NRI-NRT

MGMNT సందర్శించిన యార్లగడ్డ వెంకటరావు

MGMNT సందర్శించిన యార్లగడ్డ వెంకటరావు

అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాం డాలస్(ఇర్వింగ్ నగరం)లో ఉంది. దీన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సందర్శించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తగా నా ప్రస్థానం డాలస్ నగరంలో కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. ఈ పరిసర ప్రాంతాలు, ప్రజలు అందరూ సుపరిచతమే. కేవలం భారతదేశంలోనే గాక ప్రపంచ ప్రజల మన్ననలను పొందిన ఏకైక నాయకుడైన మహాత్మాగాంధీ విగ్రహం ఇక్కడ నెలకొల్పడం ముదావహం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సంస్థలకు నాయకత్వం వహిస్తున్న ప్రవాస భారతీయ నాయకులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర స్థానిక అధికారులను ఒప్పించడంలో చూపిన చొరవ, నాలుగున్నర సంవత్సరాల అవిరళ కృషితో మహాత్మాగాంధీ స్మారకస్థలి నిర్మాణం సాధ్యమైంది. డాక్టర్‌ ప్రసాద్ తోటకూర, మహత్మాగాంధీ విగ్రహ శిల్పి బుర్రా శివ వరప్రసాద్ ఇద్దరూ కూడా గన్నవరం నియోజకవర్గానికి చెందినవారు కావడం నాకు మరింత గర్వంగా ఉంది’ అని అన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. మిత్రుడు యార్లగడ్డ వెంకట్రావు నా జన్మస్థలం, విద్యాబుద్ధులు నేర్చుకున్న గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా డాలస్‌కు ఆహ్వానించడం ఆనందంగా ఉంది. యార్లగడ్డ విజయవంతమైన వ్యాపారవేత్తగా డాలస్‌లో స్థిరపడినా, మాతృదేశంపై ప్రేమతో ఏపీ రాజకీయాలలో ప్రవేశించారు. ప్రస్తుతం గన్నవరం శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవలందిస్తున్న యార్లగడ్డ వెంకట్రావుని అభినందించారు. మహాత్మాగాంధీ స్మారకస్థలి కార్యదర్శి రావు కల్వాల బాపూజీకి పుష్పాంజలి ఘటించడానికి విచ్చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహాత్మాగాంధీ మెమోరియల్‌ గవర్నింగ్ బోర్డు సభ్యులు రాంకీ చేబ్రోలు, వ్యాపారవేత్త సురేష్ గొట్టిపాటితో పాటు పలువురు ప్రవాసాంధ్రాలు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z