Business

ఆన్‌లైన్ గేమింగ్‌కి హవాలా దెబ్బ-BusinessNews-Oct 27 2024

ఆన్‌లైన్ గేమింగ్‌కి హవాలా దెబ్బ-BusinessNews-Oct 27 2024

* పండగ వేళ నియామకాలు జోరందుకున్నాయి. మరీ ముఖ్యంగా ఇ- కామర్స్‌, ఆతిథ్య విభాగాల్లో జాబ్‌ పోస్టింగ్‌లు 20శాతం పెరిగి 2.16లక్షలకు చేరాయి. ప్రముఖ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అప్నా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. వేసవి సమయంలో మందగించిన వ్యాపారాల్ని తిరిగి పుంజుకోవడంపై సంస్థలు దృష్టి పెట్టాయి. పండగ సీజన్‌లలో గతేడాదికి మించి విక్రయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో భాగంగా నియామకాలు చేపట్టాయి. వాణిజ్య పరిశ్రమ వేగవంతమైన విస్తరణ నియామకాలు ఊపందుకోవడానికి దోహదం చేసింది. లాజిస్టిక్స్‌, కార్యకాలాపాల్లో జాబ్‌ పోస్టింగ్‌లు 70శాతం పెరిగాయి. ఇక రిటైల్‌, ఇ- కామర్స్‌ విభాగాల్లో నియామకాలు 30శాతం, రెస్టరంట్‌, ఆతిథ్యరంగంలో 25శాతం పెరిగాయి.

* ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) త్వరలో ప్రారంభం కానుంది. సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించాక.. ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందా అని మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని సబ్‌స్క్రిప్షన్‌ నవంబర్‌ 6 నుంచి ప్రారంభం కాబోతోందిని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ ఐపీఓ ద్వారా దాదాపు రూ.10వేల కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కొత్త షేర్ల జారీతో రూ.3,750 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 182,286,265 షేర్లను విక్రయించనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.750 కోట్లు సమీకరించాలని చూస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌ నవంబర్‌ 8న ముగియనున్నట్లు తెలుస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం ఒక రోజు ముందే ఆఫర్‌ ఇది మొదలుకానుంది. ధరల శ్రేణి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా నిలిచింది. అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్‌ ఎస్‌బీఐను బెస్ట్‌ బ్యాంక్‌గా ఎంపిక చేసింది. వాషింగ్టన్‌లో జరిగిన ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు సమావేశంలో భాగంగా 31వ వార్షిక ఉత్తమ బ్యాంక్‌ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అసాధారణ సేవలు అందించి కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో తమ బ్యాంక్‌ ముందంజలో ఉందని ఎస్‌బీఐ పేర్కొంది. ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారని బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

* దేశీయ ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు (FPIs) తమ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్టోబర్‌ ప్రారంభం నుంచి భారీగా విక్రయాలు జరిపారు. పెద్ద ఎత్తున నిధులను దేశీయ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.85,790 కోట్లను వెనక్కితీసుకున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (NSDL) డేటా ప్రకారం.. అక్టోబర్‌ 1 నుంచి 25 మధ్య విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.85,790 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ నెలలో ఔట్‌ఫ్లో ఏకంగా 10 నెలల గరిష్ఠానికి చేరింది. ఇదే సమయంలో మొత్తం రుణ మార్కెట్లో పెట్టుబడులు రూ.410 కోట్లకు చేరాయి. యూఎస్‌ ఫెడ్‌ (US Federal Reserve) 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించడం కూడా పెట్టుబడులు తరలి పోవడానికి ఓ కారణంగా అనలిస్టులు భావిస్తున్నారు. చైనాలో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం పెట్టుబడులపై ప్రభావం చూపుతోంది. మరో వైపు భౌగోళిక రాజకీయ సంక్షోభం మధ్య బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 76 డాలర్లకు చేరింది.

* టాటా సన్స్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ అధికారికంగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టక ముందే.. ఆయన ఈ పదవికి ‘అర్హుడేనా’ అనే విషయంలో రతన్‌ టాటా పునరాలోచన చేయడం ప్రారంభించారని తాజాగా విడుదలైన ఓ పుస్తకంలోని వివరాల ఆధారంగా తెలుస్తోంది. టాటా సన్స్‌ ఛైర్మన్‌గా 2012 డిసెంబరులో రతన్‌ టాటా పదవీ విరమణ చేశారు. రతన్‌ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేందుకు 2011లోనే సైరస్‌ మిస్త్రీని ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టక ముందు ఏడాది పాటు భావి ఛైర్మన్‌ డిజిగ్నేట్‌గా మిస్త్రీ ఉన్నారు. ఆ సమయంలోనే సంస్థను ఎలా నిర్వహించాలనే విషయంలో సూచనలు, సలహాలు పొందేందుకు, అనుభవాల వివరాలు తెలుసుకునేందుకు రతన్‌ కింద ఆయన అప్రెంటిస్‌షిప్‌ చేశారు. అయితే ఆ ఏడాది ముగింపు నాటికి మిస్త్రీ ఈ పదవికి సరైన వ్యక్తేనా అని రతన్‌ పునరాలోచనలో పడినట్లు ‘రతన్‌ టాటా ఏ లైఫ్‌’ పుస్తకం వెల్లడించింది. ఇటీవల దివంగతులైన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా జీవితంపై థామస్‌ మ్యాథ్యూ ఈ పుస్తకాన్ని రాశారు. దీనిని హార్పర్‌కొల్లిన్స్‌ పబ్లిషర్స్‌ ప్రచురించింది. 2016 అక్టోబరులో టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మిస్త్రీని తొలగించేందుకు నిర్ణయం తీసుకోవాల్సి రావడం ఒక విధంగా మిస్త్రీ కంటే రతన్‌కే ఎక్కువ కష్టంగా అనిపించిందని హార్వర్డ్‌ బిజినినెస్‌ స్కూల్‌ మాజీ డీన్‌ నితిన్‌ నోహ్రియా వ్యాఖ్యలను ఉటంకిస్తూ పుస్తకం పేర్కొంది. టాటా సన్స్‌లో డైరెక్టరుగా ఉన్న వేణు శ్రీనివాసన్‌ ఇదే తరహా విషయాన్ని వెల్లడించినట్లు ఆ పుస్తకం తెలిపింది. డైరెక్టర్ల నుంచి విశ్వాసం కోల్పోయినట్లు స్పష్టంగా తెలిసినప్పుడు మిస్త్రీ హుందాగా ఆ బాధ్యతల నుంచి వైదొలిగితే బాగుండేదని రతన్‌ కోరుకున్నారని వెల్లడించింది.

* భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతోన్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగానికి మనీలాండరింగ్‌ (నగదు అక్రమ బదిలీ) నుంచి ప్రమాదం ఎదురవుతోందని.. తక్షణం సరైన చర్యలను తీసుకోవాలని ఒక నివేదిక సూచిస్తోంది. తద్వారా బలమైన డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవాలని చెబుతోంది. ‘డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌’ రూపొందించిన ఆ నివేదిక ఇంకా ఏమంటోందంటే…..చట్టవ్యతిరేక ఆపరేటర్లను అడ్డుకోవడానికి ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి. లీగల్‌ ఆపరేటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలి. తప్పుదోవ పట్టించే వ్యాపార ప్రకటనలను నిలువరించాలి. అంతర్జాతీయ సహకారానికి, ఆర్థిక ఏకీకరణకు సంబంధించిన నియమావళిని తీసుకురావాలి. వీటికి తోడు ప్రజల్లో అవగాహన కల్పించాలి. తప్పుడు ప్లాట్‌ఫారాల వైపు వెళ్లకుండా వారిలో స్పృహ కల్పించాలి. ఏఐ/ఎమ్‌ఎల్‌ ఆధారిత డిటెక్షన్‌ మోడళ్లను ఆర్థిక సంస్థలు రూపొందించాలి. బలమైన దర్యాప్తు బృందాలను సిద్ధం చేయాలి. నగదు అక్రమ బదిలీని అడ్డుకోవడానికి సరైన పథకాల అమలు, నిర్ణయాత్మక చర్యలు అవసరం. భారత రియల్‌ మనీ గేమింగ్‌(ఆర్‌ఎమ్‌జీ) రంగం అంతర్జాతీయ మార్కెట్‌లో కీలకంగా మారుతోంది. 2019-20 నుంచి 2022-23 మధ్య 28 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధిని నమోదు చేసింది. ఈ రంగ ఆదాయం వచ్చే అయిదేళ్లలో 7.5 బిలియన్‌ డాలర్లను నమోదు చేయగలదు. లక్షల కొద్దీ గేమర్లు ఈ వృద్ధికి దోహదం చేయనున్నారు. అనుబంధ రంగాలైన ఫిన్‌టెక్, క్లౌడ్‌ సర్వీసులు, సైబర్‌ భద్రతలో ఉపాధి అవకాశాలను ఇది సృష్టిస్తోంది. సైబర్‌ భద్రత, వినియోగదారు రక్షణ, ఆర్థిక ఏకీకరణ అంశాల్లో ఈ రంగానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్‌లో చట్టవ్యతిరేక బెట్టింగ్‌ మార్కెట్‌ 100 బిలియన్‌ డాలర్లకు పైగా చేరుకోవడంతో సవాళ్లు పెరుగుతున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం ఇన్‌-గేమ్‌ కరెన్సీలు, క్రిప్టోలు, ఆఫ్‌షోర్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించడం ఇటీవల బాగా పెరిగింది. నియంత్రణపరమైన చర్యలు చేపడుతున్నా.. మరింత బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z