* కెనడాలో హిందూ దేవాలయాలే లక్ష్యంగా దాడులు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తాజాగా ఓ ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ అక్కడ (Canada) ఎస్‌బీఐ సేవలపై ఎటువంటి ప్రభావం చూపించలేదని, కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది. ‘‘వినియోగదారులు, నియంత్రణ సంస్థల విధానంలో ఎటువంటి మార్పు కనపించలేదు. కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మేం అక్కడ స్థానిక బ్యాంకులలో ఒకటిగా పరిగణిస్తున్నట్లు భావిస్తున్నా. మా వాణిజ్య కార్యకలాపాలు స్థానిక వాతావరణంలోనే ఉంటాయి’’ అని ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. కెనడాలో 1982 నుంచి ఎస్‌బీఐ సేవలు అందిస్తోందని.. అందుకే లోకల్ బ్యాంక్‌గా పరిగణిస్తున్నారని చెప్పారు. కీలక సేవల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
* ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కొంత మంది సీనియర్ ఉద్యోగుల త్రైమాసిక బోనస్‌లలో కోత వేసింది. అంతక్రితం త్రైమాసికంలో 70% వేరియబుల్ పేఅవుట్‌ను ప్రకటించిన సంస్థ, తదుపరి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ ఉద్యోగుల వేరియబుల్ పేను ‘కార్యాలయంలో హాజరు, యూనిట్ పనితీరుకు’ అనుసంధానం చేసిన నేపథ్యంలో జులై-సెప్టెంబరు త్రైమాసికంలో బోనస్ చెల్లింపులను తగ్గించినట్లు ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. జూనియర్ ఉద్యోగులకు పూర్తి వేరియబుల్ పే ఇస్తుండగా.. కొంత మంది సీనియర్ ఉద్యోగులకు 20-40%, మరికొందరికి 100% దాకా ఇందులో కోత వేశారని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కార్యాలయానికి వచ్చే రోజులను, వేరియబుల్ పే చెల్లింపునకు అనుసంధానం చేశాక కార్యాలయానికి వచ్చే ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. తమ ఉద్యోగుల్లో 70% మంది కార్యాలయానికి వచ్చి పని చేస్తున్నారని గత జులైలోనే కంపెనీ ప్రకటించడం గమనార్హం. కార్యాలయ హాజరు 60-75% ఉన్న వారికి 50%, హాజరు 75-85% ఉంటే 75% బోనస్; హాజరు 85% పైన అయితే పూర్తి వేరియబుల్ పే అందుతుంది.
* టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఎయిరిండియాలో, మరో సంస్థ విస్తారా విలీనం ఈనెల 12న జరగనున్న నేపథ్యంలో.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసేందుకు టచ్ పాయింట్‌లు, విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. ఎయిరిండియా/విస్తారా బ్రాండెడ్ టీ షర్ట్‌లు ధరించి ఉండే ఈ కేంద్రాల్లోని సిబ్బంది, ప్రయాణికులకు సాయం చేస్తారు. విలీనం తరవాతా, విస్తారా నిర్వహణలోని మార్గాలు, షెడ్యూల్, ఇన్-ఫ్లైట్ అనుభవం అలాగే ఉంటాయి. విస్తారా విమానాలను గుర్తించేందుకు వీలుగా, 2 అంకెతో ప్రారంభమయ్యే ప్రత్యేక 4 అంకెల ఎయిరిండియా కోడ్ వాటిపై ఉంటుంది. ఇంతకుముందే కొనుగోలు చేసిన విస్తారా టికెట్లు కలిగిన వారిని, ఎయిరిండియా సిబ్బంది దగ్గర్లోని సహాయ కేంద్రం వద్దకు చేరుస్తారు. క్రమంగా విస్తారా ఎయిర్‌పోర్ట్ టికెటింగ్ కార్యాలయాలు, చెక్-ఇన్ టెర్మినళ్లు ఎయిరిండియాకు మారతాయి. ఇరు సంస్థల విలీనం అయిన తొలి నెలలో సుమారు 1,15,000 మంది విస్తారా టికెట్లతో ప్రయాణిస్తారని అంచనా. గత కొన్ని నెలలుగా 2,70,000 మంది ప్రయాణికులు విస్తారా విమానాల్లో ప్రయాణం చేసేందుకు బుకింగ్‌లు చేసుకున్నారు. 45 లక్షల మందికి పైగా విస్తారా లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యులు, ఎయిరిండియా లాయల్టీ ప్రోగ్రామ్‌కు మారారు. సమ్మిళిత సంస్థ 200కు పైగా విమానాలను కలిగి ఉంటుంది. ఇవి 90 దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను అనుసంధానం చేయనున్నాయి.
* కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛత’ ప్రచారాల ద్వారా స్క్రాప్‌ల (చెత్త) తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కేవలం మూడేళ్ళలో ప్రభుత్వం ఏకంగా 2,364 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి ‘జితేంద్ర సింగ్’ సోషల్ మీడియాలో వెల్లడించారు. స్క్రాప్‌ల ద్వారా భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి చేకూర్చడానికి సహకరించిన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్’ (DPIIT)ను భారత ప్రధాని ‘మోదీ’ ప్రశంసించారు. జితేంద్ర సింగ్ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ప్రశంసనీయం! సమర్థవంతమైన నిర్వహణ, చురుకైన చర్యపై దృష్టి సారించడం ద్వారా గొప్ప ఫలితాలను సాధించారు. పరిశుభ్రత, ఆర్థిక వివేకం రెండింటినీ ప్రోత్సహిస్తూ.. సమిష్టి ప్రయత్నాలు స్థిరమైన ఫలితాలకు ఎలా దారితీస్తాయో ఇది చూపిస్తుందని మోదీ పేర్కొన్నారు.
* సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా మారిపోతోంది. ఎప్పటికప్పుడు స్కామర్లు కొత్త అవతారాలెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు, డబ్బు దోచేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో మొబైల్ యూజర్లకు చాలా జాగ్రత్తగా ఉండాలని ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (TRAI) హెచ్చిరికలు జారీ చేసింది. స్కామర్లు బాధితులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలను నిలిపేస్తామని బెదిరిస్తారు. బాధితుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేరగాళ్లు తప్పుగా పేర్కొంటారు. దీంతో కొందరు భయపడి నేరగాళ్లు చెప్పినట్లు వింటారు, భారీగా డబ్బు కోల్పోతారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. షేర్ చేసిన ఒక వీడియోలో ఇలాంటి స్కామ్‌కు సంబంధించిన సంఘటనను చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మొబైల్ యూజర్ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని.. సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఏవైనా అనుమానాస్పద కాల్‌లను నివేదించాలని ట్రాయ్ కోరింది.
* భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో ‘మిఫా 9’ (Mifa 9) ఎంపీవీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ కారు విక్రయాలు 2025 మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందు 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శనకు రానున్నట్లు సమాచారం. ఎంజీ మిఫా 9 కారు 2023లోనే మొదటిసారి ఆటో ఎక్స్‌పోలోలో కనిపించింది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత కీయ కార్నివాల్‌కు ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ కారు ఒట్టోమన్ సీట్లతో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z