Business

భద్రత ప్రమాణాల్లో మారుతీ సుజుకి అరుదైన ఘనత-BusinessNews-Nov 08 2024

భద్రత ప్రమాణాల్లో మారుతీ సుజుకి అరుదైన ఘనత-BusinessNews-Nov 08 2024

* ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీకి చెందిన ఫోర్త్‌ జనరేషన్‌ డిజైర్‌ (Maruti Dzire) అరుదైన ఘనత సాధించింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్టులో ఈ కాంపాక్ట్‌ సెడాన్‌ 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. పెద్దల భద్రత విషయంలో 5 స్టార్‌ రేటింగ్‌, చిన్నారుల భద్రతకు సంబందించి 4 స్టార్‌ పొందింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే కావడం విశేషం. సేఫ్టీ రేటింగ్‌ విషయంలో మారుతీ సుజుకీపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. డిజైర్‌ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ అందుకోవడం గమనార్హం. స్వచ్ఛందంగా మారుతీ ఈ వెహికల్‌ను క్రాష్‌ టెస్ట్‌కు పంపింది. పెద్దల భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు గాను 31.24 పాయింట్లను కొత్త డిజైర్‌ సాధించింది. చిన్నారుల భద్రతకు సంబంధించి 42 పాయింట్లకు గాను 39 పాయింట్లు పొందింది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, అన్ని సీట్లకు 3 పాయింట్‌ సీట్‌ బెల్ట్‌ విత్‌ రిమైండర్‌ ఉన్నాయి.

* ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ (Tata Motors) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (Q2 Results) ఏకీకృత ప్రాతిపదికన రూ.3,450 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,832 కోట్ల నికర లాభంతో పోలిస్తే 9.9 శాతం క్షీణత నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో టాటా మోటార్స్‌ ఆదాయం రూ.1,00,534 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.1,04,444 కోట్లుగా నమోదైంది. మొత్తం ఖర్చులు రూ.97,330 కోట్లుగా ఉందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేర్‌ ఎన్‌ఎస్‌ఈలో 1.98 శాతం క్షీణించి రూ.803 వద్ద స్థిరపడింది.

* ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిన రూ.7621 కోట్ల నికర లాభాన్ని (LIC Q2 results) ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.7,925 కోట్లతో పోలిస్తే లాభం 4 శాతం మేర క్షీణించింది. తొలి ప్రీమియం వసూళ్లు పెరిగినా.. ఇతర ఆదాయం తగ్గడంతో లాభం తగ్గుముఖం పట్టింది. సమీక్షా త్రైమాసికంలో ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం 11 శాతం పెరిగి రూ.1.19 లక్షల కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.1.07 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.2.01 లక్షల కోట్ల నుంచి రూ.2.29 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం ఖర్చులు రూ.1.94 లక్షల కోట్ల నుంచి రూ.2.22 లక్షల కోట్లకు చేరాయి. ఇతర ఆదాయాలు గతేడాది రూ.248 కోట్లుగా ఉండగా.. సమీక్షా త్రైమాసికంలో రూ.145 కోట్లకు తగ్గినట్లు ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

* ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI Q2 Results) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.19,782 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.16,099 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. స్టాండలోన్‌ పద్ధతిన నికర లాభం రూ.14,330 కోట్ల నుంచి రూ.18,331 కోట్లకు పెరిగినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. క్రితం త్రైమాసికంలో ఈ మొత్తం రూ.17,035 కోట్లుగా ఉంది.

* ప్రముఖ టైర్ల తయారీ సంస్థ MRF త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (MRF Q2 Results) ఏకీకృత ప్రాతిపదికన రూ.470.70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.586.60 కోట్ల లాభంతో పోలిస్తే 19 శాతం క్షీణత నమోదైంది. ఇక కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం రూ.6,881.09 కోట్లుగా ఉంది. గతేడాది నమోదైన ఆదాయం రూ.6,217.10 కోట్లతో పోలిస్తే 10 శాతం పెరిగిందని పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో MRF నికర లాభం 20 శాతం క్షీణించింది. రూ.571.93 కోట్ల నుంచి రూ.455.43 కోట్లకు తగ్గినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. స్టాండలోన్‌ పద్ధతిలో ఆదాయం 11.1శాతం పెరిగి రూ.6,087.56 కోట్ల నుంచి రూ.6,760.37 కోట్లకు చేరింది. అదే సమయంలో కంపెనీ మార్జిన్లు కూడా 14.4 శాతం తగ్గాయని పేర్కొంది. మొత్తం ఖర్చులు 16 శాతం పెరిగి రూ.5,497 కోట్ల నుంచి రూ.6,363 కోట్లకు చేరాయని తెలిపింది.

* Stock Market closing Bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. రిలయన్స్‌, ఐసీఐసీఐ, వంటి షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. దీనికితోడు విదేశీ సంస్థాగత మదుపర్లు క్రమంగా తమ నిధులను మార్కెట్‌ నుంచి బయటకు తీసుకెళ్లడం సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌ ఉదయం 79,611.90 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,541.79) స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఒడుదొడుకుల్లో కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 79,117.37 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 55.47 పాయింట్ల నష్టంతో 79,486.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 51.15 పాయింట్లు నష్టపోయి 24,148 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.37గా ఉంది.

* అమెరికా ఎన్నికల ఫలితాలపై టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ ఖుషీగా ఉండగా.. అతడి కుమార్తె వివియన్‌ జెన్నా విల్సన్‌ మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. తనకు అమెరికాలో భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాథ్యమం థ్రెడ్స్‌లో ఓ పోస్టును పెట్టింది. ‘‘నేను కొన్నాళ్లుగా భయపడుతున్నది.. నిన్న వాస్తవరూపం ధరించింది. అమెరికాలో ఉంటే నాకు ఎటువంటి భవిష్యత్తు కనిపించడం లేదు. అతడు (ట్రంప్‌) నాలుగేళ్లే అధ్యక్షుడిగా ఉండనున్నా.. లింగమార్పిడి వ్యతిరేక నిబంధనలు ఒక్కసారిగా అమల్లోకి రాకపోయినా.. వాటిని కావాలని ఓటేసినవారు అంత తొందరగా మారరుగా..’’ అని ఆవేదన పూరితమైన పోస్టు చేసింది. ఆమె అమెరికాను వీడుతుందన్న పోస్టు గురించి తెలుసుకొన్న మస్క్‌ కూడా ఎక్స్‌లో స్పందించారు. ‘నా కుమారుడిని ఓక్‌ మైండ్‌సెట్‌ చంపేసింది’ అని మరోసారి పునరుద్ఘాటించారు. దీనిపై జెన్నా స్పందిస్తూ.. తన తండ్రి ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను థ్రెడ్‌లో పోస్టు చేసింది. ‘‘ఇంకా నా బిడ్డకు ఏదో సోకింది.. నన్ను నా బిడ్డ ద్వేషించడానికి అదే కారణం అంటూ మళ్లీ పాత కథలే చెప్పొద్దు. వాటిని పట్టించుకోవద్దు. ఏరకంగా చూసినా నేనే బాధితురాలిని’’ అని రాసుకొచ్చింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z