* సెర్చింజన్ దిగ్గజం గూగుల్ భారీ ఫైన్ చెల్లించాల్సి వస్తోంది. ఓ చిన్న వెబ్‌సైట్‌ను తన స్వార్థం కోసం తొక్కేసినట్లు అది ఆరోపణలు ఎదుర్కొంటోంది. యూకేకు చెందిన షివన్, ఆడమ్ రిఫ్ అనే జంట 2006లో ధరలను పోల్చే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీనికి ‘ఫౌండెమ్’ అని పేరు పెట్టారు. వీరు ఆ వెబ్‌సైట్‌ను లైవ్‌లోకి తెచ్చాక.. గూగుల్ సెర్చ్‌లో నాటకీయంగా దాని విజిబులిటీ పడిపోవడం మొదలైంది. జనం ‘ప్రైస్ కంపారిజన్’, ‘షాపింగ్’ వంటి కీవర్డ్స్ వాడినా ఈ వెబ్‌సైట్ కనిపించడం లేదు. గూగుల్‌కు చెందిన ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్స్ విధించిన పెనాల్టీ కారణంగా తమ వెబ్‌సైట్ పడిపోతోందని షివన్, ఆడమ్ రిఫ్ గుర్తించారు. దీనికితోడు గూగుల్‌లో దాని ర్యాంక్ కూడా గణనీయంగా పడిపోయింది. ఇతర సెర్చి ఇంజిన్లలో సాధారణంగానే ఉన్నట్లు గమనించారు. ఫలితంగా ‘ఫౌండెమ్’ ఆదాయం కూడా పడిపోయింది. సాంకేతిక కారణాల వల్లే తమ పేజీ సెర్చిలో కనిపించలేదని గుర్తించి.. గూగుల్ ఈవిషయాన్ని ప్రస్తావించారు. దాదాపు రెండేళ్లైనా అది పెనాల్టీని తొలగించలేదు. దీంతో ఆ జంట చేసేది లేక ఐరోపా కమిషన్‌ను ఆశ్రయించింది. అధికారులు సుదీర్ఘకాలంపాటు దర్యాప్తు చేసి.. గూగుల్ తన షాపింగ్ సర్వీస్‌ను ప్రమోట్ చేసుకోవడానికి.. ‘ఫౌండెమ్’ వంటి సంస్థలతో అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని 2017లో తీర్పును వెలువరించింది. 2.4 బిలియన్ పౌండ్ల (సుమారు రూ.26 వేల కోట్లు) ఫైన్‌ను వేసింది. దీనిపై ఆ సెర్చింజన్ అప్పీల్‌కు వెళ్లింది. దాదాపు ఏడేళ్లపాటు న్యాయపోరాటం జరిగింది. చివరికి ‘ది యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్’ కింది న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గూగుల్ అప్పీల్‌ను తిరస్కరించింది. దీనిపై షివన్, ఆడమ్ రిఫ్ జంట స్పందిస్తూ తీర్పు చాలా ఆలస్యమైందని అభిప్రాయపడింది. వీరి ఫౌండెమ్‌ను 2016లో మూసివేయాల్సి వచ్చినా.. సివిల్ డామేజ్ క్లెయిమ్‌లపై కేసు 2026లో విచారణకు రానున్నట్లు తెలిపారు.
* ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ధరల శ్రేణిని రూ.371-390గా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం రూ.11,300 కోట్ల సమీకరణకు వస్తున్న స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 5న విండో తెరుచుకోనుంది. ఐపీఓలో భాగంగా రూ.6,800 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులు తమ షేర్లు విక్రయించనున్నారు. మరో రూ.4500 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించనున్నారు. ఈ నిధులు కంపెనీకి చేరనున్నాయి. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ప్రోసస్‌కు స్విగ్గీలో 31శాతం వాటా ఉంది. ఎంఐహెచ్ ఇండియా ఫుడ్ హోల్డింగ్స్ రూపంలో వాటాలు ఉన్నాయి. ఇందులో ఐదో వంతు వాటాను ఐపీఓలో భాగంగా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్ బ్యాంక్‌కు కూడా స్విగ్గీలో వాటాలు ఉన్నాయి.
* ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3593 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1341 కోట్ల నికర లాభంతో పోలిస్తే దాదాపు 168 శాతం పెరగడం గమనార్హం. జులైలో చేపట్టిన టెలికాం టారిఫ్‌ల సవరణ ఎయిర్‌టెల్‌కు బాగా కలిసొచ్చింది. గత త్రైమాసికంతో (రూ.4159 కోట్లు) పోలిస్తే లాభం 13.6 శాతం తగ్గడం గమనార్హం. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం 12 శాతం వృద్ధితో రూ.37,044 కోట్ల నుంచి రూ.41,473 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇతర ఆదాయం రూ.254 కోట్లు వచ్చినట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ.203 నుంచి రూ.233కి పెరగడం గమనార్హం. ఎయిర్‌టెల్ యూజర్ల నెలకు సగటున 23.9 జీబీ డేటాను వాడుతున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది.
* హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు హైదరాబాద్ విమానాశ్రయానికి ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందని చెప్పాడు. దీంతో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే విశాఖ విమానాశ్రయానికి సమాచారం అందించారు. అప్రమత్తమైన విశాఖ విమానాశ్రయ అధికారులు.. అప్పటికే విశాఖ నుంచి ముంబయి బయలుదేరిన ఇండిగో విమానాన్ని వెనక్కి రప్పించారు. ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకు దింపి.. భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. విమానంలో బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి విశాఖ నుంచి ముంబయి బయలుదేరేందుకు విమానం సిద్ధంగా ఉంది.
* బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ ‘స్లైస్’ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు(NESFB)తో తన విలీనాన్ని పూర్తి చేసింది. అవసరమైన షేర్‌హోల్డర్, రెగ్యులేటరీ అనుమతులు పొందిన తర్వాత అక్టోబర్ 27 నుంచి విలీన ప్రక్రియ అమల్లోకి వచ్చినట్లు ఈరోజు(సోమవారం) తెలిపింది. ఈ విలీనం రెండు సంస్థల కార్యకలాపాలు, ఆస్తులు, బ్రాండ్ గుర్తింపులను ఒకే బ్యాంకింగ్ సంస్థగా ఏకీకృతం చేస్తుందని పేర్కొంది. విలీనమైన సంస్థ ఈశాన్య ప్రాంతంలో తన ఉనికిని మరింతగా పెంచుతుందని, భారత్ అంతటా తన పరిధిని విస్తరిస్తుందని తెలిపింది. 2023 అక్టోబర్‌లో NESFBతో విలీనం చేయడానికి ‘స్లైస్’ ఆర్‌బీఐ ఆమోదాన్ని పొందింది. ఆ తర్వాత విలీనం కోసం బహుళ నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసింది. ఈ ఏడాది మార్చిలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఆమోదం లభించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ఆగస్టులో విలీనానికి ఆమోదం తెలిపింది.
* Kunal Kamra vs Ola CEO Bhavish Aggarwal | దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) సర్వీసుల విషయంలో ఆ సంస్థ సీఈఓ భవీశ్ అగర్వాల్, ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సోషల్‌మీడియాలో మాటల వార్ నడిచింది. అది ఇంకా కొలిక్కి రాలేదు. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)ని కునాల్ ట్యాగ్ చేసి.. భారత వినియోగదారుల కష్టాలను పరిశీలించాలని ‘ఎక్స్’ వేదికగా కోరారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z