Politics

చంద్రబాబుకు జగన్ సవాల్-NewsRoundup-Nov 13 2024

చంద్రబాబుకు జగన్ సవాల్-NewsRoundup-Nov 13 2024

* మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇంట్లో వైకాపా (YSRCP) సోషల్‌ మీడియా సైకోను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోంమంత్రి అనితపై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడు. దీనిపై నూజివీడులో కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజశేఖర్‌ కోసం గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. నకరికల్లులో అతడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం అంబటి రాంబాబు స్పందిస్తూ రాజశేఖర్‌ తమ ఇంట్లోనే ఉన్నాడని.. సంబంధిత ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. దీంతో బుధవారం నూజివీడు పోలీసులు.. గుంటూరులో అంబటి ఇంటికి వెళ్లారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను చూపించి రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

* అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. పోలీసుల(AP Police) చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమంది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్‌ వేయడానికి వీలు లేదని పేర్కొంది. సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం(AP High Court) ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.

* రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌. గతంలో నాకో లవ్‌ స్టోరీ ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌ అయ్యింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా. మానసికంగా కుంగుబాటుకు గురయ్యా. ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నా. స్ట్రాంగ్‌గా నిలబడ్డా. కెరీర్‌పై దృష్టి పెట్టా. ఇండస్ట్రీలో కంటే బయటే నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులే నాకు అన్ని విధాలుగా సపోర్ట్‌ చేస్తుంటారు. వారే నా బలం’’ అని తెలిపారు.

* మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని (Kakani Govardhan Reddy) పోలీసులు నెల్లూరు జిల్లా ముత్తుకూరు పీఎస్‌లో విచారించారు. సామాజిక మాధ్యమాల్లో తెదేపానేత సోమిరెడ్డిపై ఆరోపణలు, కార్టూన్ల ప్రచురణపై తెదేపా నేతల ఫిర్యాదుతో ముత్తుకూరు పీఎస్‌లో కాకాణిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి కృష్ణపట్నం సీఐ రవినాయక్‌ సమక్షంలో రెండున్నరగంటల పాటు విచారించారు. విచారణలో భాగంగా కాకాణిని పోలీసులు 54 ప్రశ్నలు అడిగారు. పోలీసులు అడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి ఆయన సమాధానం ఇవ్వలేదు. అంతకు ముందు ఈ కేసు విచారణకు మందీమార్బలంతో ర్యాలీగా వచ్చిన కాకాణిని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి ర్యాలీని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకాణి ఒక్కరినే స్టేషన్‌ వద్దకు అనుమతించారు.

* ఝార్ఖండ్‌ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలతో (Jharkhand Assembly Polls) పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఝార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలకు గాను 43 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్‌ జరిగింది. అలాగే, కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానంతో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో 31 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌ ప్రకారం.. ఈ సాయంత్రం 5గంటల వరకు ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 64.86శాతం పోలింగ్‌ నమోదు కాగా.. వయనాడ్‌లో 60.79శాతం పోలింగ్‌ నమోదైంది. క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లకు పోలింగ్‌ సమయం ముగిసినా ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది.

* ఓ హత్య కేసులో దోషిగా తేలిన యువకుడికి కొన్ని నెలల క్రితం ఉరిశిక్ష (Execution) అమలు చేశారు. అయితే, ఉరికంబంపై వేలాడదీసిన కొద్దిసేపటికే బాధితుడి (హత్యకు గురైన వ్యక్తి) కుటుంబీకులు ‘క్షమాపణ’కు అంగీకరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, పరిహారంపై (Blood Money) బాధిత కుటుంబంతో ఒప్పందం కుదరకపోవడంతో.. ఇటీవల అతడికి రెండోసారి ఉరిశిక్ష అమలు చేశారు. ఇరాన్‌ (Iran)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

* భారాస నేత, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం అతనికి ఈనెల 27 వరకు రిమాండ్‌ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.

* సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. ‘‘కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయి. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. వాళ్లు పెట్టిన పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం చేశారు. ఆ తర్వాత పోస్టులు డిలీట్‌ చేశారు. అయినా, వారిని వదిలిపెట్టం.. కేసులు నమోదు చేస్తాం. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు. సొంత తల్లిని, చెల్లిని తిట్టినవారిని జగన్‌ ఏంచేయలేకపోయారు. మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మేం అరెస్టులు చేస్తున్నాం’’ అని హోం మంత్రి తెలిపారు.

* వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్‌ నివేదిక బయటపెట్టింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొంది. రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని కాగ్‌ వెల్లడించింది. స్థానిక సంస్థలకు రూపాయిలో 9 పైసలే చెల్లించారని తెలిపింది. మూలధన వ్యయంగా 9 పైసలే ఖర్చు చేశారని నివేదికలో పేర్కొంది.

* వెంకటేశ్‌ (venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki vasthunnam). ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్‌ అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారని తెలిపింది.

* వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్‌ సెంటర్లు(Coaching Centres) తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కోచింగ్‌ కేంద్రాలు చేసే 100 శాతం జాబ్‌ గ్యారెంటీ, 100 శాతం సెలెక్షన్‌ వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థ (CCPA)కు అనేక ఫిర్యాదులు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

* సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై అక్రమ కేసులు పెట్టారని.. అరెస్ట్‌చేస్తే నా దగ్గర నుంచే మొదలు పెట్టాలంటూ చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ‘‘చంద్రబాబు మోసాలపై నేను ట్వీట్‌ చేస్తాను. నాతో పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ట్వీట్‌ చేస్తారు. ఎంతమంది పైన కేసులు పెడతారో పెట్టండి. ఎంతమందిని అరెస్ట్‌ చేస్తారో చూద్దాం. బాబు బడ్జెట్‌లో చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తాం. సోషల్‌ మీడియాలో బాబు మోసాలను ఎండగడతాం’’ అని వైఎస్‌ జగన్‌ తేల్చి చెప్పారు.

* రాష్ట్రంలో 11 నెలలుగా అరాచక పాలన నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోతుందని సెటైర్లు వేశారు. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే రేవంత్ పదవి పోవడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి భరతం పట్టే పనిని కొండగల్ నుంచే మొదలు పెడతామని, కొడంగల్‌లో రేవంత్ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని తెలిపారు. కొడంగల్‌లో అరెస్టు చేసిన 16 మంది రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో పట్నం నరేందర్ రెడ్డి తల్లి, సతీమణీలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ,మహమూద్ అలీ, పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిసి పరామర్శించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. త‌న‌ అల్లుడి కంపెనీ కోస‌మే రైతుల‌పై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జ‌న్యాల‌కు పాల్పడుతున్నార‌ని మండిపడ్డారు

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z