Politics

ఇది ఆస్తి తగాదా కాదు…అధికారానికి సంబంధించిన తగాదా-NewsRoundup-Oct 27 2024

ఇది ఆస్తి తగాదా కాదు…అధికారానికి సంబంధించిన తగాదా-NewsRoundup-Oct 27 2024

* హైదరాబాద్‌లోని ఓరియన్‌ విల్లాస్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసం వద్దకు ఆదివారం మధ్యాహ్నం భారీగా చేరుకున్న పోలీసులు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనలు తెలిపారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా లోనికి వెళ్లేందుకు పోలీసులు యత్నించడంతో వారిని అడ్డగించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. రాజ్‌ పాకాల నివాసంలోకి వెళ్లకుండా అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్‌తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్న పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. ఎమ్మెల్యేలను నెట్టుకుంటూ లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు కేపీ వివేకానంద, బాల్క సుమన్‌, రాజుసాగర్‌, రాకేశ్‌, ఆశిష్‌ యాదవ్‌ సహా 15 మంది అరెస్టు చేశారు.

* ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) కళ్లలో ఆనందం చూడటానికి వైఎస్‌ షర్మిల (YS Sharmila) మాజీ సీఎం జగన్‌పై నిందలు వేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YCP MP Vijayasai Reddy) ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌ మళ్లీ సీఎం పీఠం అధిరోహించకూడదు అనే ఉద్దేశంతో జగన్‌ (YS Jagan) తప్ప ఇంకేవరైనా సీఎం పదవి పరవలేదన్న చంద్రబాబు ఇచ్చిన ఎజెండాతో ముందుకు వెళుతున్నారని షర్మిలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ షర్మిల చంద్రబాబుతో, ఎన్డీయేతో లాలూచి పడి జగన్‌పై వ్యతిరేకంగా పనిచేస్తున్న దాంట్లో సందేహం లేదని పేర్కొన్నారు. ఇది ఆస్తా తగదా కాదు. అధికారానికి సంబంధించిన తగాదా అని పేర్కొన్నారు. ఆమె ఇప్పటివరకు పెట్టిన మీడియా సమావేశాలన్నీ జగన్‌ను తిట్టడానికేనని విమర్శించారు.

* ఆస్తుల వివాదంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. మీరు చదివింది జగన్‌ మోహన్‌ రెడ్డి స్క్రిప్ట్‌ కాదని ప్రమాణం చేయగలవా అని విజయసాయిరెడ్డికి సవాలు విసిరారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ? అని నిలదీశారు. మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే అని ఎద్దేవా చేవారు. రాజకీయంగా,ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే.. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే అని విమర్శించారు. YSR మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదని షర్మిల స్పష్టం చేశారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది YSR అని తెలిపారు . బంగారు బాతును ఎవరు చంపుకోరని.. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరని అన్నారు. YSR మరణానికి చంద్రబాబు కారణం అయితే మీరు అధికారంలో ఉండి ఐదేళ్లు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు ? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు ? దోషులను ఎందుకు శిక్షించలేదు ? అని నిలదీశారు. అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు ? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా అని మండిపడ్డారు.

* బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇంటిపై పోలీసులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఖండించారు. కారణం, వారెంట్‌ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో ఏదో జరిగితే కేటీఆర్‌కు సంబంధమేంటని నిలదీశారు. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. రేవంత్‌ సోదరుల ఇళ్లపై ఇలాగే చేసే దమ్ముందా అని పోలీసులను ప్రశ్నించారు. స్వయంగా పోలీసులే రేవంత్‌ రెడ్డి తమ్ముడితో సెటిల్‌ చేసుకోమని బాధితులకు చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. పై నుంచి మోదీ, ఆదానీలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. నిజాం కాలంలో కూడా ఇంతలా దుర్మార్గం లేదని అన్నారు. చిల్లర దాడులు తమను భయపెట్టలేవని జగదీశ్‌ రెడ్డి అన్నారు. తమకు అరెస్టులు కొత్త కాదని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌, సెర్చ్‌ వారెంట్‌ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లో KTR కి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా గొంతుకైన KTR కి సమాధానం చెప్పలేక రేవంత్‌ రెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నారని అన్నారు.

* భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఉభయసభల సభ్యులు సమావేశమవుతారు. రాజ్యాంగానికి ఆమోదం లభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఆర్టికల్స్‌, చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల గురించిన విషయాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కాగా గతంలో నవంబర్ 26వ తేదీని జాతీయ న్యాయదినోత్పవంగా నిర్వహించే వారు. అయితే 2015లో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మార్చారు. వచ్చే నవంబర్‌ 26 నాటికి మన రాజ్యాంగం ఆమోదం పొంది సరిగ్గా 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున పార్లమెంట్‌ ఉభయసభలను ప్రత్యేకంగా సమావేశపర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

* బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు (Harish Rao) అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల నిజమైన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోనప్పుడు, ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులను సహచర పోలీసులే అరెస్ట్ చేసినప్పుడు, పోలీసులు ఏమి చేయాలని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో వారి సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈమేరకు డిజీపీ జితేందర్‌ను హరీశ్‌ రావు కోరారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏక్‌ పోలీస్‌ విధానాన్ని అమలు చేయాలని బెటాలియన్‌ పోలీసుల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే శనివారం బెటాలియన్లలో ఆందోళనలు నిర్వహించిన కానిస్టేబుళ్లపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. క్షమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తూ 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని హరీశ్ రావు డీజీపీని కోరారు. మరోవైపు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

* ఒక‌ప్ప‌టి ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌, దిగ్గ‌జ క్రికెట‌ర్‌ డేవిడ్‌ వార్నర్‌ పుట్టినరోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్షలు (Birthday Wishes) వెలువెత్తుతున్నాయి. క్రీడ రంగానికి చెందిన ప్ర‌ముఖులు డేవిడ్ భాయ్ కి విషెస్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ క్రికెట్‌ సూపర్ స్టార్‌కి తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అల్లు అర్జున్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో డేవిడ్ వార్న‌ర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. మీరు కోరుకున్నవన్నీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’. అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చారు. అయితే డేవిడ్ వార్న‌ర్ రిప్ల‌య్ ఇస్తూ.. ధ‌న్యావాదాలు అల్లు అర్జున్ గారు. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నా అంటూ రాసుకొచ్చారు.

* అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 10 రోజుల్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా డెమోక్రాట్‌ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి మిషెల్‌ ఒబామా (Michelle Obama) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అధికారంలోకి వస్తారేమోనని తనకు భయంగా ఉందని అన్నారు. ‘కమలా హారిస్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశానికి ఓ అసాధారణ అధ్యక్షురాలు అవుతారు. కానీ హారిస్‌ కంటే ట్రంప్‌నకే అధికంగా విజయావకాశాలు ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. ఇది హారిస్‌ మద్దతుదారుల్లో ఆందోళన, భయం పెంచుతున్నాయి. ఇప్పటికే ట్రంప్‌ పాలనలో నెలకొన్న అస్థిరతను, ఆయన మానసిక పరిస్థితి, దుందుడుకు ఆలోచనలను మనం చూశాం. అయినా ఆయనకు ప్రజలు మద్దతివ్వడం నాలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అదే నిజమవుతుందేమో అని భయమవుతోంది’ అని మిషెల్‌ అన్నారు.

* తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్ర రథయాత్ర చేపట్టినట్టు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. తిరుపతి ఇస్కాన్‌రోడ్డులోని కంచి మఠంలో శ్రీరామ యంత్రానికి (శ్రీచక్రం) స్వామిజీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తిరుపతి నుంచి అయోధ్యకు తీసుకువెళుతున్న శ్రీరామ యంత్ర రథాన్ని తితిదే జేఈవో వీరబ్రహ్మంతో కలిసి స్వామిజీ జెండా ఊపి ప్రారంభించారు.

* విమాన బెదిరింపులను కేంద్ర ప్రభుత్రం తీవ్రంగా పరిగణిస్తున్నప్పటికీ ఈ తరహా ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆదివారం కూడా 50 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో గడిచిన 14 రోజుల్లో మొత్తంగా 350కిపైగా విమానాలు ఈ తరహా బెదిరింపులు ఎదుర్కొన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తమ సంస్థకు చెందిన 15 విమానాలకు ఆదివారం బెదిరింపులు వచ్చినట్లు ఆకాశ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. వాటికి క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత సర్వీసులు కొనసాగాయని పేర్కొంది. వీటితోపాటు ఇండిగోకు చెందిన 18 విమానాలకు, 17 విస్తారా విమానాలకు ఇటువంటి మెసేజ్‌లు వచ్చినట్లు సమాచారం. ఇలా మొత్తంగా ఆదివారం ఒక్కరోజే 50 విమానాలకు బెదిరింపులు రావడం గమనార్హం.

* ‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్‌ విషయంలో భయపడడం లేదు’’ అని నటుడు విజయ్‌ (Vijay) అన్నారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్‌ అని పేర్కొన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతోపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సభకు వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.

* తాను చిరంజీవి (Chiranjeevi)తో సినిమా ప్లాన్‌ చేస్తున్నట్టు రచయిత, దర్శకుడు బీవీఎస్‌ రవి (BVS Ravi) తెలిపారు. ఆదివారం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన 4వ సీజన్‌ తొలి ఎపిసోడ్‌ మంచి విజయం అందుకున్న సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చా’’ అని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z