Business

ఐటీ స్టాకుల దూకుడు-BusinessNews-Nov 06 2024

ఐటీ స్టాకుల దూకుడు-BusinessNews-Nov 06 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం దాదాపు ఖరారైన వేళ.. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ రాణించాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 24,500 కాస్త దూరంలో నిలిచింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు పెరిగి రూ.452 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్‌ పైచేయి సాధించడంతో ముఖ్యంగా ఐటీ షేర్లలో ఇవాళ కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 4 శాతం మేర లాభపడింది. సూచీలోని 10 స్టాక్స్‌ లాభాల్లో ముగియడం గమనార్హం. ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్న వేళ డాలరు ఇండెక్స్‌ బలపడడం ఐటీ స్టాక్స్‌కు పాజిటివ్‌గా మారింది. ఆయా కంపెనీలకు అమెరికా కరెన్సీలోనే ఆదాయం వస్తుండడం ఇందుక్కారణమని అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్‌ వస్తే చైనాపై సుంకాల మోత మోగుతుందన్న కారణంతో హాంకాంగ్‌, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

* స్కోడా, Kylaq కాంపాక్ట్‌ ఎస్‌యూవీని ఈ రోజు భారత్‌లో లాంచ్‌ చేసింది, దీని ప్రారంభ ధర రూ.7.89 లక్షలు. బుకింగ్‌లు డిసెంబర్‌ 2న ప్రారంభమవుతాయి. డెలివరీలు 2024, జనవరి 27 నుంచి మొదలవుతాయి. స్కోడా కైలాక్‌ను భారత మార్కెట్‌లో కీలక ప్లేయర్‌గా మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కైలాక్‌.. మార్కెట్లో హ్యుందాయ్‌ వెన్యూ, టాటా నెక్సాన్‌, మారుతీ బ్రెజా, మహీంద్రా 3XO వంటి కార్లతో పోటి పడనుంది. కైలాక్‌ లోపల భాగంలో యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకు సపోర్ట్‌గా 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌ అమర్చి ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, వెనుక ఏసీ వెంట్‌లు, సింగిల్‌ పేన్‌ సన్‌రూఫ్‌ కూడా ఉన్నాయి. ఇతర సౌకర్యవంతమైన ఫీచర్లలో..కీలెస్‌ ఎంట్రీ, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు ఉన్నాయి. భద్రతాపరంగా కైలాక్‌ అన్ని వేరియంట్లలో సమగ్రమైన ఫీచర్లతో వస్తుంది. వీటిలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ప్రయాణీకులందరికీ 3-పాయింట్‌ సీట్‌ బెల్ట్‌లు ఉన్నాయి. కైలాక్‌ 1.0-లీటర్‌, 3-సిలిండర్‌ టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది.

* యూజర్ల భద్రతను దృష్టిలోఉంచుకొని వారికి మెరుగైన ఫీచర్లు అందించడంలో భాగంగా ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు పలు సదుపాయాల్ని తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్‌ తాజాగా ఇమేజ్‌ల మూలాలను గుర్తించే పనిలో పడింది. దీనికోసం రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వాట్సప్‌లోని చిత్రాల కోసం మెసేజింగ్‌ యాప్‌ ‘‘Search on web’’ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్‌ గురించి సెర్చ్‌ చేయొచ్చు. ప్లాట్‌ఫామ్‌లో నేరుగా ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది కాబట్టి.. ఇతర యాప్‌ లేదా బ్రౌజర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సప్‌ ద్వారా షేర్‌ చేసే కంటెంట్‌కు పారదర్శకతను మెరుగుపరచడమే ఈ ఫీచర్‌ లక్ష్యం.

* సోలార్‌ ప్యానెళ్ల తయారీ సంస్థ వారీ ఎనర్జీస్‌ (Waaree Energies) షేర్లు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. గత వారం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన షేర్లు ఈరోజు ట్రేడింగ్‌ సెషన్‌లో దూసుకెళ్తున్నాయి. దలాల్‌ స్ట్రీట్‌లో లిస్ట్‌ అయిన వారంలోనే 49శాతం షేర్లు రాణించాయి. దీంతో లక్ష కోట్ల కంపెనీగా వారీ ఎనర్జీస్‌ అవతరించింది. వారీ ఎనర్జీస్‌ పబ్లిక్‌ ఇష్యూ (IPO) అక్టోబర్‌ 28న దాదాపు 70శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. కంపెనీ ఇష్యూ ధర రూ.1503 కాగా.. బీఎస్‌ఈలో 69.66 శాతం ప్రీమియంతో రూ.2,550 వద్ద నమోదైంది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ 66.33 శాతం లాభంతో రూ.2500 వద్ద నమోదైంది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ 67,866 కోట్లకు చేరింది. మార్కెట్‌ లిస్టింగ్‌ తర్వాత నుంచి ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో కంపెనీ షేర్లు వరుసగా పుంజుకుంది. దీంతో ఇప్పటివరకు వారీ ఎనర్జీస్‌ షేర్లు 49.72శాతం లాభపడ్డాయి. ఈ రోజు మొత్తం 7.53 లక్షల షేర్లు చేతులు మారాయి. దీని విలువ రూ.271.59 కోట్లు. బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,03,779.62 కోట్లకు చేరింది.

* దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల సంఖ్య మరింత తగ్గిపోనున్నది. నాల్గో విడుత విలీన ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే ప్రస్తుతం 43గా ఉన్న ఆర్‌ఆర్‌బీలను 28కి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయా రాష్ర్టాల్లో నడుస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 15 బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేయబోతున్నారు. కాగా, ఆర్‌ఆర్‌బీల కార్యకలాపాలను మరింత ప్రభావవంతంగా మార్చడం, ఖర్చుల హేతుబద్ధీకరణే లక్ష్యంగా ఈ విలీనాలకు దిగుతున్నట్టు మోదీ సర్కారు చెప్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ఠంగా 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నడుస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో మూడేసి ఆర్‌ఆర్‌బీలు పనిచేస్తున్నాయి. ఇక బీహార్‌, గుజరాత్‌, జమ్ముకశ్మీర్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్‌ రాష్టాల్లో రెండేసి చొప్పున ఉన్నాయి. దీంతో ఈ రాష్ర్టాల్లోని 26 బ్యాంకుల్లో 15 బ్యాంకుల్ని విలీనం చేయాలని నాబార్డుతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. అయితే తెలంగాణలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ), తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మధ్య ఏపీజీవీబీ ఆస్తులు, అప్పుల విభజనకు లోబడి ఈ ఆర్‌ఆర్‌బీల విలీన ప్రక్రియ సాగనున్నది. కాగా, ఈ నెల 20కల్లా ఈ విలీన ప్రక్రియపై అభిప్రాయాలను తెలియపర్చాలంటూ ఆయా ఆర్‌ఆర్‌బీలకు స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్న బ్యాంక్‌ అధిపతులకు కేంద్ర ఆర్థిక సేవల శాఖ స్పష్టం చేసింది.

* రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,341.5 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,480 కోట్లతో పోలిస్తే 9.35 శాతం తగ్గింది. లాభంలో నిరాశే ఎదురైన సంస్థకు ఆదాయంలో కాస్త ఊరట లభించింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17 శాతం ఎగబాకి రూ.6,880 కోట్ల నుంచి రూ.8,016 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా కంపెనీ కో-ఛైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ..ఉత్తర అమెరికా మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో కోత పడిందని, అయినప్పటికీ అన్ని విభాగాలు ఆశాజనక పనితీరు కనబరిచాయన్నారు. మరోవైపు, నికోటైనెల్‌, ఇతర బ్రాండ్‌ల విలీనం పూర్తి కానున్నదన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z