* సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
* ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. గత వైకాపా ప్రభుత్వం ఏపీపీస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌సవాంగ్‌ను నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన రాజీనామా చేయడంతో కొన్ని నెలలుగా ఏపీపీఏస్సీ ఛైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో అనురాధను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
* ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై కనీసం నోరు మెదపలేదన్నారు. జగన్ గుంటూరు పర్యటనపై స్పందించిన రాజేంద్రప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అధికారంలోకి వచ్చాక మీ బాబాయి హత్య గురించి నోరు విప్పలేదు. నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్ల పాటు పరిపాలన చేశారు. దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు ఎప్పుడైనా జగన్ పరామర్శించారా..? పరామర్శల పేరుతో రాజకీయంగా మాపై బురద జల్లుతున్నారు. వరద బాధితులకు ఆయన ప్రకటించిన రూ.కోటి సాయం ఎక్కడ ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రకటించిన రూ. 10 లక్షల సాయం జగన్ ఇస్తారా..?సహానపై దాడి చేసిన నవీన్ తల్లి తమ కుటుంబం వైకాపాలోనే ఉన్నట్లు చెప్పారు. కానీ జగన్ మాత్రం నిందితుడు తెదేపా వ్యక్తి అని అసత్యా ప్రచారం చేశారు. అరాచకాలు, మహిళలపై దాడులకు పాల్పడిన వారిని క్షమించము’’ అని విరుచుకుపడ్డారు.
* మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
* జర్మనీ చేతిలో భారత హాకీ (Hockey) జట్టుకు మరోసారి షాక్ తగిలింది. రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ప్రపంచ ఛాంపియన్ అయిన జర్మనీతో బుధవారం జరిగిన తొలి టెస్టులో భారత్ 0-2 తేడాతో ఓటమిపాలైంది. దిల్లీలో దశాబ్దం తర్వాత జరిగిన ఈ అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ ఒక్క గోల్ కూడా చేయలేదు. జర్మనీ తరఫున హెన్రిక్ మెర్ట్జెన్స్ (4వ నిమిషం), లుకాస్ విండ్‌ఫెడర్ (30వ నిమిషం) గోల్స్ సాధించారు. భారత్ ఈ మ్యాచ్‌లో ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ వృథా చేసుకుంది. జర్మనీ గొంజాలో పెయిలాట్, క్రిస్టోఫర్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకున్నా మంచి ప్రదర్శన చేసింది. సిరీస్‌లో రెండో టెస్టు గురువారం దిల్లీ వేదికగానే జరగనుంది. ఈ సిరీస్ కోసం సీనియర్లు, జూనియర్లతో మేళవించిన జట్టును బరిలోకి దింపిన భారత్.. రెండో టెస్టులో గెలిచి జర్మనీపై ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.పారిస్ ఒలింపిక్స్ సెమీస్‌లో భారత్ 2-3తో జర్మనీ చేతిలోనే ఓడింది.
* పరువునష్టం దావా కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని, పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కేటీఆర్ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, బాల్కసుమన్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. కేటీఆర్‌తో పాటు దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలు నమోదు చేసిన నాంపల్లి కోర్టు.. మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను ఈనెల 30న నమోదు చేయనుంది.
* తమ దేశ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ కెనడా (Canada) ఇటీవల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌పై ఆరోపణలు చేయడానికి ముందే మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అమెరికా వార్తా పత్రికకు ట్రూడో (Justin Trudeau) సన్నిహితులు అందజేశారని తెలిసింది. ఈ మేరకు కెనడా వార్తా పత్రిక ది గ్లోబ్ అండ్ మెయిల్ (The Globe and Mail) తాజా కథనం ప్రచురించింది. ట్రూడో ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్, డిప్యూటీ మంత్రి డేవిడ్ మారిసన్‌లు వాషింగ్టన్ పోస్టుకు సున్నితమైన సమాచారం అందజేసినట్లు కెనడా పత్రిక పేర్కొంది. ముఖ్యంగా ఖలిస్థానీ వేర్పాటువాదుల హత్యలో పాత్రతోపాటు తమ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై వారు మాట్లాడినట్లు తెలిపింది. భారత్‌పై కెనడా పోలీసులు ఆరోపణలు చేసే కొన్ని రోజులముందే అమెరికా మీడియాకు ట్రూడో సన్నిహితులు ఈ సమాచారం చేరవేశారని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్టు కథనానంలో తెలిపింది.
* దేశీయంగా నడిచే, విదేశాలకు వెళ్లే పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు రావడం కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ బెదిరింపులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల వేదికగానే వస్తున్నట్లు ఇటీవల పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
* ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా మరో 1500 మంది సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ చీఫ్ చావోతాయ్ యంగ్ వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించిన విషయాలను తమ దేశ చట్టసభ సభ్యులకు యంగ్ తెలియజేశారు.
* యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అదానీ- అంబుజా సిమెంట్ పరిశ్రమపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు భారాస నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
* వైకాపా అధ్యక్షుడు జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. రౌడీషీటర్ దాడిలో మృతిచెందిన తెనాలి యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ జీజీహెచ్‌కు వచ్చారు. వేలాది మంది రోగులు వచ్చే ఈ ఆస్పత్రి ప్రాంగణంలోకి ఆయన వెంట వందలాది మంది వైకాపా కార్యకర్తల్ని అనుమతించారు. జీజీహెచ్‌లో జగన్ ఉన్న గంటన్నర సేపు వారు ఆసుపత్రి పరిసరాల్లో గందరగోళం సృష్టించారు. జగన్ అనుకూల నినాదాలతో పాటు సీఎం చంద్రబాబును దూషిస్తూ అలజడి సృష్టించారు. వైకాపా మూకల అరాచకంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడ్డారు. జగన్ వచ్చి వెళ్లే వరకూ ఆసుపత్రి ప్రధాన గేటును మూసివేశారు. దీంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వైకాపా కార్యకర్తలు ఆస్పత్రిలో అత్యవసర విభాగానికి వెళ్లే మార్గం వద్ద అడ్డుగా నిలుచున్నారు. అంబులెన్సులు కూడా రాలేని పరిస్థితి కల్పించారు. ఆస్పత్రి ప్రాంగణంలో గేట్లు దూకటంతో పాటు.. అక్కడి చెట్లు ఎక్కి నానా బీభత్సం సృష్టించారు.
* రష్యా వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) కీలకవ్యాఖ్యలు చేశారు. భారతదేశం దౌత్యం, చర్చలకు మద్దతు ఇస్తుందని, యుద్ధానికి కాదని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా కల్లోల పరిస్థితులు, ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని సరైనమార్గంలో తీసుకువెళ్లడంలో బ్రిక్స్ సానుకూలపాత్ర పోషిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కొవిడ్ వంటి సవాళ్లను ఎదుర్కొన్నట్టుగానే.. మనం భవిష్యత్తు తరాలకు కొత్త అవకాశాలను సృష్టించగలం. అలాగే ఉగ్రవాదం, ఉగ్ర సంస్థలకు వనరులను సమకూర్చడాన్ని కట్టడి చేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దు. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగానే చూడాలి. మన దేశాల్లో యువతను అతివాదభావజాలం వైపు మరల్చే చర్యలను అడ్డుకునే విషయంలో చురుగ్గా వ్యవహరించాలి. సైబర్ సెక్యూరిటీ, సురక్షిత కృత్రిమ మేధకోసం అంతర్జాతీయ నియంత్రణలను తీసుకువచ్చేందుకు మనమంతా కృషి చేయాలి’’ అని సూచించారు.
* సూర్య (Suriya) హీరోగా శివ తెరకెక్కించిన చిత్రం ‘కంగువా’ (Kanguva). దిశాపటానీ కథానాయిక. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈసినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సూర్య ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ రేంజ్ మూవీ చేయాలని తాను ఎప్పటినుంచో అనుకుంటున్నానని అన్నారు. ‘కంగువా’తో తన ఆశ నెరవేరిందని చెప్పారు. ‘సూరారై పోట్రు’ కంటే ముందు కెరీర్ పరంగా తాను నిరాశకు గురైనట్లు తెలిపారు. ‘‘సూరారై పోట్రు’ (ఆకాశమే నీ హద్దు) కంటే ముందు కెరీర్ పరంగా నేను కాస్త నిరాశకు గురయ్యా. నా ఇమేజ్ ఎలా మార్చుకోవాలి? సినిమాతో మళ్లీ ఎలా ప్రేమలో పడాలి? తిరిగి కెమెరా ఎదుట సంతోషంగా ఎలా ఉండగలను? అని ఎంతో ఆలోచించా. అలాంటి సమయంలో సుధా కొంగర ‘సూరారై పోట్రు’తో నన్ను సంప్రదించారు. నిజంగా అది నా అదృష్టం’’ అని సూర్య చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z