* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ మళ్లీ 24వేల దిగువకు చేరింది. నిరాశజనక త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉదయం లాభాల్లో ట్రేడయినప్పటికీ.. గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు భారీగా కుంగాయి. ఈ సాయంత్రం ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించారు. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీ మొత్తం విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు ఆవిరై రూ.436 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 79,644.95 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,496.15) లాభాల్లో ప్రారంభమైంది. ఉదయమంతా లాభాల్లో కొనసాగిన సూచీ.. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 78,547.84 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 820.97 పాయింట్ల నష్టంతో 78,675.18 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 257 పాయింట్ల నష్టంతో 23,883.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠమైన 84.40కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ సేర్లు ప్రధానంగా నస్టపోయాయి. సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 72.29 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2599 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది.
* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా (Honda) విద్యుత్ వాహన రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలో ఓ విద్యుత్ స్కూటర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు పేర్కొంటూ తాజాగా ఓ టీజర్‌ను విడుదల చేసింది. తన పాపులర్ మోడల్ యాక్టివానే (Activa EV) విద్యుత్ స్కూటర్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను చూస్తే యాక్టివా లుక్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. లుక్ పరంగా పెద్దగా మార్పులేవీ లేకుండానే ఈవీ రూపంలో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి అంకుర సంస్థలు విద్యుత్ స్కూటర్ల విభాగంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు బజాజ్, టీవీఎస్ వంటి సంప్రదాయ ఆటోమొబైల్ సంస్థలూ చేతక్, ఐక్యూబ్ మోడళ్లతో మెరుగైన విక్రయాలు నమోదు చేస్తున్నాయి. కాస్త ఆలస్యంగానైనా హీరో మోటోకార్ప్ సంస్థ విడా పేరిట విద్యుత్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో హోండా నుంచి కూడా త్వరలోనే విద్యుత్ స్కూటర్‌ను తీసుకురాబోతోందంటూ కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ నుంచి ఈ ప్రకటన వెలువడింది. త్వరలోనే మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హోండా ఎంట్రీతో విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో పోటీ తీవ్రం కానుంది. మరి ఎంత ధరలో తెస్తారు? రేంజ్ ఎంత ఉండబోతోంది? వంటి వివరాలు తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే!
* కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన భారతీయ జన ఔషధి కేంద్రాన్ని (PMBJK) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్ సహా దేశవ్యాప్తంగా 18 ప్రదేశాల్లో ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను ప్రధాని రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. పీఎంబీజేకే ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. సమాజంలోని అన్ని వర్గాల వారికి నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూడటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని అధికారులు తెలిపారు.
* రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీన ప్రక్రియ ఈ వారంలోనే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విలీనం తర్వాత ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు అయిన జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ కలిసి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనుంది. ఈ నేపథ్యంలో జియోస్టార్ (Jio star) పేరిట కొత్త డొమైన్ తెరపైకి వచ్చింది. ఆ వెబ్‌సైట్‌లో ప్రస్తుతానికి ‘కమింగ్ సూన్’ అనే సందేశం కనిపిస్తోంది.
* మధ్యప్రదేశ్, బీహార్‌లలో థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌టీపీసీ నుంచి ‘అల్ట్రా మెగా’ ఆర్డర్‌ను పొందినట్లు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో(L&T) ఈ రోజు(మంగళవారం) తెలిపింది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ.15 వేల కోట్లు. ఎల్&టీ బిజినెస్ యూనిట్‌గా ఉన్న ఎల్&టీ ఎనర్జీ కార్బన్‌లైట్ సొల్యూషన్స్, ఈ ఆర్డర్‌ను పొందిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఆర్డర్‌లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ వర్క్‌లతో పాటు బాయిలర్స్, టర్బైన్స్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు, యాక్సిలరీల డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సప్లయ్ మొదలగు పనులు ఉంటాయి. ఎల్&టీ..ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్(EPC) ప్రాజెక్ట్‌లు, హైటెక్ తయారీ సేవల్లో నిమగ్నమై ఉన్న 27 బిలియన్ డాలర్ల విలువ గల భారతీయ బహుళజాతి సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాల్లో విస్తరించి ఉంది.
* దేశంలో మరోసారి రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లక్షిత స్థాయిని దాటేసి అక్టోబర్ నెలలో వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6.21 శాతంగా నమోదైంది. సెప్టెంబర్ నెలలో 5.49 శాతంగా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలలో ఆహార పదార్థాల ధరల పెరుగుదల కారణమైంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం మంగళవారం అధికారిక డేటాను వెలువరించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z