* ఆధార్ తరహాలో విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ.. ‘అపార్’కు (APAAR) రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. వన్ నేషన్-వన్ స్టూడెంట్ ఐడీ పేరిట కేంద్ర విద్యాశాఖ 12 అంకెలతో కూడిన కార్డును కేటాయిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల అకడమిక్ వివరాలతో పాటు వారి ధ్రువపత్రాలను డిజిటల్‌గా భద్రపరిచేలా ఈ ‘అపార్’ కార్డుకు రూపకల్పన చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని విద్యార్థులకు ‘అపార్’ కార్డు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
* వైఎస్‌ఆర్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి కేసును బద్వేలు పోలీసుల ఛేదించారు. కడప శివారులో నిందితుడు విఘ్నేష్‌ను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు జిల్లా ఎస్పీ వివరించారు. పథకం ప్రకారమే విఘ్నేష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. ‘‘బాధిత బాలిక (16)కు, నిందితుడు విఘ్నేష్‌తో ఐదేళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. విఘ్నేష్ కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతడికి వివాహం కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి ఫోన్ చేసి తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాంతో ఆ బాలిక శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేష్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆ ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు పది కి.మీ. దూరంలో ఉన్న సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ వద్ద ఆటో దిగారు. సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లి ఇద్దరూ కాసేపు సరదాగా గడిపారు. తనను పెళ్లి చేసుకోవాలని బాలిక అడగడంతో ఆగ్రహంతో రగిలిపోయిన విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2.30గంటలకు బాలిక మృతి చెందింది.
* వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (champions trophy 2025)లో టీమ్‌ఇండియా ఆడుతుందా?లేదా?అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్‌ను కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి అందించింది. భద్రతా, రవాణాపరమైన కారణాల దృష్ట్యా భారత జట్టును లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. అయినా, పాకిస్థాన్‌కు వెళ్లేందుకు టీమ్‌ఇండియా సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు పాక్‌కి వెళ్లడానికి కచ్చితంగా నిరాకరిస్తుందనే ఉద్దేశంతోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మార్చి 9న జరిగే ఫైనల్స్‌కి టీమ్‌ఇండియా అర్హత సాధించినా లాహోర్‌లో తప్ప మరెక్కడా మ్యాచ్‌ని జరపడానికి పీసీబీ ఇష్టపడట్లేదని తెలుస్తోంది.
* నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (unstoppable). ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షో సరికొత్త సీజన్ (అన్‌స్టాపబుల్ సీజన్ 4) (Unstoppable 4 with NBK) త్వరలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్ షూట్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ మేరకు చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి అన్‌స్టాపబుల్ సెట్‌లోకి బాలయ్య ఆహ్వానించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చంద్రబాబు ఈ టాక్ షోలో పాల్గొనడం ఇది తొలిసారి కాదు. ‘అన్‌స్టాపబుల్ సీజన్ 3’లోనూ ఆయన పాల్గొన్నారు. తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆద్యంతం సరదాగా సాగిన ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అక్టోబర్ 25 నుంచి కొత్త సీజన్ ప్రసారం కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఎపిసోడ్‌తో సీజన్-4 ప్రారంభం కానుంది. అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, ‘కంగువా’ చిత్రబృందం ఈ సీజన్‌లో సందడి చేసే అవకాశం ఉందని సమాచారం.
* గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు వస్తోన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇటీవల బిగ్‌బాస్ షూట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షూట్‌కు సంబంధించిన ఒక ఎపిసోడ్ శనివారం ప్రసారమైంది. ముందు ఉన్నంత యాక్టివ్‌గా ఇందులో సల్మాన్ కనిపించలేదు. కంటెస్టెంట్స్ ఈ వారం మొత్తం చేసిన తప్పొప్పుల గురించి మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదనుకున్నానని అన్నారు. ‘‘హౌస్‌లో ఉన్నప్పుడు ఇంటి సభ్యులు ఎలాంటి ఫీలింగ్స్ చూపించినా వాటిని పట్టించుకోకూడదు. నేను కూడా ఈ రోజు ఇక్కడికి రాకూడదనుకున్నా. అస్సలు రావాలనిపించలేదు. మీతోపాటు ఎవరిని కలవకూడదనుకున్నా. కాకపోతే ఇది నా వృత్తి. కాబట్టి తప్పకుండా రావాలి. వృత్తిపట్ల ఉన్న నిబద్ధత వల్లే ఇక్కడికి వచ్చా. దీనికి పూర్తిగా కట్టుబడి ఉన్నా’’ అని సల్మాన్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
* తైవాన్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్లు సమాచారం. ఈ మేరకు అక్కడి అధికారిక మీడియా సంస్థ కథనాలు ఉటంకించాయి. వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ‘యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలి. దళాలు పటిష్ఠమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలి. సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రధాన ప్రయోజనాలను కాపాడాలని సైన్యానికి సూచించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది.
* క్రికెటర్‌గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్‌ను ప్రారంభించాడు. చదువు, మానవ హక్కులు, పోషకాహారం వంటి అంశాలపైన పనిచేసే ఈ ఫౌండేషన్ ద్వారా మూడేళ్లక్రితం ‘ఏక్ ఆశా జన్ రసోయీ’ పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు. అంటే… కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే భోజనాన్ని అందించే ఏర్పాటు చేశాడు. అన్నం, కూర, చపాతీ వంటివన్నీ ఒక్క రూపాయికే పెట్టే ఈ క్యాంటీన్లో ప్రతిరోజూ దాదాపు వెయ్యిమంది వరకూ భోజనం చేస్తారు. ఇక్కడకు వచ్చేవారు తామేదో ఉచితంగా తింటున్నామనే అపరాధ భావంతో ఉండకూడదనే ఉద్దేశంతోనే వాళ్ల నుంచి రూపాయి తీసుకుంటున్నామని చెప్పే గౌతమ్ గంభీర్ దిల్లీలోని మరో ప్రాంతంలోనూ ఈ సేవల్ని ప్రారంభించాడు. త్వరలో మరికొన్ని క్యాంటీన్లనూ ఏర్పాటు చేసే ఆలోచనలోనూ ఉన్నాడు.
* బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు రిషభ్ పంత్ (99) త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్(150)తో కలిసి 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా గాయపడిన పంత్.. నొప్పి తాళలేక మైదానం నుంచి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు నొప్పిని భరిస్తూనే రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే, ఐదో రోజు పంత్ మైదానంలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం నిర్వహించిన సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ అందుకు గల కారణాలను వెల్లడించాడు.
* భాజపా తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లు ఝార్ఖండ్ ప్రజలు గ్రహించారని జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ (Kalpana Soren) పేర్కొన్నారు. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్‌లు, సర్నా వర్గ డిమాండ్లను నేరవేరుస్తామని హామీ ఇచ్చే ధైర్యం కాషాయ పార్టీకి ఉందా? అని సవాల్ విసిరారు. ధన్‌బాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార (Assembly Elections) సభలో మాట్లాడిన ఆమె.. భాజపా తప్పుడు వాగ్దానాల ఉచ్చులో ఝార్ఖండ్ (Jharkhand Assembly) ప్రజలు ఇకపై పడరని అన్నారు. ‘‘భాజపాకు ధైర్యం ఉంటే సర్నా మతపరమైన కోడ్, రిక్రూట్‌మెంట్ పాలసీ, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు వంటి గిరిజన హక్కులకు కట్టుబడి ఉంటామని హామీ ఇస్తుందా?’’ అని కల్పనా సోరెన్ ప్రశ్నించారు. ఝార్ఖండ్ ప్రజలు మేల్కొన్నారని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే భాజపా ప్రయత్నాలను వారు విశ్వసించరని అన్నారు.
* ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందో భాజపా నేతలు చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గత పదేళ్లలో భాజపా ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎంతమంది ఉద్యోగాలు ఊడగొట్టిందో తమ వద్ద లెక్క ఉందన్నారు.
* న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు పుణె వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు సుందర్ జట్టుతో కలుస్తాడు. నవంబర్ 1 నుంచి ముంబయి వేదికగా సిరీస్‌లో చివరి (మూడో) టెస్టు మొదలవనుంది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
* బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ (New Zealand) చరిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత గడ్డపై కివీస్‌కు 36 ఏళ్ల తర్వాత దక్కిన తొలి విజయమిది. ఓవరాల్‌గా చూసుకుంటే భారత్‌లో న్యూజిలాండ్‌కు ఇది మూడో గెలుపు. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నామని, అయితే టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని లాథమ్ పేర్కొన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా (Team India) ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి.
* బతికి ఉన్నప్పుడే మనిషికి విలువ అని చాలామంది అనుకుంటారు. కానీ, చనిపోయి శరీరం బూడిదగా మారిన తరవాత ఆ విలువ అంతకు మించి పెరుగుతుందని తెలుసా. ఆ వాస్తవాన్ని కళ్లారా చూడాలంటే జపాన్‌లోని శ్మశానవాటికల దగ్గరికి వెళ్లాల్సిందే. సాధారణంగా కుటుంబ సభ్యులు చనిపోతే చితాభస్మాన్ని జాగ్రత్తగా భద్రపరిచి… పవిత్ర నదుల్లో కలిపేయడం మన దగ్గర చాలామంది పాటించే సంప్రదాయం. జపాన్‌లోని పబ్లిక్ శ్మశాన వాటికల్లో ఒకప్పుడు బూడిదను నీళ్లలో కలిపేవారు. ఆ బూడిదలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉంటాయని కొన్నాళ్ల క్రితం గుర్తించింది అక్కడి ప్రభుత్వం. దాంతో ఐదేళ్లలో అక్కడ చనిపోయిన 15 లక్షల మంది బూడిద నుంచి లోహాలు సేకరించి విక్రయించడం ద్వారా దాదాపు రూ.400 కోట్లను అవి ఆర్జించారు. బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేయడంతోపాటు… దేశవ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల నిర్వహణకోసం ఆ డబ్బును వినియోగిస్తోంది ప్రభుత్వం. మొత్తానికి బూడిద కూడా విలువైందే కదూ!
* గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించింది. దీంతో కంగుతిన్న విద్యార్థులు మెస్ ఇన్‌ఛార్జికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో 8 మంది మృతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీశారు. ‘డయేరియా కారణంగానే మరణాలు’ అనే అంశంపై వైద్యశాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z