* మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఈ నెల 19న విశాఖలోని ఐదు ప్రదేశాల్లో సోదాలు చేసినట్లు స్పష్టం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా అన్యాక్రాంతంపై దర్యాప్తు చేసినట్లు తెలిపింది. ‘‘ వృద్ధులు, అనాథ గృహాల కోసం ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. ఆరిలోవ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాం’’ అని ఈడీ పేర్కొంది.
* అనుమాన భూతం ఓ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని అప్పటి వరకు వ్రతం చేసిన మహిళ..అతడు మరొకరితో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో ఆహారంలో విషం కలిపి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం పండగ సందర్భంగా కౌశాంబి జిల్లాలోని ఇస్మాయిల్‌పూర్ గ్రామం చెందిన సవిత అనే మహిళ ఆమె భర్త శైలేష్ కుమార్ (32) భర్త ఆరోగ్యం, దీర్ఘాయుస్సు కోసం వ్రతం చేసింది. సాయంత్రం ఉపవాస దీక్ష విరమించే సమయంలో వారి మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం వారిరువురు కలిసి భోజనం చేశారు. అయితే భర్తకు పెట్టిన భోజనంలో విషం కలపడంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు శైలేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని భార్య ఆహారంలో విషం కలిపి హత్యకు పాల్పడిందని మృతుడి బంధువులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన మహిళను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉండటంతో తట్టుకోలేక అతడికి విషాహారం పెట్టినట్లుగా నిందితురాలు తెలిపినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
* తెలంగాణలో తొలి రోజు నిర్వహించిన గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష ముగిసింది. 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 27 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ విధించారు. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు. హైదరాబాద్ జిల్లాలో 5,613 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,896 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 87.23% హాజరైనట్టు ఆర్డిఓ జైపాల్ రెడ్డి తెలిపారు.
* విద్యుత్ అనేది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కలిసినట్లు చెప్పారు. 300 యూనిట్లు దాటితే ప్రస్తుతం యూనిట్‌కు రూ.10 ఫిక్స్‌డ్ ఛార్జీ వసూలు చేస్తున్నారని, ఆ పరిధి దాటితే ప్రస్తుతం ఉన్నదానికంటే 5 రెట్లు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.
* ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అప్పటి జగన్ ప్రభుత్వం నీరుగార్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ వైఎస్‌ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మందిని ఇంజినీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దిన గొప్ప పథకం అది. అలాంటి పథకాన్ని జగన్ నీరుగార్చారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.3500 కోట్లు పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటు. బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు. జగన్ హయాంలో విద్యార్థుల తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేశారు. దోచుకుని దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమంపై పెట్టలేదు’’ అని షర్మిల పేర్కొన్నారు.
* గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను భాజపా నేతలను కలిశారు. ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ధార్మిక సంఘాల నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వాటిని ఎత్తివేసేలా చూడాలన్నారు. తెలంగాణలో అసలు నిఘా వ్యవస్థ పని చేస్తోందా అని ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం స్పందించరా? అని నిలదీశారు.
* భారత్-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు అనేక దఫాలుగా జరిపిన చర్చల్లో తాజాగా కీలక పురోగతి చోటుచేసుకుంది. బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలూ ఓ ఒప్పందానికి వచ్చాయని, వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్ పునఃప్రారంభించడానికి అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 22-23న రష్యాలో జరగనున్న బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వెళ్లనున్న తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం విశేషం.
* విమానయాన భద్రతే ప్రభుత్యానికి అత్యున్నత ప్రాధాన్యమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. బెదిరింపులకు పాల్పడేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన నేడు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన బెదిరింపులు మొత్తం బూటకమని తేలిందన్నారు. పౌర విమానయాన శాఖకు కఠినమైన ప్రొటోకాల్ ఉందని.. దానినే తమ శాఖ, విమానయాన సంస్థలు అనుసరిస్తోందని వివరించారు. ఇలాంటి బెదిరింపులు వచ్చిన సమయంలో పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ విధివిధానాలను మనం అనుసరించాలని ఆయన వ్యాఖ్యానించారు. బెదిరింపు కాల్స్, సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. విమానంలో బోర్డింగ్ అయ్యాక బెదిరింపులకు పాల్పడేవారికి ఇటువంటి శిక్ష విధించేలా ఇప్పటికే చట్టంలో సెక్షన్లు ఉన్నాయి. కానీ, ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెదిరింపులకు పాల్పడేవారికి కూడా వీటిని వర్తింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో ఉగ్రకోణంపై స్పందించేందుకు కేంద్ర మంత్రి నిరాకరించారు.
* ప్రైవేటు టీచర్ విజయలక్ష్మీ హత్య కేసులో అనంతరపురం జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కంబదూరు మండలం కదిరి దేవరపల్లికి చెందిన రుద్రేశ్ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా వివాహిత విజయలక్ష్మీతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. నెల రోజుల్లోనే ఆమెను దారుణంగా హత్య చేశాడు. 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసుపై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.
* స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానే భరోసా వాళ్లకు మనం చిన్న హగ్‌తో చెప్పొచ్చు. తీరని దుఃఖంలో మునిగినవారిని దగ్గరకు తీసుకుని సానుభూతి అందించొచ్చు. ఒత్తిడి నుంచి బయటకు తేగలిగే శక్తి మనమిచ్చే కౌగిలికెంతో ఉంది. అవతలివారిలో నమ్మకాన్ని, భరోసాను కలిగిస్తుంది. తమ కోసం ఒకరున్నారనే భావనను కలిగించి వాళ్లకు ఉపశమనాన్నిస్తుంది. స్నేహబంధాన్ని బలపడేలా చేస్తుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z