పార్టీ పెట్టిన అనతికాలంలో గత చరిత్రకు సరికొత్త సొబగులు అద్ది అధికార పగ్గాలు చేపట్టి, పేదలకు, నిస్సహాయులకు, శ్రామికులకు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ మరో శతాబ్దం పాటు ఇదే ధ్యేయంతో ముందుకు సాగుతూ నిటారుగా నిలబడేలా పోరాడతామని ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం నాడు అట్లాంటా ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ చేసిన అనంతరం ప్రసంగించారు.
అమెరికాలో తలసరి ఆదాయం చూస్తే తెలుగువారు ప్రథమ వరుసలో ఉన్నారని, అన్ని రంగాల్లో వీరు ముందు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తన కోరిక కూడా అని లోకేష్ అన్నారు. ప్రవాసులు సమాజానికి ఉపయోగపడే వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విరివిగా పెట్టుబడులు పెట్టి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ దిశగా ఏపీకి వచ్చేవారికి లోకేష్ అండగా నిలబడతానని హామీనిచ్చారు. గత ప్రభుత్వంతో పోరాడిన దానికన్నా తెదేపాలో అంతర్గత సంస్కరణలు తీసుకురావడానికి ఎక్కువ పోరాడామని, అందుకే పార్టీ బలోపేతంగా, పటిష్టంగా నిలబడిందని…నేటికీ ఎల్లలు దాటిన కార్యకర్తలను సంపాదించుకుందని అభిప్రాయపడ్డారు. పోరాడితేనే కలలు నిజమవుతాయన్న లోకేష్, పార్టీపరమైన, రాష్ట్రాభివృద్ధిపరమైన ఏ అంశాలపైనైనా తనకు నిస్సందేహంగా, నిర్మొహమాటంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై తెదేపా సమన్వయకర్త కోమటి జయరాం, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z