Health

హైదరాబాద్‌లో 36గంటలు నీళ్లు బంద్-NewsRoundup-Oct 22 2024

హైదరాబాద్‌లో 36గంటలు నీళ్లు బంద్-NewsRoundup-Oct 22 2024

* కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రోపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

* ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

* తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగిన ఆవర్తనం మంగళవారం బలహీనపడింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

* 2020 కంటే ముందున్న పరిస్థితి ఏర్పడితేనే బలగాలను వెనక్కి రప్పిస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ‘‘ఏప్రిల్‌ 2020 ముందునాటి యథాతథ స్థితికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాం. ఆ తర్వాతే బలగాల ఉపసంహరణ, ఎల్‌ఏసీ వద్ద సాధారణ నిర్వహణను పరిశీలిస్తాం.

* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్లి కీవ్‌లో కూర్చుంటారని డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

* సికింద్రాబాద్ జవహర్‌ నగర్‌ పరిధిలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్‌ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ రావడంతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు.

* వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ గాజు సీసాను పగలగొట్టడంతో ఆయన చేతికి గాయమైంది.

* ఏపీలో పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఈ మేరకు మెటా- ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. యువగళం హామీలు నెరవేర్చడంలో మెటాతో ఎంవోయూ చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ‘‘విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశా. మొబైల్‌ ద్వారానే ఆయా సర్టిఫికెట్లు అందిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు వాట్సప్‌ ద్వారానే వివిధ రకాల సర్టిఫికెట్లు, పౌరసేవలు అందించేలా మెటాతో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పారదర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తాం’’ అని మంత్రి లోకేశ్‌ తెలిపారు.

* స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) అరుదైన ఘనత సాధించారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం (Ram Charan wax statue) కొలువుదీరనుంది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్‌ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు. 2025 వేసవి సమయానికి చరణ్‌ విగ్రహాన్ని సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉన్న ‘ఐఐఎఫ్‌ఏ జోన్‌’లో ఇప్పటికే షారుక్‌, అమితాబ్‌ బచ్చన్‌, కాజోల్‌, కరణ్‌ జోహార్‌ల మైనపు విగ్రహాలు ఉన్నాయి.

* ‘ మీకు.. మీ పార్టీకి ఓ దండం.. ఇకనైనా మమ్మల్ని బతనివ్వండి’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి (58)ని దారుణంగా హత్య చేయడంతో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గంగారెడ్డి హత్యను నిరసిస్తూ తన అనుచరులతో కలిసి జగిత్యాల-ధర్మపురి రహదారిపై జీవన్‌ రెడ్డి ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌తో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

* హైద‌రాబాద్ చందాన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో విషాదం నెల‌కొంది. హోట‌ల్‌లో కుక్క వెంట‌ప‌డ‌డంతో మూడో అంత‌స్తు నుంచి ప‌డి యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. రామ‌చంద్రాపురంలోని అశోక్‌న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న తెనాలి వాసి ఉద‌య్(23) త‌న స్నేహితుల‌తో క‌లిసి చందాన‌గ‌ర్‌లో ఉన్న వీవీ ప్రైడ్ హోట‌ల్‌కు వెళ్లాడు. హోట‌ల్ మూడో అంత‌స్తు బాల్క‌నీలోకి వెళ్ల‌గానే అక్క‌డున్న కుక్క వెంట‌ప‌డింది. దీంతో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన ఉద‌య్.. కుక్క నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో హోట‌ల్ కిటికీ నుంచి కింద‌ప‌డి ప్రాణాలు కోల్పోయాడు.

* హైదరాబాద్‌ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి ఫేస్‌-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌కు లీకేజీ ఏర్పడింది. దీనిని అరికట్టడానికి మరమ్మతు పనులు చేయనున్నారు. వీటిని ఈ నెల 24వ తేదీ (గురువారం) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 25వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు పనులు చేపట్టనున్నారు. ఈ 36 గంటలు పలు రిజర్వాయర్‌ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఆటంకం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

* మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవ కేంద్రం వద్ద టీడీపీ, జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది. చేబ్రోలులో మినుము విత్తనాలను మంత్రి చేతుల మీదుగా అందించడానికి పలువురు రైతులను అధికారులు గుర్తించారు.అయితే ఈ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ,జనసేన నాయకుల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కాకుండా ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు.

* అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయకుండా రైతులను అరిగోస పెడుతుందని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి(Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వనపర్తిలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, బాధ్యతగల ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడాలని బీఆర్‌ఎస్‌కు శ్రేణులకు పిలుపు నిచ్చారు. వనపర్తిలో(Wanaparthy) ఈ నెల 29న వేలాది మంది రైతులతో భారీ నిరసన(Huge protest) సదస్సు చేపడుతున్నామని, దీనికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.

* బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌, ఆమె తల్లి శోభాకపూర్‌లను ముంబయి పోలీసులు మంగళవారం ప్రశ్నించారు. ఆల్ట్‌ బాలాజీ వెబ్‌ సిరీస్‌ ‘గంధీభాత్‌’ ఎపిసోడ్‌లో మైనర్‌ బాలికలపై అసభ్యకరమైన సీన్స్‌ను చిత్రీకరించినందుకు ఏక్తా కపూర్‌తోపాటు ఆమె తల్లి శోభపై పోక్సో చట్టం కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు విచారించారు. ఈ నెల 24న మరోసారి విచారణకు రావాలని ముంబయి పోలీసులు ఆదేశించారు. ఆల్ట్‌ బాలాజీ టెలిఫిల్మ్‌ లిమిటెడ్‌కు చెందిన ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై ఈ నెల 20న ముంబయిలో ఎంబీహెచ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 295ఏ, ఐటీచట్టంతో పాటు పోక్సోచట్టంలో సెక్షన్‌ 13, సెక్షన్‌ 15 కింద మైనర్లపై అశ్లీల దృశ్యాలను చిత్రీకరించారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

* దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిలోని(Indrakiladri ) దుర్గగుడి భారీ ఎత్తున ఆదాయం (Income) సమకూరింది. దాదాపు రూ. 9.31 కోట్లు ఆదాయం హుండీకి (Hundi) వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మూడు విడతలుగా లెక్కించిన వివరాలను ప్రకటించారు. మొదటి విడతగా లెక్కించిన హుండీలో రూ. 3.50 కోట్లు ఆదాయం వచ్చినట్లు వివరించారు. రెండో విడతలో రూ. 2.76 కోట్లు, మూడో విడతలో రూ. 3.05 కోట్లు కానుకల రూపేణా వచ్చినట్లు ఆలయ ఈవో రామారావు (EO Ramarao) తెలిపారు. వీటితో పాటు 733 గ్రాముల బంగారం, 25.705 కిలోల వెండి వస్తువులను భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z