* టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) వారసుడిగా నోయల్ టాటా (Noel Tata) నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ బోర్డు (Tata Sons Board)లోకి అధికారికంగా అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బోర్డు మంగళవారం అధికారికంగా వెల్లడించింది. టాటా సన్స్ బోర్డులోకి నోయల్ టాటా అధికారికంగా చేరినట్లు వెల్లడించింది.
* తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు.. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి చేశారు.. అందుకే తెలంగాణలో ఎక్కడ ఏ మూలకు వెళ్లినా ఎకరం రూ. 15 నుంచి 20 లక్షలకు తక్కువ లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మార్పు.. మార్పు అని కాంగ్రెస్ ప్రచారం చెప్పింది.. మరి ఈ మార్పు ఎలా ఉంది? టీఆర్ఎఫ్ మాదిరిగానే టీఆర్ఎస్ పెట్టే వరకు కూడా తెలంగాణ శక్తి ఎవరికీ తెలియలేదు అని కేటీఆర్ తెలిపారు. శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. భూమి కోసం తెలంగాణలో జరిగిన పోరాటాలు ఇక్కడి బిడ్డలందరికీ తెలుసు. ఎన్నో భూ ఉద్యమాలకు తెలంగాణ కేంద్రంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితం భూమి చుట్టూ తిరుగుతోంది. భూమి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కనుకే దాని కోసం ఎన్నో పంచాయితీలు జరుగుతాయి. టీఆర్ఎస్ పార్టీకి మొదట్లో రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతంలో పట్టు దొరకలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయని చాలా ప్రచారం చేశారు. తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పెరుగుతదంటే ఎవరు నమ్మలేదు. అసలు రాష్ట్రాన్ని నడిపే సమర్థత మీకు ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. హిందూ – ముస్లిం పంచాయితీ, నక్సలిజం, భూముల ధరలు పడిపోతాయంటూ ప్రచారాలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
* ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తాజాగా భారత్ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 (Royal Enfield Bear 650) మోటారు సైకిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ.3.39 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్ హై ఎండ్ బైక్ రూ.3.59 లక్షల (ఎక్స్ షోరూమ్) లకు లభిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మాదిరిగానే 650సీసీ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్నది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650లో వలే చేసిస్, ఇంజిన్ ఒక్కటే. సస్పెన్షన్, వీల్స్ మాత్రం డిఫరెంట్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 (Royal Enfield Bear 650) మోటారు సైకిల్ ఫ్రంట్‌లో 19-అంగుళాల స్పోక్డ్ వీల్, రేర్‌లో 17-అంగుళాల వీల్ ఉంటాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రాంబ్లర్‌లో మాదిరిగా 43 ఎంఎం షోవా యూఎస్డీ ఫోర్క్ విత్ 130 ఎంఎం ట్రావెల్ ఉంటుంది. రేర్‌లో 115 ఎంఎం న్యూ షాక్ అబ్జార్బర్స్, ఎంఆర్ఎఫ్ నైలోరెక్స్ టైర్స్ విత్ బ్లాక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ముందు 320 ఎంఎం డిస్క్, రేర్‌లో 270 ఎంఎం డిస్క్ అమర్చారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650లో మాదిరిగానే వైడ్ హ్యాండిల్ బార్, డ్యుయల్ చానెల్ బట్ స్విచ్చబుల్ ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, సర్క్యులర్ టీఎఫ్టీ డిస్ ప్లే, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్ కూడా ఉంటాయి.
* చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ షియోమీ ఇండియా (Xiaomi India) అధ్యక్షుడు బీ మురళీకృష్ణన్ వైదొలగనున్నారు. ఈ ఏడాది చివరికి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని షియోమీ ఇండియా మంగళవారం తెలిపింది. ఆరేండ్ల పై చిలుకు షియోమీ ఇండియాలో పని చేసిన మురళీకృష్ణన్ అకడమిక్ రీసెర్చ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మేనేజ్‌మెంట్‌లో డాక్టరేట్ పట్టా అందుకోవాలని మురళీకృష్ణన్ భావిస్తున్నారు. ‘టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌పై కన్జూమర్ బిహేవియర్’ అనే అంశంపై ఆయన అధ్యయనం కేంద్రం కానున్నది. అయితే షియోమీ ఇండియా అధ్యక్షుడిగా వైదొలిగినా కంపెనీకి ఇండిపెండెంట్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్‌గా మద్దతునిస్తారని షియోమీ ఇండియా తెలిపింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ లో స్మార్ట్ రికవరీ సాధించాయి. తద్వారా సోమవారం నష్టాల నుంచి కొంత బయట పడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 694 పాయింట్ల లబ్ధితో 79,476.63 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ కనిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్ 1100 పాయింట్లు పుంజుకున్నది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 218 పాయింట్లు పుంజుకుని 24,200 మార్కును దాటేసి 24,213 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ-30లో సగానికంటే తక్కువ స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 1.39 శాతం, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోయాయి. మరోవైపు జేఎస్ డబ్ల్యూ స్టీల్ 1.62 శాతం, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ పుంజుకున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z