా భారత్‌కు ఇది టెస్టుల్లో మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.
* ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. పార్టీ కండువా కప్పి ఆయనను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
* తీవ్రమైన కిడ్నీసమస్యలతో బాధపడుతున్న హెచ్‌ఐవీ (HIV) రోగులకు భారీ ఊరట లభించనుంది. హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమని కొత్త అధ్యయనంద్వారా వెల్లడైంది. హెచ్‌ఐవీఉన్న వ్యక్తులు, ఎయిడ్స్ వైరస్‌తో జీవిస్తున్న వ్యక్తుల నుంచి కిడ్నీలను సురక్షితంగా స్వీకరించవచ్చని ఈ స్టడీ తేల్చింది. జీవించి ఉన్నపుడు ఇచ్చినా, లేదా మరణం తరువాత కిడ్నీలను దానం చేసినా రెండింటినీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చని తెలిపింది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ప్రచురించబడిన ఈ కొత్త అధ్యయనాన్ని అమెరికాలో నిర్వహించారు. 198 కిడ్నీ మార్పిడికేసులను పరిశీలించి, దానం చేసిన అవయవం ఎయిడ్స్ వైరస్ ఉన్న వ్యక్తి నుండి వచ్చినా లేదా లేని వ్యక్తి నుండి వచ్చినా ఇదే ఫలితాలను పరిశోధకులు గుర్తించారు. గత నెలలో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిశోధనా అధ్యయనాల ప్రకారం ఈ రకమైన మూత్రపిండాలు , కాలేయ మార్పిడిని అనుమతించే నియమ మార్పును ప్రతిపాదించింది. దీనికి ఆమోదం లభిస్తే ఇది రాబోయే సంవత్సరంలో అమల్లోకి వస్తుందని రావచ్చు. హెచ్‌ఐవీ పాజిటివ్, కిడ్నీ ఫెయిల్ అయిన రోగులపై ఈ అధ్యయనం జరిగింది. HIV-పాజిటివ్‌తో మరణించిన దాత లేదా HIV-నెగటివ్ మరణించిన దాత నుండి అవయవాన్ని స్వీకరించి,నాలుగేళ్లపాటు ఈ పరిశోధన నిర్వహించారు. అలాగే హెచ్‌ఐవీ పాజిటివ్ దాతల నుంచి కిడ్నీలు పొందిన సగం మందిని హెచ్‌ఐవీ లేని దాతల నుంచి వచ్చిన వారితో పోల్చారు. వీరిలో 13మంది రోగులకు,ఇతర సమూహంలోని నలుగురికి వైరస్ స్థాయిలు పెరిగాయి. దీనికి హెచ్‌ఐవీ మందులను సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ‍్చని NYU లాంగోన్ హెల్త్‌కు చెందిన అధ్యయన సహ-రచయిత డాక్టర్ డోరీ సెగెవ్ చెప్పారు. తమ పరిశోధన అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z