* బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు గోపాలన్ మావయ్య అవుతారు. గోపాలన్ మృతిని ధ్రువీకరిస్తూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దేశీయ కన్జూమర్ బ్రాండ్‌ను నెలకొల్పిన దార్శనికుడు దూరమయ్యారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. గోపాలన్ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఎంతో బాధించిందని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశీయ టెలివిజన్ మార్కెట్‌లో బీపీఎల్ (BPL) పేరు తెలీని వారుండరు. కేవలం టీవీలే కాకుండా.. ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు తయారు చేసే సంస్థగానూ గుర్తింపు పొందింది. దీన్ని నంబియార్ 1963లో నెలకొల్పారు. ఒక కంపెనీని స్థాపించడానికి అనుమతులు పొందడమే కష్టంగా ఉన్న ‘లైసెన్స్ రాజ్’ రోజుల్లో ఆయన ఈ సంస్థను స్థాపించడం విశేషం. తొలుత కేరళలోని పాలక్కడ్‌లో బీపీఎల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పి.. తర్వాత బెంగళూరుకు మార్చారు. తొలినాళ్లలో రక్షణ దళాలకు సీల్డ్ ప్రెసిషన్ ప్యానెల్ మీటర్లను తయారు చేసిన ఈ సంస్థ.. తర్వాతి కాలంలో కలర్ టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు, వీడియో క్యాసెట్లు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. 1990ల్లో ఎలక్ట్రానిక్ రంగంలో బీపీఎల్‌దే హవా. అలాంటిది అంతర్జాతీయ బ్రాండ్లయిన శాంసంగ్, ఎల్‌జీ ప్రవేశంతో తన వైభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం గోపాలన్ నంబియార్ తనయుడు అజిత్ నంబియార్ బీపీఎల్‌కు ఛైర్మన్‌గా, సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
* చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (Oneplus) కొత్త ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 13 (Oneplus 13) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అమర్చారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్‌ను తీసుకురావడం గమనార్హం.
* వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15తో కూడిన కలర్ ఓఎస్ 15తో పనిచేస్తుంది. గ్లోబల్‌గా లాంచైనప్పుడు ఆక్సిజన్ ఓఎస్15తో తీసుకొస్తారు. 6.82 అంగుళాల క్వాడ్ హెచ్+ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేతో వవస్తోంది. డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో వెనుక వైపు మొత్తం మూడు కెమెరాలు ఇచ్చారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో తీసుకొచ్చారు. ముందు వైపు 32 ఎంపీ కెమెరాను అమర్చారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అనుబంధ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు (HDB Financial IPO) సిద్ధమైంది. ఈమేరకు సెబీకి ప్రాథమిక పత్రాలను సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.12,500 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో రూ.10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,500 కోట్ల నిధుల్ని సమీకరించనుంది. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు 94.64 శాతం వాటా ఉంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను మూలధన వ్యయాలకు, రుణాలు తీర్చేందుకు వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. మిగిలిన డబ్బుల్ని వ్యాపార వృద్ధికి వెచ్చించనుంది. అప్పర్ లేయర్‌లో ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మూడేళ్లలోపు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసుకోవాలని ఆర్‌బీఐ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల ప్రారంభంలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డు దాని అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించిన షేర్ల విక్రయానికి ఆమోదం పొందింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో చివరకు సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,044.95 వద్ద (క్రితం ముగింపు 79,942.18) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 79,287.93 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 553 పాయింట్లు కుంగి 79,389.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 135 పాయింట్లు క్షీణించి 24,205 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 24,172- 24,372 మధ్య ఊగిసలాడింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z