* గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైకాపా (YSRCP) సభ్యులు అవమానించారని మంత్రి లోకేశ్ (Nara Lokesh) అన్నారు. బడ్జెట్ సమావేశాల మూడో రోజు ఆయన శాసనమండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
* శ్రీవారికి తితిదే మాజీ ఛైర్మన్, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య భారీ విరాళం అందించారు. సుమారు రూ.2కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను తితిదే (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు తితిదే అలంకరించనుంది. శుక్రవారం తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీమాలను చైతన్య విరాళంగా అందజేయనున్నారు.
* సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న నిందితుడు సత్య నీరజ్ కుమార్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఇతరులను ఇబ్బంది పెట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అరెస్టు చేయరా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నిందితుడి పిటిషన్‌పై సాధారణ పద్ధతిలోనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టాడనే కారణంతో తిరుపతి తూర్పు పోలీసులు నీరజ్ కుమార్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
* మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ (India) అదరగొడుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 13 – 0 తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే భారత్ సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. యువ స్ట్రైకర్ దీపిక (3వ, 19వ, 43వ 45వ, 45వ నిమిషం) ఐదుసార్లు గోల్స్‌తో సత్తా చాటింది. ప్రీతి దూబే (9వ, 40వ), లాల్‌రెమ్‌సియామి (12, 56వ), మనీషా చౌహాన్ (55వ, 58వ), తలో రెండు గోల్స్ చేశారు. బ్యూటీ డంగ్‌డంగ్ (30వ), నవ్‌నీత్ కౌర్ (53వ) చెరో గోల్ సాధించారు. అంతకుముందు భారత్.. మలేసియాను 4-0, దక్షిణ కొరియాను 3-2 తేడాతో ఓడించింది. మన అమ్మాయిలు తర్వాతి మ్యాచ్‌లో (శనివారం) ఒలింపిక్స్‌లో రజతం సాధించిన చైనా జట్టుతో తలపడనున్నారు. గురువారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మలేషియా 2-1తో కొరియాను ఓడించగా, చైనా కూడా 2-1 తేడాతో జపాన్‌పై గెలిచింది. ప్రస్తుతం టోర్నీ పాయింట్ల పట్టికలో చైనా 9 పాయింంట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ ఖాతాలో కూడా 9 పాయింట్లే ఉన్నప్పటికీ ఎక్కువ గోల్స్ ఉండటంతో చైనా టాప్‌లో నిలిచింది.
* తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) గతేడాది జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 80శాతం మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించిన TGPSC.. ధ్రువపత్రాలు, ఇతర అన్ని వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేసి తాజాగా 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితాను ప్రకటించింది.
* దేశ రాజధాని నగరం దిల్లీ (Delhi)లో ఆప్ (AAP) సర్కార్ విద్యా రంగానికి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడంతో పాటు దేశంలోనూ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే సంకల్పంతో దిల్లీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అతి పెద్ద పాఠశాలను నిర్మించారు. సరికొత్త హంగులతో సుందర్ నగరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలను దిల్లీ సీఎం ఆతిశీ (Atishi Marlena) గురువారం ప్రారంభించారు.
* బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable With NBK). ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ కార్యక్రమంలో నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) సందడి చేశారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ఓటీటీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆయన ప్రభాస్ గురించి మాట్లాడుతూ కనిపించారు. ‘‘అప్పటికి, ఇప్పటికి ప్రభాస్‌ని చూస్తే ఒక్కటే మాట చెప్పాలని ఉంటుంది. ఆరడుగుల బంగారం’’ అని అన్నారు. పవన్ కల్యాణ్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘తన దారిలో తను వెళ్లిపోతారు’’ అనగా.. బన్నీ అంతే అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
* సీఎం రేవంత్‌రెడ్డికి తానంటే చాలా ప్రేమ ఉన్నట్టు ఉందని.. అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లగచర్ల భూ సేకరణలో తీవ్రంగా భంగపడిన ప్రభుత్వం కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. ఘటన జరిగినప్పుడు అక్కడ లేని భారాస కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారని ఆరోపించారు. సురేశ్ అనే వ్యక్తి భారాస కార్యకర్తే.. ఆయనకు భూమి ఉందని తెలిపారు. లగచర్ల ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందని వ్యాఖ్యానించారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లినట్టు వెళ్లారని మండిపడ్డారు.
* అక్రమ మైనింగ్‌కు పాల్పడిన 4 వేల మంది మైనర్ల విషయంలో దక్షిణాఫ్రికా (South African) ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొంది. గనిలో ఉండిపోయిన వారిని కాపాడేందుకు ససేమిరా అంటోంది. వారు బయటకు రాకుండా గని ద్వారాలను మూసివేసి నిత్యావసరాలను అందించకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో మూసివేసిన బంగారు గనిలోకి దాదాపు 4 వేల మంది మైనర్లు అక్రమంగా ప్రవేశించారు. అందులో మిగిలిన బంగారం దొరుకుతుందేమోనన్న ఆశతో గనిలోకి భారీగా వెళ్లినట్టు కథనాలు పేర్కొన్నాయి. అలా వెళ్లిన వారంతా అందులోనే ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం వారి పట్ల కఠిన చర్యలకు ఉపక్రమించింది. వారంతా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. గని ద్వారాలు మూసేసి లోపల ఉన్న మైనర్లకు ఆహారం, నిత్యవసరాలను అందించకూడదంటూ సంబంధిత అధికారులను ఆదేశించింది.
* అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఎన్నికైన నేపథ్యంలో అంతర్జాతీయ వ్యవహారాలు మరింత ఆసక్తిగా మారాయి. ముఖ్యంగా ఐరాస (United Nations)తోపాటు అనేక అంతర్జాతీయ సంస్థలకు పెద్ద దిక్కుగా ఉన్న అగ్రరాజ్యం.. నిధులు సమకూర్చే విషయం చర్చనీయాంశమైంది. గతంలో ఐరాస పనితీరుపై విమర్శలు గుప్పించిన ట్రంప్.. ఆయా సంస్థలకు ఆర్థిక సాయాన్ని నిలిపివేయడమే అందుకు కారణం. ఐక్యరాజ్య సమితికి అతిపెద్ద దాతగా అమెరికా కొనసాగుతోంది. ఐరాస సభ్యదేశాలు ఇచ్చే మొత్తం విరాళాల్లో దాదాపు 22శాతం ఒక్క ఈ దేశం నుంచే వస్తున్నట్లు అంచనా. అయితే, మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు కీలక వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్.. ఐరాసను ఓ ఆహ్లాద కేంద్రమని పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఐరాస ఆరోగ్య విభాగానికి నిధులు నిలిపివేశారు. యునెస్కో, మానవహక్కుల విభాగాల నుంచి వైదొలిగారు. అబార్షన్లకు నిధులు ఇస్తోందని ఆరోపిస్తూ యూఎన్ పాపులేషన్ ఏజెన్సీ (UNFPA)కి నిధుల కోత విధించారు.
* సినీనటి శ్రీరెడ్డిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితలపై అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ మచిలీపట్నం తెదేపా సోషల్ మీడియా కన్వీనర్ నిర్మల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి.. అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనితలపై ఆమె ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ.. సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఇప్పటికే శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z