* మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్ 2021 (IT Rules 2021) ఉల్లంఘన, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులూ అందకపోయినప్పటికీ, ఐటీ నిబంధనలను అతిక్రమించినందున చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది.
* అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన మరో ప్రధాన వాటాను విక్రయించారు. అమెజాన్(Amazon)కు చెందిన రూ.25 వేల కోట్ల (3 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు ఆయన అమెజాన్‌లో మొత్తంగా 13 బిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లును విక్రయించారు. అంటే 16 మిలియన్లకు పైగా షేర్లను అమ్మారని కంపెనీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అమెజాన్ ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాల్లో మార్కెట్ అంచనాలకు మించి మెరుగైన వృద్ధిని కనబర్చింది. దీంతో కంపెనీ షేర్లు బాగా రాణించాయి. ఒక్కో షేరు విలువ 200 డాలర్లను తాకింది. అమెజాన్ షేర్లు గతేడాది కంటే 40శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. ఫలితంగా బెజోస్ సంపద పెరిగింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఎలాన్ మస్క్ ఉన్నారు.
* పండగ సీజన్‌లో ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల విక్రయాలు జోరందుకున్నాయి. దీపావళి సందర్భంగా ప్రకటించిన సేల్‌లో టెలివిజన్, స్మార్ట్‌ఫోన్లు సహా ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగిందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. యాపిల్ ఐప్యాడ్ విక్రయాలు 10 రెట్లు పెరగ్గా, శాంసంగ్ ట్యాబ్లెట్‌లలో ఐదు రెట్ల వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. పీటీఐతో మాట్లాడుతూ.. ప్రీమియం ఉత్పత్తులవైపు ప్రజలు మక్కువ చూపుతున్నారని శ్రీవాస్తవ తెలిపారు. టెలివిజన్లు, ఫ్యాషన్, గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లు, గృహోపకరణాలు.. ఇలా అన్నింటిల్లోనూ ప్రీమియం వాటినే ఎంచుకుంటున్నారన్నారు. ఈ విక్రయాలు కేవలం అగ్ర నగరాలకే పరిమితం కాలేదని పేర్కొన్నారు. మొత్తం విక్రయాల పెరుగుదలలో లార్జ్ స్క్రీన్ టీవీలే 30 శాతం ఉన్నాయని, వార్షిక ప్రాతిపదికన ఈ విభాగంలో 10 రెట్ల వృద్ధి నమోదైందని వెల్లడించారు.
* 2024 మూడో త్రైమాసికం(జులై-సెప్టెంబరు)లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ కంటే కాస్త పైన నిలవడంతో ఇది సాధ్యమైందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక చెబుతోంది. ఈ నివేదికలో ముఖ్యాంశాలు..జులై-సెప్టెంబరులో విలువ పరంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్‌కు అధిక వాటా దక్కింది. గెలాక్సీ ఎస్ సిరీస్‌తో పాటు తన స్మార్ట్ ఫోలియోను విస్తరించడంతో ఇది సాధ్యమైంది. గెలాక్సీ ఏఐ ఫీచర్లను మధ్య శ్రేణి, అందుబాటు ప్రీమియం మోడళ్లలోకి తీసుకురావడంతో అధిక ధర ఫోన్లకు వినియోగదార్లు అప్‌గ్రేడ్ కావడానికి ఇష్టపడ్డారు. శాంసంగ్ మార్కెట్ వాటా సెప్టెంబరు 2024 త్రైమాసికంలో 22.8 శాతానికి(విలువ పరంగా) చేరింది. 2023 సెప్టెంబరు త్రైమాసికంలో ఇది 21.8 శాతంతో పోలిస్తే పెంచుకోగలిగింది. ఇదే సమయంలో యాపిల్ వాటా 21.8 శాతం నుంచి 21.6 శాతానికి తగ్గింది. యాపిల్ చిన్న నగరాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. కొత్త ఐఫోన్లపై దృష్టి సారించింది. పండగ సీజనుకు ముందే ఐఫోన్ 15, 16 ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదార్లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తుండడం యాపిల్‌కు కలిసివచ్చిన అంశం. చైనా కంపెనీ వివో విక్రయ పరిమాణం పరంగా 19.4 శాతంతో అగ్రస్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే 15.5 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఇక పరిమాణం పరంగా 16.7 శాతంతో షియోమీ రెండో స్థానంలో, 15.8 శాతంతో శాంసంగ్ మూడో స్థానంలో ఉన్నాయి. ఒప్పో, రియల్‌మీ వాటా వరుసగా 13.4%, 11.3 శాతంగా ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్లు మొత్తం విక్రయాల్లో 81 శాతం వాటాను పొందాయి. రూ.10,001-15,000 విభాగంలో 93 శాతం వరకు 5జీ ఫోన్లు ఆక్రమించాయి. భారత చిప్‌సెట్ మార్కెట్ విభాగంలో మీడియాటెక్(54%) అగ్రస్థానంలో ఉంది.
* డిజిటల్ అరెస్టుల పేరుతో ఇటీవలి కాలంలో జరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు సూచించింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులమంటూ వీడియో కాల్ చేసి, ఖాతాలో మోసపూరిత లావాదేవీలు జరిగాయని, కాబట్టి, డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు పలువురిని మోసం చేస్తున్న నేపథ్యంలో బ్యాంకు పలు సూచనలు జారీ చేసింది. నిజమైన ప్రభుత్వ అధికారులు ఎవరూ ఖాతాదారుకు సంబంధించిన బ్యాంకు వివరాలను తెలియజేయాల్సిందిగా ఫోన్లలో కోరరు. చెల్లింపులు చేయాలనీ అడగరు. సైబర్ మోసగాళ్లు అత్యవసర పరిస్థితిని కల్పిస్తారు. ఆలోచించుకునే గడువూ ఇవ్వరు. ఇవన్నీ మోసపూరిత చర్యలే. ఎవరైనా సరే ఫోన్ లేదా వీడియో కాల్ చేసి మీ ఆధార్, పాన్‌లాంటి కేవైసీ వివరాలు అడిగినా, బ్యాంకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను చెప్పాలని ఒత్తిడి చేసినా స్పందించొద్దు. డెబిట్, క్రెడిట్ కార్డుల సంఖ్య, సీవీవీ, పిన్, ఓటీపీలాంటివి మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని మర్చిపోవద్దు. ప్రభుత్వ అధికారులమ చెప్పినప్పుడు వారి ధ్రువీకరణను అడిగే అధికారం మీకు ఉంటుందని గుర్తుంచుకోండి. మీకు వచ్చిన పత్రాలు, లింకులు, సందేశాల్లో వెబ్‌సైట్ల పేర్లలో అక్షర దోషాలు ఉంటాయి. వీటి ఆధారంగా మోసపూరిత సైట్లను ఇట్టే గుర్తుపట్టొచ్చు. మోసపూరిత ఫోన్ కాల్స్ విషయంలో భయపడకుండా, పోలీసులకు, సంచార్‌సాథీ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయాలి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z