Agriculture

గిన్నీస్‌కు ఎక్కిన గుమ్మడికాయ గ్యారీ-NewsRoundup-Nov 02 2024

గిన్నీస్‌కు ఎక్కిన గుమ్మడికాయ గ్యారీ-NewsRoundup-Nov 02 2024

* ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్‌ కట్టుకోవడం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు (Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వం హయాంలో రుషికొండపై నిర్మించిన భవనాలను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

* తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీపావళి పండుగ, వారాంతపు సెలవులు కలిసి రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తులు తాకిడి పెరగడంతో ఎలాంటి టోకెన్లు లేని సామాన్య భక్తులకు.. శ్రీవారిని దర్శించుకునేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోందని సమాచారం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్ట్‌మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్నీ పూర్తిగా నిండి.. వెలుపలకు వచ్చిన క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తితిదే అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. వెలుపల క్యూ లైన్‌లో ఉన్న భక్తులతో పాటు కంపార్ట్ట్‌మెంట్లు, షెడ్లుల్లో ఉన్న భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాలను శ్రీవారి సేవకులు సరఫరా చేస్తున్నారు.

* భారత్‌తో దౌత్యసంబంధాలు క్షీణిస్తున్నా కెనడా (Canada) వైఖరి మారడం లేదు. మరోసారి పేట్రేగిపోయింది. ఆ దేశ మంత్రి ఒకరు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై అసంబద్ధ ఆరోపణలు చేశారు. దీనిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడుల వెనక భారత పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి ఒకరు ఆరోపణలు చేశారు. అవి అసంబద్ధమైనవని, నిరాధారమైనవని భారత్‌ కొట్టిపారేసింది.

* రోడ్లు అనేవి నాగరికతకు చిహ్నమని.. రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆయన పర్యటించారు. వెన్నెలపాలంలో రహదారిపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర తదితరులు ఉన్నారు.

* రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేసి.. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలని కొత్త వైఎస్‌ఛాన్సలర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన ఉపకులపతులు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం తగ్గుతోందని, మళ్లీ విశ్వాసం పెంచేలా పనిచేయాలన్నారు.

* తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీది నెరవేర్చని హామీల కథ అని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం తెలంగాణనే కాదు.. దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని ‘‘ఎక్స్‌’’ వేదికగా మండిపడ్డారు. భారాస ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆక్షేపించారు.

* జమ్ముకశ్మీర్‌లో (Jammu kashmir) ఉగ్రదాడులకు (Terror Attack) పాకిస్థానే కారణమని ఇటీవల పదేపదే చెబుతున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా (Farooq Abdullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను చంపకుండా, ప్రాణాలతో పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

* అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్‌. భారీ గుమ్మడి కాయను పడవగా మార్చేసి.. కొలంబియా నదిలో 26 గంటల్లో ఏకంగా 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. గుమ్మడికాయ బోటులో అత్యంత దూరం ప్రయాణించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గత నెల 31న గిన్నిస్‌ రికార్డ్స్‌ బృందం ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందించింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓరెగాన్‌లోని హ్యాపీ వ్యాలీకి చెందిన గ్యారీ 2011 నుంచి గుమ్మడికాయలు సాగు చేస్తున్నాడు. తొలిసారిగా 2013లో ఓ పెద్ద గుమ్మడి కాయను బోటులా తయారు చేసి.. ‘వెస్ట్‌ కోస్ట్‌ జెయింట్ పంప్‌కిన్‌ రెగట్టా’ పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. అప్పటి నుంచి ఆయనకు అదో అలవాటుగా మారింది. గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌లో ఎలాగైనా స్థానం సంపాదించాలన్న ఉద్దేశంతో తన వ్యవసాయ క్షేత్రంలో 1224 పౌండ్ల ( సుమారు 555.2 కేజీలు) గుమ్మడికాయను పండించాడు. అక్టోబరు 5న గిన్నిస్‌ రికార్డ్స్‌ సభ్యుల పర్యవేక్షణలో దాని బరువును లెక్కించాడు. దానిని లోపలి గుజ్జును తీసేసి.. ఓ పడవలా తయారు చేశాడు. అక్టోబరు 12న ఉత్తర బాన్‌విల్లిలోని కొలంబియా నదీ తీరానికి చేరుకొని.. ఏకధాటిగా 26 గంటలపాటు 73.50 కి.మీ ప్రయాణించి కెనడాలోని వాంకోవర్‌ ఒడ్డుకు చేరుకొని రికార్డు నెలకొల్పాడు.

* ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనిక పరంగా తోడ్పడుతున్న భారత్‌కు చెందిన పలు సంస్థలపై అమెరికా ఆంక్షలు (US sanctions) విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసింది. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. సమస్యల పరిష్కారానికి అమెరికా అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఎగుమతి నియంత్రణ నిబంధనలపై భారతీయ కంపెనీలకు అవగాహన కల్పించేందుకు సంబంధిత విభాగాలు, ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. రష్యా యుద్ధానికి సహకరించేలా ఉత్పత్తులు, సేవల్ని అందించడంతో పాటు ఆంక్షల్ని తప్పించుకునేందుకు ఆ దేశానికి సహకరిస్తున్నాయని తప్పు పడుతూ 398 సంస్థలపై అమెరికా ఇటీవల ఆంక్షలు విధించింది.

* రాజధాని అమరావతి రైతులతో సీఆర్‌డీఏ, ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. రైతుల సందేహాల్లో సగం నివృత్తి చేసినట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ భాస్కర్‌ తెలిపారు. సమావేశం అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ..‘‘ అమరావతికి రుణాలు ఇచ్చే సమయంలోనే ఇళ్లు కట్టాలని పలువురు కోరారు. బయట నుంచి వచ్చే వారికీ ఇళ్లు మంజూరు చేస్తాం. 10 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి వస్తే మిలియన్‌ డాలర్ల రాయితీ ఇస్తారు. మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం.. ఇవన్నీ ఒప్పందంలో భాగమే. రైతులు చెప్పిన 90 శాతం అంశాలు ఒప్పందంలో ఉన్నావే. కోర్టు కేసులపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఒప్పందాలు పూర్తయితే ఇంకా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. దాదాపు రూ.30 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నెల 11న రుణాల మంజూరుపై సంతకాలు చేస్తారు. రుణాలు వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణం ప్రారంభిస్తాం’’ అని కమిషనర్‌ వెల్లడించారు.

* కెనడా పార్లమెంట్ (Canadian Parliament) వెలుపల భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య (MP Chandra Arya) హిందూ జెండా ఎగురవేశారు. నవంబర్‌లో ‘హిందూ హెరిటేజ్‌ మంత్‌’ను పురస్కరించుకొని దానిని రెపరెపలాడించారు. అధిక సంఖ్యలో హిందూకెనడియన్లు (Hindu Canadians) రాజకీయాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో మన ప్రాతినిధ్యం తగిన స్థాయిలో లేదని అన్నారు. ‘‘హిందూ హెరిటేజ్ మంత్‌ ప్రారంభానికి గుర్తుగా పార్లమెంట్ వెలుపల హిందూ పతాకాన్ని ఎగురవేశాం. 2022లో దీనిని ఎగురవేసినప్పుడు చెప్పిన విషయాన్నే మరోసారి ప్రస్తావిస్తున్నా. ఇక్కడ హిందువుల శకం ప్రారంభమైంది. ఈ దేశంలో విద్యావంతులైన, విజయవంతమైన కమ్యూనిటీల్లో మనది ఒకటి. ఇక్కడి సమాజం, ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నాం. మిగతా రంగాల్లో మన ప్రాతినిధ్యం మెరుగ్గానే ఉన్నా.. రాజకీయంగా మాత్రం అది ఆశించిన స్థాయిలో లేదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావాలని నా తోటి హిందువులకు మరోసారి పిలుపునిస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా ఆర్య పోస్టు పెట్టారు. కెనడాలో హిందూ వారసత్వ మాసాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు. దానిలో ఈ మతానికి సంబంధించిన సాంస్కృతిక, మేధోపరమైన, ఆధ్యాత్మిక వారసత్వం గురించి తెలుసుకుంటారు. స్మరించుకుంటూ ఉంటారు. 2022 నుంచి ఏటా ఆయన ఈ జెండాను ఎగురవేస్తున్నారు. కాషాయ రంగులో ఉన్న ఆ జెండాపై ఓం అని రాసి ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z