NRI-NRT

లండన్‌లో NRI BRS కార్యవర్గ సమావేశం

లండన్‌లో NRI BRS కార్యవర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో రాష్ట్రాన్ని 20 ఏండ్ల వెనక్కి తీసుకెళ్లిందని అన్నారు. ఎన్నారై టీబీఆర్‌ఎస్‌ యూకే కార్యవర్గ సమావేశం లండన్‌లో ఘనంగా జరిగింది. ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఏర్పాటు చేసి పద్నాలుగు సంవత్సరాలైన సందర్భంగా ముఖ్య నాయకులంతా కేక్ కట్ చేసి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిల్‌ కూర్మాచలం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడి సోషల్‌మీడియా వేదికగా నిలదీయాలని ఎన్నారై కార్యకర్తలకు సూచించారు. అలాగే లండన్‌లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చే ప్రతి పిలుపునకు స్పందించి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు ఉపాధ్యక్షుడు నవీన్‌ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం, ఎన్నారై టీబీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌ రెడ్డి సమక్షంలో మహబూబ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు సాయిబాబా కోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సాయిబాబా కోట్ల కల్వకుర్తి నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులుగా పనిచేశాడు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసి లండన్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి.. నేడు అధికారంలోకి వచ్చినప్పుడు అందులో ఉండకుండా.. కేవలం కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని భావించి బీఆర్‌ఎస్‌లో చేరిన సాయిబాబాను అనిల్‌ కూర్మాచలం అభినందించారు. రానున్న రోజుల్లో వారికి పార్టీ తగిన గౌరవం ఇస్తుందని.. వారి అనుభవాన్ని, నాయకత్వాన్ని కూడా పార్టీ ఉపయోగించుకుంటుందని తెలిపారు. కార్యవర్గ సభ్యుల ఆలోచనలు, సలహాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు అడ్వైజరీ బోర్డు వైస్‌ చైర్మన్‌ సీక్క చంద్రశేఖర్‌ గౌడ్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z