Politics

యమునలో మునకేసి ఆసుపత్రిలో చేరిన భాజపా ఛీఫ్-NewsRoundup-Oct 26 2024

యమునలో మునకేసి ఆసుపత్రిలో చేరిన భాజపా ఛీఫ్-NewsRoundup-Oct 26 2024

* సొంతగడ్డపై వరుస టెస్టు సిరీస్‌ విజయాలతో దూసుకుపోతున్న టీమ్ఇండియా (Team India)కు కివీస్‌ ఊహించని షాక్ ఇచ్చింది. స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు సాధించిన భారత జట్టుకు 12 ఏళ్ల తర్వాత ఓటమి రుచి చూపించింది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పర్యటక జట్లను స్పిన్‌ ఆయుధంతోనే దెబ్బ కొట్టే టీమ్‌ఇండియా ఈ సారి ఆ స్పిన్‌ ఉచ్చుకే బలైంది. ఆస్ట్రేలియాలో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని ఇటీవల ఇక్కడి పిచ్‌లను పేస్‌కు అనుకూలంగా తీర్చిదిద్దుకుంది టీమ్‌ఇండియా. బెంగళూరులో న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగిన తొలి టెస్టులో ఈ ప్రయోగం బెడిసికొట్టింది. పుణె టెస్టులో మళ్లీ సంప్రదాయ స్పిన్‌ పిచ్‌ వైపు మొగ్గుచూపిన భారత్‌కు షాక్ తప్పలేదు. కివీస్‌ను స్పిన్‌తో చుట్టేయాలని ప్లాన్‌ చేసిన టీమ్‌ఇండియా.. ప్రత్యర్థి విసిరిన అదే అస్త్రాన్ని ఎదుర్కొలేక చతికిలపడింది. ప్రధాన బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ ఒక్కడే రాణించగా మిగతా వారంతా స్పిన్ ఆడలేక చేతులేత్తేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 13 వికెట్లు పడగొట్టగా.. మరో ఇద్దరు స్పిన్నర్లు గ్లెన్ ఫిలిప్స్‌ 3, అజాబ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

* సినీ ఫక్కీలో కొందరు ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఒక రహస్య టన్నెల్‌ (Secret Tunnel) నుంచి వారు తప్పించుకున్నారు. రష్యా (Russia) రాజధాని మాస్కోకు 300కి.మీ. దూరంలో ఉన్న లిపెట్స్క్‌ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు జైలులో అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌ను గుర్తించారు. దాంతో వెంటనే ఆ జైల్లో ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారో లెక్కతీశారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఆరుగురు ఖైదీలు పారిపోయినట్లు గుర్తించామని తెలిపారు. దాంతో పోలీసులు వారికోసం గాలింపు ముమ్మరం చేశారు. రష్యాలో నేరాలకు పాల్పడిన వారిపై త్వరితంగా విచారణ జరిపి జైళ్లకు పంపిస్తారు. అయితే రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది. యుద్ధరంగంలో ఉక్రెయిన్‌తో పోరాడేందుకు రష్యా సైన్యం వారిని నియమించడమే అందుకు కారణం. ఇదిలా ఉంటే.. రష్యాలో జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం చాలా అరుదు. ఒకవేళ వారు పారిపోయినా రోజుల్లో పట్టుబడతారని తెలుస్తోంది.

* అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’(Pushpa The Rule). సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమా రిలీజ్‌ రోజే ఒక రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. అల్లు అర్జున్‌కు (Allu Arjun) అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా వచ్చిందంటే అన్ని ప్రాంతాల్లోనూ సందడి నెలకొంటుంది. ఇప్పుడు ‘పుష్ప2’తో ఆ సందడి రెట్టింపు కానుంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సెన్సేషనల్‌ న్యూస్‌ను మేకర్స్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్‌ల్లో దీన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇండియాలో 6,500.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లో దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్‌ సినిమా ఈ స్థాయిలో విడుదల కాలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బిగ్గెస్ట్‌ రిలీజ్ ఇండియన్‌ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు సృష్టించనుండడం ఖాయమే. ఇక ఈ చిత్రం కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు. ఈ వార్తతో అభిమానులు ఖుష్ అవుతున్నారు.

* కోలీవుడ్‌ నటుడు జయం రవి (Jayam Ravi), నటి ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan)ల నిశ్చితార్థం జరిగిందంటూ ఇటీవల పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వార్తలపై తాజాగా ప్రియాంక మోహన్‌ స్పష్టతనిచ్చారు. ఆయా కథనాలు చూసి తాను షాకయ్యానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని అన్నారు. ‘‘జయం రవి, నేను కలిసి ‘బ్రదర్‌’ సినిమా కోసం వర్క్‌ చేశాం. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఒక ఫొటో రిలీజ్‌ చేసింది. అందులో మేమిద్దరం మెడలో పూలదండలు వేసుకుని ఉంటాం. దాంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి చాలామంది మాకు ఎంగేజ్‌మెంట్‌ అయిందనుకున్నారు. వరుస షూట్స్‌తో బిజీగా ఉండటంతో ఆ విషయం నా దృష్టికి రాలేదు. ఆ సమయంలో ఇది నిజమేనని నమ్మిన టాలీవుడ్‌లోని నా స్నేహితులు వరుస కాల్స్‌ చేశారు. కంగ్రాట్స్‌ చెప్పారు. ఏం జరుగుతుందో నాకు అర్థంకాలేదు. పూర్తి విషయం తెలుసుకుని అది కేవలం సినిమాలోని స్టిల్‌ మాత్రమేనని చెప్పా. ఆ తర్వాత మా మూవీ టీమ్‌ను తిట్టుకున్నా. వేరే ఫొటో ఏదైనా రిలీజ్‌ చేయొచ్చు కదా. ఇది ఎందుకు చేశారనుకున్నా’’ అని ప్రియాంక మోహన్‌ తెలిపారు. ఈ సంఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.

* వైవీ సుబ్బారెడ్డి.. జగన్‌ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సుబ్బారెడ్డి వ్యాఖ్యపై స్పందించారు. ‘‘నా బిడ్డలు కూడా మీ కళ్ల ముందే పెరిగారు.. వారికి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది. అన్ని విషయాలు తెలిసి కూడా బాబాయి ఎందుకిలా మాట్లాడుతున్నారు’’ అని కన్నీటి పర్యంతమయ్యారు.

* బెటాలియన్‌ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ డీజీపీ జితేందర్‌ స్పందించారు. క్రమక్షశిణతో కూడిన ఫోర్స్‌లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్‌ పోలీసులు ఆందోళనకు దిగారు.

* సీఎం రేవంత్ రెడ్డి మూసీ బ్యూటిఫికేషన్ చేస్తాననేది కేవలం డబ్బు సంచులు నింపుకోవడానికేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇప్పటివరకు నిర్మించిన మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లను ప్రారంభించే తెలివి సీఎంకు లేదని దుయ్యబట్టారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకేఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి పరిశీలించారు.

* సరస్వతి పవర్‌ సంస్థ భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. ‘పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్‌ సంస్థకు చెందిన భూముల్లో అటవీశాఖ భూములు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి విస్తీర్ణం ఎంత ఉందో పేర్కొంటూ నివేదిక ఇవ్వాలి’ అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అటవీ పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు.

* టెస్టుల్లో సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నటీమ్‌ఇండియా (Team India)కు న్యూజిలాండ్‌ షాక్ ఇచ్చింది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌పై కివీస్‌ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ (New Zealand) 2-0తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.

* సీనియర్‌ ఐఏస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌పై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వట్టినాగులపల్లిలోని శంకర్‌హిల్స్‌ ప్లాట్ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు శనివారం ఈడీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని, 200 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని, రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారని వాపోయారు. 40 ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్నా.. పోలీసు బలగాలతో వెళ్లగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

* సమంత (Samantha), బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) ప్రధాన పాత్రల్లో దర్శకులు రాజ్‌, డీకే (Raj &DK) రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ- బన్నీ’ (Citadel: Honey Bunny). నవంబరు 7 నుంచి ఓటీటీ (OTT) ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్లతోపాటు రచయిత సీతా ఆర్‌. మేనన్‌ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘సిటాడెల్‌’ ట్రైలర్‌ విడుదలయ్యాక .. హాలీవుడ్‌ మూవీ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్మిత్‌’తో పోల్చారు. నిజంగానే స్ఫూర్తి పొందారా?’’ అన్న ప్రశ్నపై రాజ్‌ స్పందించారు. రెండింటికీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మేం ఎప్పుడూ అలా చేయలేదన్నారు.

* రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్‌ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేగా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్స్‌ లిమిటెడ్‌ (MEIL) ముందుకొచ్చింది. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సంస్థ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్మాణానికి కంపెనీ తమ సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

* ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ పెద్ద సాహసమే చేశారు. కాలుష్య కాసారంగా మారి విషపు నురగలు కక్కుతున్న యమునా నదిలో సచ్‌దేవ మునిగారు. నదిలో మునిగిన మూడు రోజుల తర్వాత సచ్‌దేవపై యమున కాలుష్యం ఎఫెక్ట్‌ పడింది. చర్మంపై దురదలు రావడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సచ్‌దేవను శనివారం(అక్టోబర్‌ 26) ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నట్లు బీజేపీ పార్టీ సోషల్‌మీడియా వెల్లడించింది. యమునలో కాలుష్యం ఇంతగా పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాలే కారణమని బీజేపీ విమర్శించింది. కాగా, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిధులను ఆప్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని నిరసన తెలపడంలో భాగంగా సచ్‌దేవ గురువారం యమునలో మునిగారు. అయితే సచ్‌దేవ యమునలో మునగడంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.

* ఇండస్ట్రీలో బాల‌చంద‌ర్‌, కృష్ణ‌వంశీ, మ‌ణిర‌త్నం లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులు ఇచ్చిన అవ‌కాశాలే తనను ఇంతటి స్థాయికి చేర్చాయని ప్ర‌కాష్‌రాజ్ గుర్తుచేసుకున్నారు. క‌థ బాగుంటే ఎలాంటి సినిమానైనా చేస్తాన‌ని ఆయన తెలిపారు. తనకు ఉన్న టాలెంట్‌కు ప్రజల నుంచి ఆదరణ, ప్రేమ వ‌ల్లే ఇక్కడ తాను న‌టుడిగా కొన‌సాగుతోన్నాన‌ని చెప్పారు. నేటి సమాజంలో గ‌ళం వినిపించ‌లేని ప్ర‌జ‌ల‌కు గొంతుక‌గా ఉంటానని ఆయన అన్నారు. సమాజంలో జరిగే త‌ప్పుల‌ను చూస్తూ నోరు మెద‌ప‌కుండా ఉండ‌లేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవ‌కాశాలు కోల్పోయినా ప్ర‌శ్నించ‌డం మాత్రం ఆపనని బలంగా చెప్పారు. ఇప్పటి వరకు తనపై ఎన్ని కుట్ర‌లు పన్నినా త‌ట్టుకొని నిల‌బ‌డ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. భవిష్యత్‌లో కూడా అంతే స్థాయిలో నిల‌బ‌డ‌తానని ప్ర‌కాష్ రాజ్ అన్నారు.

* అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్పల మండలం నాయనపల్లి క్రాస్‌ వద్ద లారీని కారు ఢీకొట్టింది. టైరు పగిలి అదుపుతప్పిన కారు లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. అనంతపురం- కడప జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురం ఇస్కాన్‌ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు.

* అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెదేపా అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన మంగళగిరిలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ‘‘రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగు దేశం పార్టీ. నేటి తరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు తెదేపాలోనే ఉన్నాయి. రాజకీయ కార్యకర్తల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేందుకు అనునిత్యం పనిచేస్తున్నాం. వారి సంక్షేమం కోసం ముందుకెళ్లాం. రాజకీయ కక్షలకు బలైన సంఘటనలు చాలా చూశాం. అనేక కారణాలతో కార్యకర్తలు చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం’’ చంద్రబాబు నాయుడు అన్నారు

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z