ScienceAndTech

విజయవాడ శ్రీశైలం మధ్య నౌకా విహంగం-NewsRoundup-Nov 08 2024

విజయవాడ శ్రీశైలం మధ్య నౌకా విహంగం-NewsRoundup-Nov 08 2024

* కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన చిత్రం ‘క’ (KA Movie). తాజాగా ఈ సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న నిర్మాత దిల్‌రాజు (Dil Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో ఎవరూ ఎవరికీ సాయం చేయరన్నారు. మనల్ని మనమే నిరూపించుకోవాలని చెప్పారు.

* పశ్చిమ దేశాల ఆంక్షల వేళ రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి (Hardeep Singh Puri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు (Russian Oil) చేయడం వల్ల తాము ప్రపంచానికి మేలు చేశామని చెప్పారు. అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధర మరింత పెరిగేదన్నారు.

* అసెంబ్లీకి వెళ్లనివారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. జగన్‌ (YS Jagan) అయినా, వైకాపా (YSRCP) ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ (Ap Assembly) సమావేశాలకు హాజరుకావడం లేదని వైకాపా అధినేత జగన్‌ ప్రకటించడంపై షర్మిల తీవ్రంగా స్పందించారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడగలం అని జగన్‌ మాట్లాడిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. ఈ విషయంలో జగన్‌ తీరును షర్మిల తీవ్రంగా పరిగణించారు.

* విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు సీ ప్లేన్‌ చేరుకుంది. ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్‌ నిర్వహించారు. ఈ నెల 9న పున్నమిఘాట్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్‌’ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రయల్ రన్‌ శుక్రవారం విజయవంతమైంది.

* డ్రగ్స్ కేసులో ఉగాండాకు చెందిన మహిళకు రంగారెడ్డి జిల్లా కోర్టు 13 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2021లో ఉగాండా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చిన మహిళను డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. మహిళ నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ దాదాపు రూ. 25.35 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. సుదీర్ఘ వాదనల అనంతరం నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 13 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.

* పదో తరగతి (10th Exams) పరీక్ష రుసుం చెల్లింపు తేదీలను తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు వెల్లడించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించుకునేందుకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 2 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 12 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకోవచ్చని సంచాలకులు ప్రకటనలో పేర్కొన్నారు.

* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Polls) వేళ కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని యావత్‌ దేశం పూర్తిగా తిరస్కరించిందని.. అందుకు ఆ పార్టీ చర్యలే కారణమన్నారు. ఆ పార్టీ ఇప్పుడు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కాదన్న మోదీ.. పరాన్నజీవి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ఊత కర్రల సాయంతోనే మనుగడ సాగిస్తోందని విమర్శించారు. శుక్రవారం నాసిక్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు.

* దొంగలించిన 251 ద్విచక్రవాహనాలను ఏలూరు పోలీసులు (Eluru) స్వాధీనం చేసుకుని, 25 మంది అనుమానితులను అరెస్టు చేయటం సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కొనియడారు. ఈ కేసులను ఛేదించి బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం హర్షనీయమన్నారు.

* ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి (Yadadri) బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్‌ బోర్డు (Yadagirigutta Temple Board) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

* అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) తప్పుకోవడంపై వైట్‌హౌస్(White House) అధికారులు పలు విషయాలు తెలియజేశారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగి, ఆ బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌(Kamala Harris)కు అప్పగించడం సరైన నిర్ణయమేనని అప్పుడు బైడెన్‌ భావించినట్లు వైట్‌హౌస్‌ సిబ్బంది పేర్కొన్నారు.

* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్‌- రష్యా (Russia- India)ల మధ్య సంబంధాలు అన్నివిధాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈమేరకు సోచిలోని వాల్డాయ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు అక్కడి అధికారిక వార్తాసంస్థలు వెల్లడించాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z