Devotional

తితిదే ఛైర్మన్‌గా TV5 బీ.ఆర్.నాయుడు-NewsRoundup-Oct 30 2024

తితిదే ఛైర్మన్‌గా TV5 బీ.ఆర్.నాయుడు-NewsRoundup-Oct 30 2024

* తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో తితిదే పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు తితిదే అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తితిదే బోర్డు సభ్యులు వీరే..
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
సాంబశివరావు (జాస్తి శివ)
శ్రీసదాశివరావు నన్నపనేని
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
జంగా కృష్ణమూర్తి
దర్శన్‌. ఆర్‌.ఎన్‌
జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌
శాంతారామ్‌
పి.రామ్మూర్తి
జానకీ దేవి తమ్మిశెట్టి
బూంగునూరు మహేందర్‌ రెడ్డి
అనుగోలు రంగశ్రీ
బురగపు ఆనందసాయి
సుచిత్ర ఎల్లా
నరేశ్‌కుమార్‌
డా.అదిత్‌ దేశాయ్‌
శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా

* తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామ శివారులోని బాణాసంచా తయారీ కేంద్రం వద్ద బుధవారం సాయంత్రం పిడుగుపడి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో బాణసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధం కాగా, ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. పదిమందికి పైగా పాక్షికంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాణసంచా కేంద్రం వద్ద ఉన్న సమీపంలోని పొలాల్లోకి పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు.

* అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వివాహ ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 4న (Naga Chaitanya Sobhita Dhulipala Marriage Date) వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ ఏడాది ఆగస్టు 8న నాగచైతన్య-శోభితల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. అయితే, పెళ్లి తేదీ విషయమై అప్పట్లో ఎలాంటి ప్రకటనా చేయలేదు. వీరి వివాహం ఎప్పుడు ఉంటుందా? అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వివాహ తేదీని ఖరారు చేశారు. డిసెంబరులో నాగచైతన్య-శోభితల వివాహం ఉంటుందని ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే, అధికారికంగా ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

* దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. 2025 మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు. 90 శాతం 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేపడతారు. విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

* తెలంగాణలో గ్రూప్‌-3 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది. నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) తాజాగా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్‌ -2 నిర్వహించనున్నారు. అలాగే, నవంబర్‌ 18న పేపర్‌ 3 పరీక్షను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహిస్తారు. నవంబర్‌ 10న హాల్‌ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

* నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా వై.వి.ఎస్‌.చౌదరి (YVS Chowdary) కొత్త సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకునేందుకు వై.వి.ఎస్‌.చౌదరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందులో న్యూ హీరో తారక రామారావుని పరిచయం చేశారు. దర్శకుడు రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వై.వి.ఎస్‌. చౌదరి మాట్లాడుతూ.. సీనియర్‌ ఎన్టీఆర్‌పై ఆసక్తితో తాను ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు. ఆయన ప్రోత్సాహం వల్లే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నట్లు వివరించారు. ‘‘ఎన్టీఆర్‌’ తన మునిమనవడు రూపంలో వచ్చారు. ఎన్టీఆర్‌ అనే పేరు మూడు అక్షరాల తారకమంత్రం. ఆరడుగుల రూపం ఈ తారక రామారావుది. ఈ హీరోకు కుటుంబం నుంచి పూర్తి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నా. నేను అందరి హీరోల అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తాను. నేను ఇప్పటివరకు పరిచయం చేసిన హీరోలందరినీ ఫ్యాన్స్‌ ఆదరించారు. అలానే ఈ తారకరామారావును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.

* గూగుల్‌ తన సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ను రూపొందించడానికి కృత్రిమ మేధ (AI)పై ఎక్కువగా ఆధారపడుతోందని కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) అన్నారు. జనరేట్‌ చేసిన కోడ్‌ను ఇంజినీర్లు రివ్యూ చేస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరిగిందన్నారు. గూగుల్‌ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా పిచాయ్‌ ఏఐ గురించి ఆసక్తికర విషయాలను తన బ్లాగ్‌ పోస్ట్‌లో పంచుకున్నారు.

* ‘జై హనుమాన్‌’ (Jai Hanuman)లో హనుమంతుడిగా కనిపించేది ఎవరా? అని ఎదురు చూస్తున్న సినీ ప్రియుల ఉత్కంఠకు తెర పడింది. దీపావళిని పురస్కరించుకుని చిత్ర బృందం బుధవారం ఆ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ (Jai Hanuman Movie First Look) చేసింది. ‘కాంతార’తో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన కన్నడ స్టార్‌ హీరో రిషభ్‌ శెట్టి (Rishab Shetty) ‘జై హనుమాన్’లో ఆంజనేయస్వామి పాత్రలో నటించనున్నారు. ఈ మేరకు పోస్టర్‌ను (Jai Hanuman movie poster) విడుదల చేశారు.

* ఉత్తర కొరియా(North Korea) తన ఏడో అణు పరీక్ష(nuclear and ICBM tests)కు సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం అందిందని దక్షిణ కొరియా(South Korea) పేర్కొంది. ఈమేరకు తమ దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చట్టసభ సభ్యులకు వివరాలు అందజేసినట్లుగా తెలిపింది. అమెరికాలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణిని పరీక్షించేందుకూ ఆ దేశం సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.

* వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ రద్దుకు కుట్రగా ఆ పార్టీ నేతలు పేర్కొనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌ అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. జగన్‌తో ఆస్తుల వివాదం నేపథ్యంలో ఆమె మరోసారి స్పందించారు. ‘‘ఈడీ అటాచ్‌ చేసింది షేర్లు కాదు.. రూ.32కోట్ల విలువైన కంపెనీ స్థిరాస్తి. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు. స్టేటస్‌కో ఉన్నది షేర్లపై కాదు. గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వాటికి స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌, బదిలీలు మాత్రం ఆపలేదు. ఈడీ అటాచ్‌ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదనడం హాస్యాస్పదం. నాకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని ఎంవోయూపై జగన్‌ సంతకం చేశారు. బెయిల్‌ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా?

* కెనడాలోని ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే అమెరికా పత్రిక వాషింగ్టన్‌ పోస్టుకు లీక్‌ చేసినట్లు ఆ దేశ ఎన్‌ఎస్‌ఏ నటాలియా డ్రౌయిన్‌ అంగీకరించారు. మంగళవారం పార్లమెంట్‌ ప్యానెల్‌ ముందు ఆమె వాగ్మూలం ఇచ్చారు. ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్‌ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉందని ఆమె పేర్కొన్నారు. తాను ఆ సమాచారం లీక్‌ చేయడానికి ట్రూడో అనుమతి అవసరం లేదని వెల్లడించారు. ఈ దౌత్య వివాదంలో ఒక అమెరికన్‌ మీడియా కెనడా వాదనను వినిపించేలా చేస్తానన్నారని డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్‌ మోరిసన్‌ తెలిపారు. తమ కమ్యూనికేషన్‌ వ్యూహం మొత్తాన్ని ట్రూడో ఆఫీస్‌ పర్యవేక్షిస్తోందని చెప్పారు. అక్టోబర్‌ 14వ తేదీకి ముందు తాను వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు వెల్లడించిన సమాచారం గోప్యమైంది ఏమీ కాదని నటాలియా సదరు ప్యానల్‌కు వెల్లడించారు. భారత్‌తో సహకారానికి తాము తీసుకొన్న చర్యలు కూడా అందులో ఉన్నాయన్నారు. కెనడా వాసులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఆధారాలను న్యూదిల్లీకి ఏవిధంగా చూపించామో దానికి వెల్లడించామన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z