Business

63 శాతం పెరిగిన సత్య జీతం – Business News – Oct 25 2024

63 శాతం పెరిగిన సత్య జీతం – Business News – Oct 25 2024

* ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సీఈఓ సత్యనాదెళ్ల (Satya Nadella) జీతం పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్‌ డాలర్ల వేతనం అందుకోనున్నారు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.664 కోట్లు అన్నమాట. ఈ విషయాన్ని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న 48.5 మిలియన్‌ డాలర్లతో (సుమారు రూ.407 కోట్లు) పోలిస్తే ఇది 63 శాతం ఎక్కువ. జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్‌ వృద్ధిలో దూసుకెళ్లింది. దీంతో కంపెనీ షేర్లు దాదాపు 31.2 శాతం లాభపడ్డాయి. అలా మైక్రోసాఫ్ట్‌ మార్కెట్ విలువ 3 ట్రిలియన్‌ డాలర్లను దాటింది. దీంతో నాదెళ్ల స్టాక్‌ అవార్డులు 39 మిలియన్‌ డాలర్ల నుంచి 71 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. కృత్రిమ మేధ (AI) రేసులో రాణించేందుకు కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులోభాగంగానే చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐలో (OpenAI) పెట్టుబడులు పెట్టింది.

* ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) ‘దీపావళి ధమాకా’ ఆఫర్లను తీసుకొచ్చింది. పండగ సందర్భంగా తీసుకొచ్చిన ఈ సదుపాయంతో ఎంపిక చేసిన రీఛార్జీలపై రూ.3,350 విలువైన ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. నవంబర్‌ 3లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారు. దీపావళి ఆఫర్‌లో భాగంగా రూ.899, రూ.3,599 రీఛార్జి ప్లాన్లపై అదనపు ప్రయోజనాలను జియో అందిస్తోంది. ఆఫర్‌ ముగిసేలోగా ఈ ప్లాన్‌లతో రీఛార్జి చేసుకుంటే రూ.3,000 విలువ చేసే ఈజీ మై ట్రిప్‌ వోచర్‌ అందిస్తోంది. విమాన ప్రయాణాలు, హోటల్‌ బుకింగ్స్‌ చేసుకొనే వారు ఈ వోచర్‌ వినియోగించుకోవచ్చు. రూ.999 కంటే ఎక్కువ మొత్తంతో అజియో వేదికగా కొనుగోలు చేసినప్పుడు రూ.200 విలువైన అజియో కూపన్‌ వర్తిస్తుంది. రూ.150 విలువైన స్విగ్గీ వోచర్‌ కూడా ఈ ప్లాన్లతో ఇస్తోంది. ‘మై జియో’ యాప్‌ సాయంతో కూపన్లు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

* గత కొన్ని రోజులుగా మదుపర్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market).. నేడు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 900 పాయింట్లు మేర నష్టపోగా.. తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 24,200 దిగువకు చేరింది. బలహీన త్రైమాసిక ఫలితాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాల కారణంగా సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టపోయి రెండున్నర నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు క్షీణించి దాదాపు రూ.437 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 80,187.34 (క్రితం ముగింపు 80,065.16) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా నష్టాల్లోనే చలించింది. ఇంట్రాడేలో 79,137.98 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 662 పాయింట్ల నష్టంతో 79,402 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 218.60 పాయింట్ల నష్టంతో 24,180.80 వద్ద స్థిర పడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.09గా ఉంది.

* డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఫలితంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరంలో నకిలీ ఐఫోన్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అబిడ్స్‌లోని జగదీశ్‌ మార్కెట్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. రూ.3 కోట్లు విలువ చేసే నకిలీ ఐఫోన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. టార్గెట్, పటేల్, ఆశాపూర్, నంది మొబైల్‌ షాపుల్లో చైనా మేడ్ ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్‌ అంటించి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. కొన్ని నెలలుగా నిందితులు యాపిల్ బ్రాండ్ పేరుతో ఈ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఖైరతాబాద్, హైదర్‌నగర్‌ ప్రాంతాల్లోని ఫైర్‌ క్రాకర్స్ గోదాముల్లోనూ పోలీసులు సోదాలు చేశారు. కాలం చెల్లిన బాణసంచా అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు. వారినుంచి రూ.లక్ష విలువ చేసే టపాసులను సీజ్‌ చేశారు.

* జీవిత కాల గరిష్టాన్ని తాకిన బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1150 తగ్గుముఖం పట్టి రూ.80,050లకు చేరుకున్నది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.350 పతనమై రూ.80,450 వద్ద స్థిర పడింది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత (24 క్యారట్స్) బంగారం తులం ధర రూ.81,200 పలికింది. కిలో వెండి ధర సైతం రూ.2000 తగ్గి రూ.99వేల మార్కుకు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.1.01 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.

* వరుసగా మూడో వారం భారత్ ఫారెక్స్ నిల్వలు పతనం అయ్యాయి. ఈ నెల 18తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు పడిపోయి 688.26 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో మూడు వారాల్లో ఫారెక్స్ రిజర్వు నిల్వలు మొత్తం 16.61 బిలియన్ల డాలర్లు పడిపోయాయి. ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 3.75 బిలియన్ల డాలర్లు పడిపోయి 598.26 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. బంగారం రిజర్వు మాత్రం 1.78 బిలియన్ డాలర్లు పుంజుకుని 67.4 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 68 మిలియన్ డాలర్లు పతనమై 18.271 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయి. ఐఎంఎఫ్ లో భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 16 మిలియన్ డాలర్లు తగ్గి 4.3 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z