* జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై (GST rationalisation) ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని నిర్ణయించింది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్, సైకిళ్లు, ఎక్సర్‌సైజ్ నోట్‌బుక్స్ వంటి వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. అదే సమయంలో ఖరీదైన షూస్, చేతి వాచీలపై పన్ను పెంచాలని ప్రతిపాదించనుంది. బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం భేటీలో దీనిపై చర్చ జరిగింది. దీనివల్ల రూ.22వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుంది. ప్రస్తుతం 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్‌పై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. దీన్ని 5 శాతానికి తగ్గించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. అలాగే రూ.10 వేల్లోపు ధర కలిగిన సైకిళ్లపై 12 శాతం 5 శాతానికి తగ్గించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. నోట్ బుక్స్‌పైనా జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ఈ నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తే ఆ మేర ఊరట కలగనుంది.
* రిలయన్స్, డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. విలీనానంతరం కేవలం ఒక్క ఓటీటీ (OTT) మాత్రమే ఉంచేందుకు రిలయన్స్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో (Disney+ Hotstar) జియో సినిమాను (Jio Cinema) విలీనం చేయబోతున్నారని సమాచారం. రెండు సంస్థలను కలిసి జియో హాట్‌స్టార్‌గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇకపై క్రికెట్ మ్యాచ్‌లన్నీ హాట్‌స్టార్‌లోనే వీక్షించాల్సి ఉంటుందన్నమాట.
* ప్రముఖ ఇ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల దసరా సందర్భంగా ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఆఫర్లు తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా ‘బిగ్ దీపావళి సేల్’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి ఈ సేల్ మొదలవుతుందని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా వీఐపీ కస్టమర్లకు ఒక రోజు ముందుగానే ఈ విండో తెరుచుకోనుంది.
* ప్రైవేటు రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ త్రైమాసిక ఫలితాలను (HDFC Bank Q2 results) ప్రకటించింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.16,821 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15,976 కోట్లతో పోలిస్తే నికర లాభం 5 శాతం మేర వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం సైతం రూ.78,406 కోట్ల నుంచి రూ.85,500 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వడ్డీ ఆదాయం రూ.67,698 కోట్ల నుంచి రూ.70,017 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. నికరంగా రూ.30,110 కోట్లు వచ్చినట్లు తెలిపింది. బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 1.34 శాతం నుంచి 1.36 శాతానికి పెరగ్గా.. నికర ఎన్‌పీఏలు సైతం 0.35 శాతం నుంచి 0.41 శాతానికి చేరినట్లు తెలిపింది. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్ 6 శాతం వృద్ధితో రూ.17,826 కోట్లు లాభాన్ని నమోదు చేసింది.
* పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. సాధారణ పౌరులకు నిర్దేశిత పరిమితి వరకు మినహాయింపు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య, సాధారణ బీమా ప్రీమియంలపై జీఎస్టీ విధించే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం శనివారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలను మినహాయించాలన్న చర్చ జరిగింది. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు రూ.5 లక్షల వరకు తీసుకునే ఆరోగ్య బీమాపై జీఎస్టీ నుంచి మినహాయించాలని సమావేశంలో నిర్ణయించారు. రూ.5 లక్షల కవరేజీ దాటితే 18 శాతం జీఎస్టీ విధించనున్నారు. సీనియర్ సిటిజన్లకు మాత్రం కవరేజీతో సంబంధం లేకుండా.. జీఎస్టీ నుంచి మినహాయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో మంత్రివర్గ సహచరుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైందని బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి తెలిపారు.
* ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా (Tech Mahindra) రెండో త్రైమాసిక ఫలితాలను (Q2 results) శనివారం ప్రకటించింది. లాభాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 153.1శాతం పెరిగి రూ.1,250 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.493.9 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం పెరిగిందని టెక్ మహీంద్రా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
* గృహ రుణ వడ్డీ రేట్లు 9 శాతాన్ని మించితే, ఇల్లు కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతుందని ఓ సర్వేలో దాదాపు 90 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఫిక్కీ, స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ కలిసి 7,615 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాయి ‘8.5 శాతం దిగువనే వడ్డీ రేట్లు ఉంటే.. ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని సర్వేలో 71% మందికి పైగా చెప్పారు. ఒకవేళ వడ్డీరేటు 9 శాతాన్ని మించితే గృహ కొనుగోలు నిర్ణయంపై గణనీయంగా ప్రభావం చూపుతుందని 87% మంది తెలిపారు. వడ్డీ రేట్లు 8.5- 9% మధ్య ఉంటే తమ నిర్ణయంపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54% మంది చెప్పార’ని ఆ సర్వేలో తేలిందట. ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ పేరుతో ఈ నివేదికను శుక్రవారం ఫిక్కీ, అనరాక్ విడుదల చేశాయి. దీని ప్రకారం..పెట్టుబడులకు స్థిరాస్తులను అత్యంత ప్రాధాన్య మార్గంగా భావిస్తున్నట్లు 59% మంది వెల్లడించారు. తమ స్వీయ వినియోగం కోసమే స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 67% మంది తెలిపారు. గృహ కొనుగోలుకు, రూ.45- 90 లక్షల బడ్జెట్‌కు 35% మంది ప్రాధాన్యమిస్తుండగా.. రూ.90 లక్షలు- రూ.1.5 కోట్ల విలువైనవి కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు 28% మంది తెలిపారు. నిర్దిష్ట సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది 98% మంది గృహ కొనుగోలుదార్ల డిమాండు కాగా.. నిర్మాణ నాణ్యత మెరుగవ్వాలని 93% మంది, గాలి-వెలుతురు ఇంట్లోకి బాగా రావాలని 72% మంది కోరుకుంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z