Editorials

రేపు CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం-NewsRoundup-Nov 10 2024

రేపు CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం-NewsRoundup-Nov 10 2024

* సిరిసిల్లలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న బైరి అమర్‌ దంపతుల కుటుంబసభ్యులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. ఆదివారం సాయంత్రం సిరిసిల్లకు చేరుకున్న కేటీఆర్‌.. వెంకంపేటలోని భైరి అమర్‌- స్రవంతి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున డిపాజిట్‌ చేయిస్తానని తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly ) ఈనెల 11న ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను (Annual Budget) ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో సమావేశాల తొలిరోజే సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలను ఈనెల 22 వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

* సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేస్తారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగుస్తున్నది. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు సీజేఐగా ఎంపికైన జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. 2025 మే రెండో వారం వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా వ్యవహరిస్తారు. ఖన్నా కుటుంబ సభ్యుల నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సంజీవ్ ఖన్నా మూడో వ్యక్తి. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పని చేసిన దేవీరాజ్ ఖన్నా కొడుకే సంజీవ్ ఖన్నా. సుప్రీంకోర్టు జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు సమీప బంధువు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పలు చారిత్రక తీర్పులు ఇచ్చిన వారిలో ఒకరు. ఈవీఎంల పవిత్రతతోపాటు ఎన్నికల బాండ్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ వంటి కేసుల్లో తీర్పులు ఇచ్చారు.

* రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వరి పంటకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్‌ ఇచ్చి ధాన్యం కొంటున్నట్లు మహారాష్ట్రలో సీఎం రేవంత్‌ రెడ్డి గప్పాలు కొట్టారని విమర్శించారు. ధాన్యం సకాలంలో కొనడం, మద్దతు ధరకు 500 బోనస్ ఇవ్వడం అంటే.. మభ్య పెట్టి, అబద్ధాలు చెప్పి, తిమ్మిని బమ్మిని చేసి అధికారంలోకి రావడం కాదు రేవంత్ రెడ్డి అని సూచించారు. రైతులు రోడ్డు ఎక్కకుండా ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధర పై 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

* తిరుపతి (Tirupati ) కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారి చండీయాగం (Chandi Yagam ) ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసం సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న విశేషపూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం యాగశాలలో పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టారు. గృహస్తులు రూ.500 టికెట్‌తో ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చని అధికారులు వివరించారు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

* ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్‌ మీడియాపై (Social Media) కేసులు పెడుతున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వైసీపీ కార్యకర్తలను జైలుకు పంపుతుందని విమర్శించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను (Congress) కిందిస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తలను (Coordinators) నియమించింది. ఇందులో భాగంగా రెండో విడతలో 50 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించినట్లు ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు (AP PCC) వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రకటించారు. త్వరలో మరికొన్ని నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల పేర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. కొత్తగా నియామకమైన కోఆర్డినేటర్లు ప్రతి ఒక్కరు ప్రజలతో సత్సబంధాలు మెరుగుపరుచుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఆలూరు నియోజకవర్గానికి చిప్పగిరి లక్ష్మినారాయణ, ఉరవకొండకు వై. మధుసూదన్‌ రెడ్డి, గుంతకల్‌కు కావలి ప్రభాకర్‌, తిరుపతికి రాంభూపాల్‌ రెడ్డి, చిత్తూరుకు టికారాం, కుప్పంకు ఏ గోవిందరాజులు, గజపతినగరంకు చిత్రాది దుర్గాప్రసాద్‌, విజయనగరానికి ఎడ్ల పైడిరాజు, బాపట్లకు గంట అంజిబాబు, చిలకూరిపేటకు రాధకృష్ణను కోఆర్డినేటర్లుగా నియమించినట్లు వెల్లడించారు.

* బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ (Interpol) సాయం తీసుకుంటామని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. నేరారోపణలకు సంబంధించి ఆమెతోపాటు దేశం వీడిన అనేక మంది స్వదేశంలో విచారణ ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఇంటర్‌పోల్‌ ద్వారా త్వరలోనే రెడ్‌ నోటీసులు జారీ చేస్తాం. పారిపోయిన వారు ప్రపంచంలో దాక్కున్నా.. తిరిగి స్వదేశానికి తీసుకువచ్చి కోర్టులో నిలబెడతాం’’ బంగ్లాదేశ్‌ ప్రభుత్వ న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ పేర్కొన్నారు.

* విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. ఆదివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు.

* భారత్‌ వాంటెడ్‌ లిస్టులో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) అర్షదీప్‌ సింగ్‌ అలియాస్‌ అర్ష్‌ దల్లా (Arsh Dalla) ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. కెనడా (Canada) పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. గత నెల కెనడాలోని ఓ పట్టణంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో అర్ష్‌ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar)కు అర్షదీప్‌ సింగ్‌ సన్నిహితుడు. అక్టోబరు 27, 28న మిల్టన్‌ పట్టణంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో ఇతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కెనడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. తాజాగా అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో వివిధ నేర కార్యకాలాపాల్లో అర్షదీప్‌ ప్రమేయం ఉంది.

* ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రాంచీలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. దాదాపు 3కి.మీల రోడ్‌షో చేపట్టిన ఆయన.. ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు మోదీకి ఘనస్వాగతం పలికారు. ఝార్ఖండ్‌ రాజధాని నగరం రాంచీలోని ఓటీసీ మైదానం వద్ద ప్రారంభమైన ఈ రోడ్‌షో న్యూ మార్కెట్‌ చౌక్‌ వద్ద ముగియనుంది. మోదీ రోడ్‌షో నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు జనం ప్రధానిని చూసేందుకు పోటెత్తారు. రోడ్‌ షోను తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అంతకముందు బొకారో, గుమ్లాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ జేఎంఎం- కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

* ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర (Ukraine Russia Conflict) మొదలుపెట్టి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటికీ ఇరుదేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. రెండువైపులా పెద్దఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. అయితే, యుద్ధం మొదలైనప్పటినుంచి చూస్తే ఈ ఏడాది అక్టోబరులో పుతిన్‌ సేనలు అత్యధిక ప్రాణనష్టం చవిచూశాయట. బ్రిటన్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ సర్‌ టోని రాడాకిన్‌ ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z