Health

అమెరికాలో అబార్షన్ మాత్రలకు గిరాకీ. బైడెన్ భావోద్వేగం-NewsRoundup-Nov 12 2024

అమెరికాలో అబార్షన్ మాత్రలకు గిరాకీ. బైడెన్ భావోద్వేగం-NewsRoundup-Nov 12 2024

* వైకాపా (YSRCP) సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి (Varra Ravinder Reddy) రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ‘‘ఐప్యాక్‌ టీమ్‌ కంటెంట్‌ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసేవాళ్లం. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో పోస్ట్‌ చేసేవాళ్లం. వైకాపాకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని.. నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టాం. వైకాపా సోషల్‌ మీడియా కన్వీనర్‌ వివేక్‌రెడ్డి సూచనలతోనే పోస్టులు. సజ్జల భార్గవరెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయాం. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడు. 2023 నుంచి నా ఫేస్‌బుక్‌ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టేవారు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టాం. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ పీఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్‌ ఇచ్చారు. ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్‌రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారు. పవన్‌, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టా. వైకాపా సోషల్‌ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకం’’ అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

* గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలానికి చెందిన కె.విష్ణువర్ధన్ (31), కేపీహెచ్‌ కాలనీలోని హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం ఉదయం సమీపంలోని వీరాంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. నీళ్లు తాగేందుకు ఫిల్టర్ వద్దకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి తుది శ్వాస విడిచారు. విష్ణువర్ధన్‌ అనారోగ్య సమస్యలతో పాటు ఇటీవల వైరల్ జ్వరంతో బాధపడినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. బాధితుడి సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

* వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డి (Sajjala Bhargavreddy), అర్జున్‌ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏపీలో భార్గవ్‌ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

* ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్‌ ప్లాంట్‌లను రిలయన్స్‌ ఏర్పాటు చేయనుంది. రిలయన్స్‌ పెట్టుబడులతో రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. గత నెలలో రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తోన్న అనంత్ అంబానీని లోకేష్ ముంబయిలో కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మంత్రి వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్‌తో ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.

* అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. మరికొన్ని రోజుల్లో ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలోనే దేశంలో కీలక పరిణామం చోటుచేసుకొంది. అబార్షన్‌ మాత్రల (Abortion Pills) కోసం భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క రోజులోనే వీటికోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు రావడం గమనార్హం. ఈమేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ అధికారంలోకి వస్తే గర్భవిచ్ఛిత్తి హక్కును (Abortion rights) నిషేధిస్తారంటూ వదంతులు రావడంతో మాత్రల కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు సంబంధిత వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించాక వీటికి డిమాండ్‌ పెరిగింది. 24 గంటల్లోనే అబార్షన్‌ మాత్రల కోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయట. ఇది రోజూ ఉండే డిమాండ్‌ కంటే 17 రెట్లు ఎక్కువని కథనాలు పేర్కొన్నాయి. గర్భిణులు కానివారు సైతం ప్రిస్కిప్షన్‌ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీవో వెల్లడించింది.

* వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల్లో (Entrance Exams) వివిధ సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షల్లో ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూస్తున్నామని అన్నారు. ఇందుకు రాష్ట్రాలూ తమ సహకారం తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు.

* అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెటరన్స్‌ డే సర్వీస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సాయుధ దళాల్లో సేవలందించి అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అమరుల సేవలను గుర్తు చేసుకుంటూ ‘గాడ్ బ్లెస్‌ అమెరికా’ పాట ఆలపిస్తూ బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లను తుడుచుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తొలిసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ‘‘నేను కమాండర్‌ చీఫ్‌ హోదాలో ఇక్కడ నిలబడడం ఇదే చివరిసారి. నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం ఇది’’ అని అన్నారు.

* నాసిరకం, నకిలీ ఔషధాలు తయారు చేసే వారు.. వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆదేశించారు‌. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో‌ ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC) అధికారులతో వెంగళరావునగర్‌‌లోని డీసీఏ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.

* ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-2 మెయిన్స్‌ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌ కుమార్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ పరీక్షను జనవరి 5న రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు అక్టోబర్‌ 30న ఏపీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్ష తేదీని రీషెడ్యూల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z