Kids

చైనాలో భారీ సంక్షోభం. పాఠశాలలు మూసివేత.

చైనాలో భారీ సంక్షోభం. పాఠశాలలు మూసివేత.

చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం విద్యతోపాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2023లో దేశవ్యాప్తంగా 14,808 కిండర్‌ గార్టెన్లు (ఖిందెర్గర్తెన్స్) మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11శాతం తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది. అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించింది. 2023 ఏడాదిలో 5645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. చైనా జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి ఇటీవల 140 కోట్లకు చేరుకుంది. గతేడాది జననాల సంఖ్య దాదాపు 20లక్షలు తగ్గినట్లు అంచనా. 2023లో దేశవ్యాప్తంగా 90లక్షల జననాలు చోటుచేసుకోగా.. 1949 నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం అదే తొలిసారి.

జనాభా పరంగా చైనా రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జననాల, సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోగా.. మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. 2023 నాటికి 60ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా.. 2035 నాటికి ఈ సంఖ్య 40కోట్లు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్‌గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z