Business

భారత్‌లో యాపిల్ 17 తయారీ-BusinessNews-Oct 30 2024

భారత్‌లో యాపిల్ 17 తయారీ-BusinessNews-Oct 30 2024

* కొవిడ్‌ సమయంలో ఎదురైన చేదు అనుభవంతో చైనా నుంచి ఐఫోన్ల తయారీని ఇతర దేశాలకు తరలించిన యాపిల్‌.. తాజాగా ఆ దేశానికి మరో ఝలక్‌ ఇచ్చింది. యాపిల్‌ 17 (iPhone) ముందస్తు తయారీని తొలిసారి భారత్‌లో చేపడుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియను చైనాలో మాత్రమే నిర్వహించిన యాపిల్‌ సంస్థ.. తొలిసారి డ్రాగన్‌ దేశానికి వెలుపల చేపడుతుండడం గమనార్హం. కొన్నేళ్లుగా వివిధ ఐఫోన్‌ మోడళ్లు భారత్‌లో తయారవుతున్నాయి. ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో ఇతర దేశాలకూ యాపిల్‌ వీటిని ఎగుమతి చేస్తోంది. సాధారణంగా ఒక ప్రొడక్ట్‌ విడుదలైన తర్వాత ఇక్కడ తయారీ చేపడుతుంటారు. కానీ, అమెరికాలో యాపిల్‌ పార్క్‌లో తదుపరి తరం మొబైల్‌ డిజైన్‌ రూపు దిద్దుకున్నాక.. కమర్షియల్‌ లాంచ్‌కు ముందు ఫోన్లను మాత్రం చైనాలోనే ఇన్నాళ్లూ యాపిల్‌ చేపడుతూ వస్తోంది. అంటే పూర్తి స్థాయి తయారీకి ముందు ఉన్న ఫోన్లన్నీ చైనాలో రూపొందినవే అన్నమాట. అక్టోబర్‌ నుంచి మే నెల మధ్యలో సాధారణంగా ఈ ప్రక్రియ జరుగుతుంటుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) బుధవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ ఉదయం 80,237.85 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,369.03) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 79,821.99 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 426.85 పాయింట్ల నష్టంతో 79,942 వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్లు కుంగి 24,340 వద్ద స్థిరపడింది.

* దిగుమతి సుంకంలో కోతతో దేశంలో బంగారానికి (Gold) భారీగా డిమాండ్ ఏర్పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ 18 శాతం పెరిగి 248.3 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి ఆ మొత్తం 210.2 టన్నులుగా ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా బంగారానికి (Gold) డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ఈ ఏడాది మొత్తం బంగారం గిరాకీ 700 నుంచి 750 టన్నుల మధ్య ఉండొచ్చని అంచనా. ధన త్రయోదశి కారణంగా గిరాకీ ఏర్పడటంతో మంగళవారం దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.81,400కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. మరోపక్క అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ ఐదు శాతం పెరిగి, 1,313 టన్నులకు చేరుకుంది. గత త్రైమాసికంలో ఇది 1,249.6 టన్నులుగా ఉందని స్వర్ణ మండలి పేర్కొంది. బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానంలో భారత్‌ నిలుస్తోంది. మన దేశ దిగుమతుల్లో 40 శాతం పసిడి వాటా స్విట్జర్లాండ్‌దే. 16 శాతంతో యూఏఈ, 10 శాతంతో దక్షిణాఫ్రికా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

* అధిక-వోల్టేజీ విద్యుత్‌ గ్రిడ్‌లను విస్తరించడం, బలోపేతం చేయడం కోసం మధ్యప్రాచ్యం(మిడిల్‌ ఈస్ట్‌), ఆఫ్రికాలో ప్రధాన ప్రాజెక్టులను చేజిక్కించుకున్నట్లు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ లార్సెన్‌ & టూబ్రో ఈరోజు(బుధవారం) తెలిపింది. ప్రాజెక్టుల్లో భాగంగా కెన్యాలో నేషనల్‌ సిస్టం కంట్రోల్‌ సెంటర్‌ను, సౌదీ ఆరేబియాలో హై-వోల్టేజ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, ఖతార్‌లో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్లను నిర్మిస్తారు. L&Tకి సంబంధించిన ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్టికల్‌ ద్వారా ఈ ఆర్డర్లను పొందినట్లు కంపెనీ BSE ఫైలింగ్‌లో తెలిపింది. L&T..ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(EPC) ప్రాజెక్టులు, హైటెక్‌ తయారీ/సేవల్లో నిమగ్నమై ఉన్న 27 బిలియన్‌ డాలర్ల విలువైన భారతీయ బహుళ జాతి సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాలలో విస్తరించి ఉంది.

* వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ రిటర్న్‌లకు సంబంధించి నిబంధనలలో మార్పులు రానున్నాయి. ఇందులో భాగంగా 2025 ప్రారంభం నుండి జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి మూడు సంవత్సరాల తర్వాత నెలవారీ, వార్షిక జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయలేరు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) తాజాగా జరిగిన సంప్రదింపులలో ఈ విషయాన్ని తెలిపింది. జీఎస్టీ అమ్మకాల రిటర్న్‌లతో పాటు, బకాయిల చెల్లింపు, వార్షిక రిటర్న్‌లు, టీసీఎస్‌ వసూలుకు సంబంధించిన రిటర్న్‌లకు కొత్త నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అంటే రిటర్న్‌ల సమర్పణ గడువు తేదీ నుండి మూడేళ్ల వ్యవధి ముగిసిన తర్వాత రిటర్న్‌ దాఖలు చేయడంపై నిషేధం ఉంటుంది. “ఈ మార్పు వచ్చే ఏడాది (2025) ప్రారంభం నుండి జీఎస్టీ పోర్టల్‌లో అమలులోకి రాబోతోంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిచూసుకోవాలి. ఇంకా ఎవరైనా జీఎస్టీ రిటర్న్‌లను దాఖలు చేయకపోతే వీలైనంత త్వరగా దాఖలు చేయాలి” అని జీఎస్టీఎన్‌ సూచించింది. సకాలంలో జీఎస్టీ దాఖలును పూర్తి చేయడం, డేటా విశ్వసనీయతను పెంచడం, ఫైల్ చేయని రిటర్న్‌ల ‘బ్యాక్‌లాగ్’ను సమర్థవంతంగా తగ్గించడం లక్ష్యంగా జీఎస్టీఎన్‌ కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసే వ్యవధిని పరిమితం చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిపోల్చుకుని, సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z