* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో వరుస నష్టాలతో ట్రేడవుతున్న సూచీలు.. గురువారం సైతం స్వల్ప నష్టాలతో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో హెచ్‌యూఎల్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. 5 శాతం నష్టంతో హెచ్‌యూఎల్ షేరు రూ.2502 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 80,098.30 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,081.98) ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 79,813.02- 80,259.82 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 16.82 పాయింట్ల నష్టంతో 80,065 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు నష్టపోయి 24,399 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
* జొమాటోకు చెందిన క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ (Blinkit) ఈఎంఐ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. నిర్దేశిత మొత్తానికి మించి చేసే కొనుగోళ్లకు ఈ సదుపాయం వర్తి్స్తుంది. బ్లింకిట్ సీఈఓ అల్బీందర్ దిండ్సా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బ్లింకిట్‌లో రూ.2,999 కంటే ఎక్కువ కొనుగోలు చేసే వారు ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని దిండ్సా పేర్కొన్నారు.బంగారం, వెండి కొనుగోళ్లకు ఇది వర్తించదని తెలిపారు.
* కస్టమ్స్ సుంకాలు తగ్గినప్పటికీ అటు అంతర్జాతీయ ఇటు దేశీయ పరిణామాలతో పసిడి ధరలు రికార్టులను సృష్టిస్తున్నాయి. దీపావళికి ముందు చోటుచేసుకుంటున్న ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ధన్‌తేరస్‌లో డిమాండ్, కొనుగోళ్ల పరిమాణాలు తగ్గుతాయని భావిస్తున్నాం. గత ధన్‌తేరాస్‌తో పోల్చితే కొనుగోళ్ల పరిమాణం కనీసం 10 నుంచి 12 శాతం తగ్గుతుందని అంచనా. అయితే పెరిగిన ధరల వల్ల విలువలో కొనుగోళ్లు 12 నుంచి 15 శాతం పెరగవచ్చు.
* దేశ వ్యాప్తంగా ఒకే బంగారం ధర లక్ష్యంతో ‘వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్’ విధానం అమలుకు కృషి చేస్తున్నట్లు అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) ప్రకటించింది. ‘‘మేము ఒకే ధర వద్ద బంగారం దిగుమతి చేసుకుంటాము, కానీ దేశీయ రిటైల్ ధరలు ఒక నగరం నుండి మరొక నగరానికి భిన్నంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఒకే రేటు కొనసాగాలని మేము కోరుకుంటున్నాము’’ అని జీజేసీ సెక్రటరీ మితేష్ ధోర్డా పేర్కొన్నారు. మండలి సభ్యులతో ఇప్పటికే ఈ విషయంపై 50కుపైగా సమావేశాలను నిర్వహించడం జరిగిందని, తమ ప్రతిపాదనకు ఇప్పటికే దాదాపు 8,000 జ్యూవెలర్స్ సూత్రప్రాయ ఆమోదం తెలిపారని వివరించారు. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న వార్షిక గోల్డ్ ఫెస్టివల్ ‘లక్కీ లక్ష్మీ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ లక్కీ లక్ష్మీ ఉత్సవంలో 1,500 మంది రిటైలర్లు అలాగే 9 వరకూ చైన్ స్టోర్స్ పాల్గొననున్నాయి. కొనుగోళ్లకు సంబంధించి రూ. 10 కోట్ల విలువైన బహుమతులను అందజేయడం జరుగుతుంది. బంగారంపై రూ. 25,000 కంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లు పండుగ కాలంలో ఖచ్చితమైన బహుమతులు అందుకుంటారు. బాలీవుడ్ నటి ముగ్దా గాడ్సే సీనియర్ జీజేసీ సభ్యులతో కలిసి ఈ ఉత్సమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
* కంప్యూటర్ రంగంలో ప్రపంచానికి సుపరిచితమైన భారత్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలోనూ సత్తా చాటబోతోందని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ అన్నారు. భవిష్యత్‌లో ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ప్రపంచానికి ఎగుమతి చేయబోతోందని చెప్పారు. ఈమేరకు ముంబయిలో నిర్వహించిన ఎన్విడియా ఏఐ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. భారత్‌లో తమ ఎకోసిస్టమ్ విస్తరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కంప్యూటర్ రంగంలో ప్రపంచానికి భారత్ చాలా సుపరిచితమని, ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు హబ్‌గా ఉందని కొనియాడారు. భవిష్యత్‌లో ఏఐ ఎగుమతుల్లోనూ లీడర్‌గా మారనుందని పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ తరహాలోనే ఏఐని భారత్ ప్రపంచదేశాలకు ఎగుమతి చేయనుందన్నారు. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులకు అడ్డాగా ఉన్న భారత్.. ఏఐ అభివృద్ధి, సరఫరాలో పవర్‌హౌస్‌గా మారనుందని చెప్పారు. భవిష్యత్‌లో ప్రతివ్యక్తికీ ఓ ఏఐ కో-పైలట్లు ఉండబోతున్నాయని చెప్పారు. ఏఐ వల్ల ఉద్యోగాలు హరించుకుపోతాయన్న ఆందోళనల పైనా హువాంగ్ స్పందించారు. ఏఐ పూర్తిగా ఉద్యోగాలు తుడిచిపెట్టబోదని, దాని స్వరూపాన్ని మారుస్తుందని పేర్కొన్నారు. వ్యక్తి కంటే ఏఐ మెరుగ్గా పనిచేయగలదని భావించినప్పుడు మాత్రమే ఆ ఉద్యోగం పోతుందని చెప్పారు.
* సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగుల్లో వైవిధ్యాన్ని కాపాడేందుకు అవస్థలు పడుతోంది. ఆ సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోయే వారిలో కొన్నివర్గాల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించింది. ముఖ్యంగా మహిళలు, నల్లజాతీయులు, లాటినిక్స్‌లు కంపెనీని వీడటం ఎక్కువైంది. కంపెనీకి చెందిన డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ రిపోర్టు బుధవారం విడుదలైంది. దీనిలో ఈ విషయాలు బయటపడ్డాయి. వీటిల్లో స్వచ్ఛంద రాజీనామాలు, కంపెనీ నుంచి తొలగింపులు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాజీనామాల్లో 32.7% మహిళలే ఉన్నట్లు తేలింది. గతేడాది 31%తో పోలిస్తే ఇది స్వల్పంగా పెరిగింది. నల్లజాతీయుల రాజీనామాలు 8.7% నుంచి 10%కు, లాటినిక్స్ 8% నుంచి 9.8%కు పెరిగినట్లు తేలింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z