* కెనడా (Canada)లో భారీగా డ్రగ్స్ (drugs) గుట్టు రట్టయింది. వాంకోవర్ పరిధిలో అక్రమంగా నడుపుతోన్న ల్యాబ్‌ను పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో జరిపిన సోదాల్లో మాదక ద్రవ్యాలతో పాటు పలురకాల రసాయనాలు, ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత సంతతికి చెందిన గగన్‌ప్రీత్ సింగ్ రంధవాను అరెస్టు చేశారు.
* ప్రముఖ నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) సోదరుడు, సీనియర్ నటుడు, దర్శకుడు చారుహాసన్ (Charuhasan) అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయన అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈవిషయాన్ని ఆయన కుమార్తె, నటి సుహాసిని మణిరత్నం (Suhasini Mani Ratnam) సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
* జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన (Chenab Rail Bridge)పై పొరుగుదేశం పాకిస్థాన్(Pakistan) కన్నేసినట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని రైసీ, రామబాణ్ జిల్లాల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనకు సంబంధించిన వివరాలు సేకరించమని చైనా(china) పాకిస్థాన్‌ను కోరడంతో ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ బ్రిడ్జి గురించిన కీలకమైన విషయాలు తెలుసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వివరాలు ఎందుకు తెలుసుకుంటున్నారనే విషయంపై స్పష్టత లేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ రైల్వేవంతెన నిర్మాణం దాదాపు పూర్తయిన విషయం తెలిసిందే. దీని నిర్మాణం పూర్తిచేయడానికి ప్రభుత్వానికి 20 ఏళ్లు పట్టింది. ఇటీవల ఈ వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఉధంపుర్-శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు.
* మహిళలు అన్ని వేళలా ఆత్మగౌరవంతో జీవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈదుపురంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు.
* తెలంగాణ సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) స్వీకరించింది. ఎస్పీఎఫ్‌నకు చెందిన 214 మంది ఈ రోజు నుంచి సచివాలయం భద్రత బాధ్యతలు చేపట్టారు. గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతలను ఎస్పీఎఫ్‌నకు ప్రభుత్వం అప్పగించింది.
* ‘దీపం 2.0’ పథకం కేవలం వంటింట్లో వెలుగు ఇవ్వడం కోసమే కాదు.. ప్రతి ఒక్కరి కడుపు నింపాలనేదే ప్రధాన లక్ష్యం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జగన్నాథపురంలో మాట్లాడుతూ.. ‘‘ప్రజలు మాపై నమ్మకంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేశారు. వైకాపా చేసిన దోపిడీ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం’’ అని అన్నారు.
* న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఐదు వికెట్లు తీసి అదరగొట్టిన భారత్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో రికార్డు నెలకొల్పాడు. భారత టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఒకే ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లు తీయడం ఇది 14వ సారి.
* హాలోవీన్ వేడుకల్లో కాల్పుల ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఆర్లాండో నగరంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. డౌన్‌టౌన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
* కరీంనగర్‌లో బీసీ కమిషన్ సమావేశం రసాభాసగా మారింది. బహిరంగ విచారణకు హాజరైన భారాస నాయకులు.. కమిషన్ చట్టబద్ధతపై ప్రశ్నించడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఇతర పార్టీల నేతలు వారిని అడ్డుకున్నారు. బీసీలకు భారాస సర్కారు రూ.45 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వివరిస్తుండగా పలు బీసీ సంఘాల ప్రతినిధులు నిలువరించారు.
* భారాస కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపమని అన్నారు. ప్రస్తుత పాలన ఫ్రం దిల్లీ, టూ దిల్లీ, ఫర్ దిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.
* ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌నకు చెందిన 70 శాతం డ్రోన్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. కాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతుండటంతో ఆ దేశ ప్రధాని నజీబ్ మికాటి(Najib Mikati) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడుల తీరు చూస్తుంటే సంధి ఒప్పందం కుదుర్చుకోవడానికి కాకుండా.. యుద్ధం తీవ్రతను పెంచేందుకే యత్నిస్తున్నట్లు ఉందన్నారు. అయితే.. నవంబర్ 5న అమెరికా ఎన్నికలు జరగడానికి ముందే ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా యుద్ధంలో కాల్పుల విరమణ సాధ్యమవుతుందని అమెరికా రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ చెప్పారని పేర్కొన్నారు.
* నటి రెజీనా (Regina) బాలీవుడ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దక్షిణాది నుంచి ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎంతోమంది భాషాపరమైన సమస్యలు ఎదుర్కొన్న వారే. భాష విషయంలో స్పష్టంగా లేకపోతే.. తమ ప్రాజెక్టుల్లోకి తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. దక్షిణాదిలో అలా ఉండదు. హిందీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు.. ముంబయిలోనే ఉండాలని, మీటింగ్స్‌లో పాల్గొనాలని తెలిపారు. పెద్దగా నచ్చకపోయినప్పటికీ అదే ఇక్కడ ముఖ్యమని అర్థమైంది. నాకోసం ఒక టీమ్ ఉంటుంది. అవకాశాల విషయంలో వాళ్లు నాకు సాయం చేస్తారు. నేను కేవలం ఆడిషన్లలో పాల్గొంటా’’ అని చెప్పారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లో పోటీ ఎక్కువగా ఉంటుందన్నారు.
* జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల అలియాస్ పాకాల రాజేంద్రప్రసాద్ శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎక్సైజ్ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి వచ్చిన రాజ్ పాకాలను రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వద్ద కొనుగోలు చేశారనే అంశాలపై ప్రధానంగా విచారిస్తున్నట్టు సమాచారం.
* ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలికాబోతుందన్నారు. చంద్రబాబు ఇలాంటి విషయాల్లో చాలా దిట్ట అని, ప్రభుత్వ కుట్రలతో ఈ ప్రాజెక్టు బ్యారేజీ స్థాయికి పడిపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మలరామానాయుడు అసలు కన్నా కొసరు ఎక్కువ మాట్లాడారని అంబటి మండిపడ్డారు. రెండు దశలు ఉండవంటూ నిమ్మల చేసిన వ్యాఖ్యలు వింటుంటే.. ఆయనకు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేనట్టుందని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు ఏదైనా దశలవారీగా పూర్తిచేస్తారని తెలిపారు. ప్రాజెక్టు మొదటి దశలో 115.5 టీఎంసీల నిల్వకు పనికొస్తుందని.. చివరగా 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తేనే ప్రాజెక్టు పూర్తి ఫలితాలు అందుతాయని వివరించారు. అయితే 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం జరిగినా.. తప్పు వైఎస్సార్‌సీపీపై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకోకుండా హామీలను ప్రకటించవద్దని.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లకు సూచనలు చేశారు. బడ్జెట్ ఆధారంగా గ్యారంటీలు ప్రకటించాలని తెలిపారు. కాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సేవలను అందించే శక్తి పథకాన్ని సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖర్గే నుంచి ఈ పిలుపు వచ్చింది. అయితే శక్తి పథకాన్ని పునఃసమీక్షించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని సీఎం సిద్దరామయ్యతోపాటు, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పష్టం చేశారు.
* గూగుల్‌తో పోటాపోటీ సమాచారం నెటిజన్లకు అందించేందుకు సెర్చింజన్ సామర్థ్యంతో కూడిన ఏఐ చాట్‌బోట్‌ను ఆవిష్కరిస్తోంది చాట్‌జీపీటీ జనరేటివ్. సంబంధిత వెబ్ సోర్సెస్ కూడిన లింకులతో శేరవేగంగా, సమయానుకూల సమాధానాలు ఇచ్చేలా ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ జనరేటివ్‌ను అప్ గ్రేడ్ చేస్తున్నది. ఇంతకు ముందు అందుబాటులో ఉన్న సంప్రదాయ సెర్చింజన్ నుంచే వెబ్ సోర్సెస్ ఉపయోగించుకోనున్నది ఓపెన్ ఏఐ. చాట్‌జీపీటీ హోమ్ పేజ్ యూజర్లకు అవసరమైన టాపిక్స్ మీద నేరుగా ట్యాబ్ ఆప్షన్లు అందిస్తుంది. వాతావరణ పరిస్థితులు, వివిధ స్టాక్స్ ధరలు, స్పోర్ట్స్ స్కోర్లు, బ్రేకింగ్ న్యూస్ తదితర విషయాలపై ట్యాబ్స్ ఉంటాయని ఓపెన్ ఏఐ తెలిపింది. చాట్‌జీపీటీతో అవసరమైన సమాచారం కోసం ఓపెన్ ఏఐతో ఫ్రాన్స్ లీ మొండె, జర్మనీ యాక్సెల్ స్ప్రింగర్, బ్రిటన్ ఫైనాన్సియల్ టైమ్స్ తదితర సంస్థలు కంటెంట్ డీల్ పై సంతకాలు చేశాయి. చాట్‌జీపీటీ.కామ్ వెబ్ సైట్ తోపాటు మొబైల్ యాప్ లోనూ ఈ ఫెసిలిటీ లభిస్తుందని ఓపెన్ ఏఐ వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z