Kids

PM Internship Schemeకు దరఖాస్తుల గడువు ముగుస్తోంది-NewsRoundup-Nov 07 2024

PM Internship Schemeకు దరఖాస్తుల గడువు ముగుస్తోంది-NewsRoundup-Nov 07 2024

* ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను పవన్‌ కల్యాణ్‌కు అనిత వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత తెలిపారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమని నేతలు చర్చించుకున్నారు. తానూ ఫేక్ పోస్టు బాధితురాలినంటూ అంటూ అనిత పవన్ కల్యాణ్‌తో అన్నారు. తన కూతురు కన్నీరు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ వెల్లడించారు.

* తెరపైనే కాదు తెర వెనుక ఏ ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే చోట కనిపించినా సినీ ప్రియులకు అమితానందం. అలాంటిది ముగ్గురు అగ్ర కథానాయకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే నెట్టింట సందడే సందడి. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. అదే.. చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), మహేశ్‌బాబు (Mahesh Babu) తదితరులు కలిసి దిగిన ఫొటో. అందులో వారంతా డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చొని కనిపించారు. ఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకలో వారంతా మీట్‌ అయినట్టు సమాచారం. మాల్దీవులు అందుకు వేదికగా నిలిచిందని తెలిసింది.

* గత ఐదేళ్ల విధ్వంస పాలనలో జగన్‌ (YS jagan) రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఏపీ హోంశాఖ మంత్రి అనిత (Vangalapudi Anitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పరువు తీసే విధంగా పాలన సాగించారని మండిపడ్డారు. రాజకీయ ముసుగులో వైకాపా నేతలు అనేక దారుణాలు చేశారన్నారు. ఈ 5 నెలల కాలంలో ఏవేవో జరిగిపోయాయంటూ జగన్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం గురించి జగన్‌ మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారనే దానిపై జగన్‌ మాట్లాడాలని అనిత డిమాండ్ చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అనిత.. గత వైకాపా పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

* యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ (PM Internship Scheme)కు దరఖాస్తుల గడువు ముగుస్తోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 12న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ నవంబర్‌ 10తో ముగియనుంది. ఈ లోగా అభ్యర్థులు తమ పేర్లను పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకొని, దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాబోయే ఐదేళ్లలో టాప్‌ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే ఈ కార్యక్రమానికి రూ.800 కోట్లు ఖర్చుతో డిసెంబర్‌ నుంచి ఇంటర్న్‌షిప్‌ మొదలుపెట్టనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5,000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు. కంపెనీలో చేరే ముందు ఇచ్చే రూ.6,000 (వన్‌టైం గ్రాంట్‌) కూడా ఉంటుంది. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 పొందుతారు. ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా వాస్తవ ఉద్యోగ వాతావరణంలో అభ్యర్థులు గడపాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఏదైనా కంపెనీ/బ్యాంకు/ఆర్థిక సంస్థలు సదరు మంత్రిత్వ శాఖ ఆమోదంతో చేరొచ్చు.

* ‘‘ రాష్ట్రానికి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు నాపై కేసు పెడతారా?’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా.. కాంగ్రెస్‌ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ఫార్ములా-ఈ కారు రేస్‌ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతమైన నేపథ్యంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు.

* ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు యాదాద్రి చేరుకొని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం సంగెం నుంచి సీఎం మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు 2.5కి.మీ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.

* భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టెస్టుల్లో పునరాగమనం చేస్తాడని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో తన రీ ఎంట్రీపై సూర్యకుమార్ స్పందించాడు. ఈ విషయంలో తాను తొందరపడటం లేదని, దానికి అవసరమైన సమయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం సూర్య సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. నవంబర్ 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానున్న సందర్భంగా సూర్యకుమార్ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ 0-3తో కోల్పోవడంతో రోహిత్ శర్మపై ఒత్తిడి ఉంటుందా అని సూర్యకుమార్‌ను ప్రశ్నించగా అతడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ‘‘క్రీడల్లో గెలుపు ఓటములు సహజం. గెలవడం కోసం అందరూ కష్టపడతారు. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్ని సార్లు ఓడతాం. జీవితంలో సమతుల్యత అనేది ముఖ్యమైంది. ఈ విషయంలో నేను రోహిత్ భాయ్‌ నుంచి ఎంతో నేర్చుకున్నాను. విజయాలు సాధించినా, అపజయాలు ఎదురైనా అతని క్యారెక్టర్‌లో మార్పును ఎన్నడూ చూడలేదు. అతను ఒక ఆటగాడిగా, నాయకుడిగా ఎదగడం నేను చూశాను’’ అని సూర్య పేర్కొన్నాడు.

* కెనడా (Canada) మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఆస్ట్రేలియాలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) సమావేశాన్ని ప్రసారం చేసిన అక్కడి ఓ మీడియా సంస్థపై నిషేధం విధించింది. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైశంకర్.. ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కెనడాలో ఆలయంపై దాడి ఘటనపై జైశంకర్‌ మాట్లాడుతూ.. ట్రూడో సర్కార్‌ తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సమావేశాన్ని ఆస్ట్రేలియా టుడే (Australia Today) ప్రసారం చేసింది. ఈ క్రమంలోనే కెనడా చర్యలు చేపట్టింది. ‘‘ఆస్ట్రేలియా మీడియాపై కెనడా చర్యలు ఆశ్చర్యం కలిగించాయి. గంటల వ్యవధిలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆ దేశానికి ఉన్న కపటనీతిని ఇది ఎత్తిచూపుతోంది. కెనడా గురించి ఎస్ జైశంకర్‌ మూడు ప్రధాన విషయాలు మాట్లాడారు. వాస్తవాలను జీర్ణించుకోలేని ఆ దేశం ఇలాంటి చర్యలకు ఉపక్రమించింది’’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు.

* త్వరలో ఆటమ్‌బాంబు పేలుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తప్పు చేసిన వాళ్లకు నాటుబాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటమ్‌బాంబు పేలబోతోంది. జనం సొమ్మును అక్రమమార్గంలో విదేశాలకు పంపారు. ఎంత పెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదు. రూ.55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేలుస్తాం. తప్పు చేయనివాళ్లు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

* ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితుల మధ్య రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?. ప్రశ్నించే స్వరం ఉండకూడదని.. అణగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయి. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారు… మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఆర్‌బీకేలను నిర్వీర్యం చేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను గాలికి వదిలేశారు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిలయ్యింది… రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ దారుణంగా ఉంది. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఐదు నెలల్లో మహిళలు, పిల్లలపై.. 91 ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఏడుగురు బాధితులు చనిపోయారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేస్తున్నారు… ప్రభుత్వం స్పందించి నేరాల్ని అరికట్టకుండా.. ప్రొత్సహిస్తోంది. తెనాలిలో ఓ అమ్మాయిపై దాడి చేసి చంపారు. నిందితుడు.. టీడీపీకి చెందిన వ్యక్తే. బద్వేల్‌ ఘటన.. అత్యంత దారుణం. పెట్రోల్‌ పోసి బాలికను చంపారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఘటన జరిగింది. అత్తాకోడలపై అత్యాచారం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురంలో ఓ ఘటన జరిగింది. ప్రతీచోటా ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి అని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

* సోషల్‌ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్‌ వేధింపులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని.. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తే లీగల్‌ టీమ్‌కు దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఎలాంటి అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని.. 9440284455, 9963425526, 9912205535 ఈ నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని కార్యకర్తలకు వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z