ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్(APTSL) అధ్యక్షుడిగా న్యూజెర్సీకి చెందిన ప్రవాసాంధ్రుడు, గుంటూరు జిల్లా తెదేపా నేత, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ నియమితులయ్యారు. నేడు తెదేపా విడుదల చేసిన నామినేటడ్ పదవుల జాబితాలో ఆయన పేరును ప్రకటించారు. ఆయన నియామకం పట్ల ప్రవాసాంధ్రులు, ఎన్నారై తెదేపా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
తనను ఈ పదవిలో నియమించిన చంద్రబాబుకు, తెదేపాకు మన్నవ ధన్యవాదాలు తెలిపారు. AI ప్రభంజనంలో టెక్నాలజీ అనే పదానికి నిర్వచనం మారిందని, తన హయాంలో APTSL బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
గత దశాబ్ద కాలంగా గుంటురు జిల్లా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న మన్నవ అమెరికాలో కన్నా ఆంధ్రాలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేశారు. గుంటూరు వెస్ట్ శాసనసభ్యుడి టికెట్ ఆశించినప్పటికీ చంద్రబాబు హామీ మేరకు ఆయన వెనక్కు తగ్గి కూటమి అభ్యర్థి విజయానికి తనవంతుగా తోడ్పడ్డారు.
న్యూజెర్సీలో హోటళ్లు, ఐటీ సంస్థల నిర్వాహకుడిగా మోహనకృష్ణకు మంచి పేరు ఉంది. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా ఆయన సుపరిచితులు. అమెరికాలో జాతీయ స్థాయి తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) మాజీ అధ్యక్షుడిగా సేవలందించిన మన్నవ నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిగా పేరుపొందారు. తెదేపాలోని అన్నివర్గాల నాయకులతో సత్సంబంధాలు కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z