* సుప్రీంకోర్టు (Supreme Court) చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ క్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అమలులోకి తీసుకురానున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. యూట్యూబ్ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ ‘సేన vs సేన’ కేసుపై జరిగింది. మహారాష్ట్ర శివసేన పార్టీలో శిందే వర్గం తిరుగుబాటు, ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, శిందే వర్గాల మధ్య పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.
* ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ అధినేత యాహ్యా సిన్వర్ (Yahya Sinwar) మృతి చెందినట్లు హమాస్ సైతం ధ్రువీకరించింది. పాలస్తీనా కోసం చివరి వరకు పోరాడి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అయితే, తమ ప్రాంతంపై బాంబు దాడులు ఆపి, ఇజ్రాయెల్ (Israel) దళాలు ఉపసంహరించుకొని, యుద్ధం ముగించే వరకు బందీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ తేల్చి చెప్పింది.
* రూ.25వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేయవచ్చని, మూసీ సుందరీకరణకు రూ.1.50లక్షల కోట్లు ఎందుకని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండానే మూసీని ప్రక్షాళన చేయవచ్చన్న ఆయన .. గత ప్రభుత్వాలు మూసీని మురికి కూపంలా మార్చాయన్నారు. 31 ఎస్టీపీలు పూర్తయితే మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందని.. ఎస్‌ఎన్‌డీపీని ప్రారంభించడం వల్లే మురికినీరు నిల్వ ఉండటం లేదన్నారు. మూసీ ప్రక్షాళనపై తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్.. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చి ఉంటే రెండో దశ ఎస్‌ఎన్‌డీపీని ప్రారంభించేవాళ్లమన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండో దశ ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టును రద్దు చేసిందని ఆరోపించారు. తుది దశలో ఎస్టీపీలు, సీనరేజి ప్లాంట్‌లు ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం రూ.1100 కోట్లతో నల్గొండకు శుద్ధమైన నీరు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.
* ప్రజాకోర్టులో ఎన్డీయే ప్రభుత్వం గెలిచిందని, పరువు నష్టం కేసులో కూడా గెలుస్తామనే నమ్మకం ఉందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు ఎలాంటి విషపు రాతలు రాశారో.. ఇప్పుడూ అలాగే బ్లూ మీడియా విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు. తనపై చేసిన ఒక్క ఆరోపణను కూడా వైకాపా నిరూపించలేకపోయిందన్నారు. ‘‘ప్రజలు మా కుటుంబాన్ని దీవించి ఆరుసార్లు అవకాశమిచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాలను వారికి సేవ చేసేందుకే వినియోగించాం. బ్లూ మీడియాలో ఎలాంటి మార్పు రాలేదు.. ఇంకా తప్పుడు వార్తలు వేస్తున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం’’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
* యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు వెళ్లే భారతీయులు ఇక సులువుగా వీసా పొందవచ్చు. యూఏఈలో దిగిన వెంటనే వీసా పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం వీసా-ఆన్-అరైవల్ (Visa-on-Arrival)ను యూఏఈ ప్రారంభించినట్లు అక్కడున్న భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అర్హత కలిగిన భారతీయ పౌరులు.. 14 రోజుల వ్యవధితో కూడిన వీసాను యూఏఈ ఎయిర్‌పోర్టులోనే పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. వీసా-ఆన్-అరైవల్ సదుపాయానికి సంబంధించి పలు అంశాలను భారత్ రాయబార కార్యాలయం వెల్లడించింది. అమెరికా జారీచేసిన గ్రీన్ కార్డు లేదా చెల్లుబాటయ్యే వీసా, యురోపియన్ యూనియన్ దేశాలు, యూకే దేశాలు ఇచ్చిన రెసిడెన్స్, వీసాలు కలిగి ఉన్నవారు వీటిని పొందవచ్చు. పాస్‌పోర్టు కనీసం 6 నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. తొలుత 14 రోజుల వ్యవధితో కూడిన వీసా పొందవచ్చని, మరో 14రోజులు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. లేదా పొడిగింపునకు వీలుకాని 60 రోజుల వ్యవధితో కూడిన వీసాను తీసుకునే వెసులుబాటు ఉంది.
* తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 వల్ల గ్రూప్-1 అభ్యర్థులకు నష్టం జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమేనని విమర్శించారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. 15వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి.. 60వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారని, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదని విమర్శించారు.
* నటి రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) ఇటీవల గాయపడ్డారు. ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్న ఆమె తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం. స్వేచ్ఛగా తిరుగుతున్నందుకు ఎంత కృతజ్ఞతతో ఉండాలో తరచూ మనం మర్చిపోతుంటాం’’ అని పేర్కొన్నారు. #LifeLearning (లైఫ్ లెర్నింగ్) హ్యాష్‌ట్యాగ్ జోడించారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా వెన్నుకు గాయం కావడం.. దానిని ఆమె లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొనడంతో నొప్పి తీవ్రమైంది. దీంతో, కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఇలా పోస్ట్‌లతో పలకరిస్తున్నారు.
* మనిషి రక్తమాంసాల రుచి మరిగి.. ఉదయ్‌పుర్‌వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుత పులి(Leopard)ని అధికారులు ఎట్టకేలకు మట్టుబెట్టారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మదర్ గ్రామానికి సమీప ప్రాంతంలో చిరుతను గుర్తించి.. దానిని హతమార్చినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజయ్ చిత్తోరా పేర్కొన్నారు. నివేదికలు వచ్చిన అనంతరం అది మనుషుల రక్తం రుచి మరిగిన చిరుతేనా, కాదా అనే విషయం పూర్తిస్థాయిలో నిర్ధరణ అవుతుందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా వరుసగా చిరుత దాడి ఘటనలు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే ఒంటరిగా రావొద్దని.. గుంపులుగా రావాలని సూచించారు. చిరుతపులుల భయానికి ఆ ప్రాంతంలో పాఠశాలలు కూడా మూతపడ్డాయి. సెప్టెంబరు 18 నుంచి ఇప్పటి వరకు చిరుత దాడుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. విష్ణుగిరి అనే 65 ఏళ్ల పూజారి ఆలయ సమీపంలో నిద్రిస్తుండగా.. చిరుత దాడి చేసి హతమార్చింది. బుధవారం సైతం చిరుత ఇద్దరు మహిళలపై దాడి చేయడంతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. దీంతో చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు బోన్లు, కెమెరా ట్రాప్‌లను అమర్చారు. అయితే అది మనుషుల రక్తం రుచి మరిగింది కావడంతో చిరుత కనిపిస్తే కాల్చేయాలని ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు మూడు చిరుతలు పట్టుబడినట్లు పేర్కొన్నారు.
* కోడికత్తి కేసు విచారణకు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ హాజరయ్యాడు. న్యాయవాది సలీం, దళిత సంఘాల నేత బూసి వెంకటరావుతో కలిసి విశాఖలోని ఎన్‌ఐఏ కోర్టుకు వచ్చాడు. ఈ సందర్భంగా సలీం, బూసి వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న నారా లోకేశ్ పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయ్యారని.. సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న జగన్ ఎందుకు రావడం లేదని సలీం ప్రశ్నించారు. బూసి వెంకటరావు మాట్లాడుతూ జైల్లో ఉన్న వ్యక్తులను కలిసేందుకు వెళ్లినపుడు లేని అభ్యంతరం.. కోర్టులో న్యాయమూర్తి ముందు సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్‌కు అభ్యంతరమేంటని నిలదీశారు.
* రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఇసుక తీసే కాంట్రాక్టులను అధికార పార్టీ మనుషులకే కట్టబెట్టారని ఆరోపించారు. తాడేపల్లిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. రెండు రోజులు మాత్రమే టెండర్‌కు సమయం ఇచ్చారని.. అందరూ పండగ బిజీలో ఉంటే దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా ఇసుక విధానం తీసుకొచ్చామన్నారు. దోపిడీకి అవకాశం లేని విధంగా చేశామని చెప్పారు.
* జగన్ కుట్రలన్నీ సమర్థంగా తిప్పికొడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రోజుకో అబద్ధం చెప్పి పెట్టుబడులు రాకుండా చూడాలన్నది జగన్ కుట్ర అని విమర్శించారు. ఆ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
* నిత్య పెళ్లికొడుకులా మారి పలు పెళ్లిళ్లు చేసుకున్న ఓ ఆర్మీ జవాన్‌పై యూపీలోని మేరఠ్‌లో కేసు నమోదైంది. ఆర్మీలో పనిచేస్తున్న మనీష్ కుమార్ గత పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని హైదరాబాద్‌కు చెందిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హరియాణాకు చెందిన మనీష్ కుమార్ 2015లో హైదరాబాద్‌లో తనకు పరిచయం అయ్యారని.. తర్వాత తాము వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపింది. మొదట్లో బాగానే ఉన్నా.. కొన్ని రోజుల తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను తరచూ వేధింపులకు గురిచేసేవాడని బాధిత మహిళ తెలిపింది. 2018లో తాను గర్భం దాల్చినప్పుడు అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడని, అతడి మాట వినపోవడంతో తనను విడిచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మనీష్ ఆచూకీ కోసం వెతకగా.. అప్పటికే అతడికి మూడు పెళ్లిళ్లు జరిగిన విషయం తనకు తెలిసిందని ఆమె పోలీసులకు వెల్లడించింది. ఆ తర్వాత తాను మారినట్లు చెప్పి కొంత కాలం పాటు తన దగ్గరే ఉన్నాడని.. తనకు కుమారుడు పుట్టిన అనంతరం మరోసారి అదృశ్యమయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత మేరఠ్‌లోని ఓ కాలనీలో ఇద్దరు మహిళలతో అతడు దొరికినట్లు చెప్పింది. ఈ ఘటనపై మొదట కంకరఖేడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అక్కడి పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని, అందుకే జిల్లా ఎస్‌ఎస్‌పీ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్(Drugs) స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఫారిన్ పోస్ట్ ఆఫీస్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.21కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులోని ఫారిన్ పోస్ట్ ఆఫీస్ వద్ద నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ కస్టమ్స్ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో దాదాపు 606 డ్రగ్స్ పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిని అమెరికా, బెల్జియం, యూకె, థాయ్‌లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z