* దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది. డీజిల్ లేదా విద్యుత్‌తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్-ఆధారిత అద్భుతం 2030 నాటికి “నికర శూన్య కార్బన్ ఉద్గారిణి”గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలురాయి కానుంది. హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్‌తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది. సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.
* ఎయిరిండియాలో విలీనానికి ముందు నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో విమాన సిబ్బంది ‘గుడ్‌బై విస్తారా’ అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఇటీవల నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కెప్టెన్ సుధాన్షు రైక్వార్, నేహల్ చేసిన ప్రకటనకు సంబంధించిన షార్ట్ క్లిప్‌ను ఎక్స్ వేదికలో పంచుకున్నారు. ‘చివరి విస్తారా సర్వీస్ బ్రాండ్‌గా మీకు అత్యుత్తమ భద్రత, సేవలను అందించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాం. కొన్నేళ్లుగా విస్తారా వివిధ ఖండాల్లో విస్తరించి, విభిన్న సంస్కృతులు కలిగిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అంకితభావం, భద్రత, విశ్వసనీయతతో మీకు సేవ చేయడం మా లక్ష్యం. విస్తారా చివరి సర్వీస్ ఈ రోజు మేము అదే ఉన్నత ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. గుడ్‌బై విస్తారా. మేము ఎంతో మిస్ అవుతాం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
* ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్‌లకు పరిష్కారం లభించింది.
* దేశంలో బంగారం ధరల తగ్గుముఖం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు బుధవారం (నవంబర్ 13) పసిడి రేట్లు గణనీయంగా తగ్గాయి. గడిచిన ఐదు రోజుల్లో బంగారం తులానికి (10 గ్రాములు) రూ.2600 పైగా దిగివచ్చింది. ఈ తగ్గింపు ఇలాగే కొనసాగి ధరలు మరింత దిగిరావాలని పసిడి ప్రియులు ఆశిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలు ఎంతెంత తగ్గాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.400 తగ్గి రూ.70,450 లకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.440 క్షీణించి రూ. 76,850 వద్దకు దిగివచ్చింది.
* దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు (Stock market) భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలతో గత కొన్ని రోజులుగా పతనమవుతున్న మార్కెట్ సూచీలకు.. రిటైల్ ద్రవ్యోల్బణం ఆజ్యంపోసింది. అక్టోబర్ నెలలో 14 నెలల గరిష్ఠానికి చేరడంతో ఇప్పట్లో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, రూపాయి జీవనకాల కనిష్ఠానికి చేరడంతో సూచీలు వరుసగా ఐదోరోజూ నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ సూచీల పతనానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ ఓ దశలో 1100 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ సైతం 23,600 దిగువకు చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.8 లక్షల కోట్లు క్షీణించి రూ.438 లక్షల కోట్ల నుంచి రూ.430 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 78,495.53 (క్రితం ముగింపు 78,675.18) పాయింట్ల నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 77,533.30 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. తర్వాత కాస్త కోలుకుని 984 పాయింట్ల నష్టంతో 77,690.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 324 పాయింట్ల నష్టంతో 23,559.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.38గా ఉంది.
* ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఫైబర్ యూజర్ల కోసం ఐఎఫ్టీవీ (IFTV) పేరిట కొత్త సేవలను ప్రారంభించింది. ప్రస్తుతానికి తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ఈ సేవలను తీసుకొచ్చినట్లు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ టు హోమ్ (FTTH) వినియోగదారులకు ఈ సేవలు లభిస్తాయని తెలిపింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ ఎక్స్‌లో తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం జియో, భారతీ ఎయిర్టెల్ వంటి సంస్థలు కూడా తమ ఫైబర్ యూజర్లకు లైవ్‌టీవీ ఛానళ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే, టీవీ ఛానళ్లను వీక్షించినప్పుడు వినియోగించే డేటా నెలవారీ కోటా నుంచి మినహాయిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ ఛానళ్లు డేటాతో సంబంధం లేకుండానే లభిస్తాయి. బఫర్ సమస్య లేకుండా హై స్ట్రీమింగ్ క్వాలిటీతో టీవీ ఛానళ్లను వీక్షించొచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ ఛానళ్లు ఎలాంటి ఎక్స్ట్రా మొత్తం చెల్లించకుండానే పొందొచ్చని పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z