Business

యాప్‌లు వ్యసనంగా మారితే వస్తువులు ఖరీదవుతాయి-BusinessNews-Nov 09 2024

యాప్‌లు వ్యసనంగా మారితే వస్తువులు ఖరీదవుతాయి-BusinessNews-Nov 09 2024

* విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా తమ పెట్టుబడులను దేశీయ మార్కెట్ల (Stock market) నుంచి వెనక్కితీసుకుంటున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్టోబర్‌ ప్రారంభం నుంచి పెద్ద ఎత్తున విక్రయాలకు దిగిన ఎఫ్‌ఐఐలు చైనా తీసుకున్న ఉద్దీపన చర్యల కారణంగా తమ అమ్మకాలను కొనసాగించారు. దీనికి తోడు కార్పొరేట్‌ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో క్రమంగా తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. అక్టోబర్‌ నుంచి విక్రయాలకు దిగిన ఎఫ్‌ఐఐలు ఈ నెలలోనే అదే బాటలో పయనిస్తున్నారు. గత నెలలో రూ.94,017 కోట్లను మార్కెట్‌ నుంచి బయటకు తీసుకెళ్లిన ఎఫ్‌ఐఐలు.. నవంబర్‌ మొదటి వారమంతా విక్రయాలే చేశారు. మొదటి ఆరు ట్రేడింగ్ సెషన్‌లో ఏకంగా రూ.23,398 కోట్లను ఉపసంహరించుకున్నారు. కేవలం శుక్రవారం ఒక్క రోజే రూ.3,404 కోట్లను మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నారు.

* టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద 300 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. గతవారం టెస్లా షేర్లు 30 శాతానికి పైగా పుంజుకోవడంతో ఎలన్ మస్క్ సంపద 304 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో 300 బిలియన్ డాలర్లకు పైగా సంపద గల తొలి కుబేరుడిగా మస్క్ నిలిచారని ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేయడం ఎలన్ మస్క్‌కు కలిసివచ్చింది. శుక్రవారం ఒక్కరోజే టెస్లా షేర్ 8.19 శాతం పెరిగి 321.22 బిలియన్ డాలర్లకు, ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 4.71 శాతానికి పెరిగింది.

* వరుసగా ఐదో వారం భారత్ ఫారెక్స్ రిజర్వు (Forex Reserve) నిల్వలు పతనం అయ్యాయి. నవంబర్ ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.7 బిలియన్ డాలర్లు తగ్గి 682.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.84.38లకు పడిపోయింది. ఫలితంగా రూపాయి మరింత బలహీన పడకుండా ఆర్బీఐ అడ్డుకున్నది. అంతకుముందు అక్టోబర్ 25తో ముగిసిన వారానికి కూడా ఫారెక్స్ నిల్వలు 3.4 బిలియన్ డాలర్లు పతనమై 634.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

* బెంగళూరు నగరానికి చెందిన ఒక కొబ్బరి బొండాల వ్యాపారి.. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి వాటికి సవాలు విసిరారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వ్యాపారి విసిరినా సవాల్ ఏమిటి? దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో.. కొబ్బరి బోండాం రేటు జెప్టోలో రూ. 80, బ్లింకిట్‌లో రూ. 80, బిగ్‌బాస్కెట్‌లో రూ. 70 ఉంది. కానీ వ్యాపారి కేవలం రూ. 55కే కొబ్బరి బోండాం అంటూ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన చాలామందిలో చర్చ మొదలైంది. యాప్‌లు వ్యసనంగా మారితే వస్తువులు ఖరీదైనవిగా మారతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.

* నిత్యావసర ధరలు సామాన్య ప్రజల మీద అధిక ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలో.. ఉల్లి రేట్లు పెరిగి ఒక్కసారిగా షాకిచ్చాయి. ఢిల్లీ, ముంబైలలో రూ. 40 నుంచి రూ. 60 మధ్య ఉన్న కేజీ ఉల్లి ధర.. రూ. 70 నుంచి రూ. 80కి పెరిగింది. వెల్లుల్లి ధరలు.. ఉల్లి ధరలకు రెట్టింపు ఉన్నాయి. ధరల పెరుగుదల కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనిపైన వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రకారం ఉల్లి ధరలు తగ్గాల్సి ఉంది, కానీ ధరలు పెరిగాయని కొందరు వాపోతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z