Business

మరో సరికొత్త రికార్డు నెలకొల్పిన డాలరు-రూపాయి మారకం-BusinessNews-Nov 14 2024

మరో సరికొత్త రికార్డు నెలకొల్పిన డాలరు-రూపాయి మారకం-BusinessNews-Nov 14 2024

* ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) మరోసారి వార్తల్లో నిలిచింది. ద్విచక్ర వాహన నాణ్యత, విక్రయానంతర సేవలకు సంబంధించిన ఫిర్యాదులపై వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ (CCPA) తాజాగా విచారణకు ఆదేశించింది. బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఇన్వెస్టిగేషన్‌)ను 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని సీసీపీఏ సూచించింది.

* బాలల దినోత్సవం సందర్భంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు. సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ ద్వారా దశాబ్ద కాలంగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆమె.. రానున్న రోజుల్లో ఈ సేవలను మరింత విస్తృతం చేయనున్నారు. ఇందులో భాగంగా బాలల దినోత్సవం సందర్భంగా కొత్త ప్రణాళికను ఆవిష్కరించారు. తమ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ ద్వారా 50 వేల మందికి చిన్నారులకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్‌, చికిత్సలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. అలాగే, 10 వేల మంది కౌమార బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు. భావి భారత పౌరుల మోములో ఆనం

* మీడియా రంగంలో అతిపెద్ద విలీనం జరిగింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అంతర్జాతీయ మీడియా దిగ్గజం వాల్ట్‌ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం (Reliance-Disney merger) ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తయ్యింది. తద్వారా రూ.70,353 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈ సంస్థకు ముకేశ్‌ నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఉదయ్‌ శంకర్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. విలీన సంస్థ వృద్ధికి గానూ రూ.11,500 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు రిలయన్స్‌ ప్రకటించింది.

* ఈ రోజు(గురువారం) ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత వాణిజ్య లోటు గత ఏడాది అక్టోబర్‌లో $33.43 బిలియన్ల(రూ.2.80 లక్షల కోట్ల) నుంచి 2024 అక్టోబర్‌లో $27.14 బిలియన్ల(రూ.2.28 లక్షల కోట్ల)కు తగ్గింది. అయితే, గత నెల $20.8 బిలియన్ల కంటే ఇది ఎక్కువే. అక్టోబర్‌లో దేశీయ సరుకుల ఎగుమతులు $39.2 బిలియన్లు(రూ.3.29 లక్షల కోట్లు)గా ఉండగా దిగుమతులు $66.34 బిలియన్లు(రూ.5.57 లక్షల కోట్లు)గా ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో సేవల రంగానికి సంబంధించిన ఎగుమతులు $34.02 బిలియన్లు(రూ.2.85 లక్షల కోట్లు)గా అంచనా వేయగా, దిగుమతులు 17 బిలియన్లు (రూ.1.42 లక్షల కోట్లు)గా ఉన్నాయి.

* అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ (Boeing) పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఏకంగా 17 వేల మంది సిబ్బందిపై వేటు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగించేందుకు గానూ పింక్‌ స్లిప్పులు (Boeing layoffs) జారీ చేయడం ప్రారంభించిది. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడులు, ఉత్పత్తి ఆలస్యం వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు స్థానిక నిబంధనలకు అనుసరించి 60 రోజుల నోటీసు పీరియడ్‌ భాగంగా జనవరి వరకు ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగుతారు. సియాటెల్‌ ప్రాంతంలో 33 వేల మంది కార్మికులు కొన్ని వారాల పాటు సమ్మె చేశారు. దీంతో 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకొనేందుకు ఉద్యోగుల తొలగింపును మార్గంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని కంపెనీ ఇది వరకే పేర్కొంది. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇకపై పూర్తి ప్రాధాన్య అంశాలపై మాత్రమే దృష్టి సారించాని నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కష్ట కాలంలో తమ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాల నేపథ్యంలో వరుసగా ఆరో సెషన్‌లోనూ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలైన హెచ్‌యూఎల్‌, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం సూచీలపై ప్రభావం చూపింది. రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు రాణించాయి. సెన్సెక్స్‌ ఉదయం 77,636.94 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,690.95) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత కాసేపు లాభాల్లోకి వెళ్లినప్పటికీ.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆపై రోజంతా నష్టాల్లోనే సూచీ కదలాడింది. ఇంట్రాడేలో 77,424.81 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 110.64 పాయిట్ల నష్టంతో 77,580.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.35 పాయింట్ల నష్టంతో 23,532.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరింత క్షీణించి 84.41కి చేరింది.

* ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) కొత్త డేటా బూస్టర్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.11 రీఛార్జితో 10జీబీ హై స్పీడ్‌ డేటాను వినియోగించుకొనే సదుపాయం తీసుకొచ్చింది. అయితే ఇందులో ఒక మెలిక ఉంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కేవలం గంట మాత్రమే. వాయిస్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ డేటా ప్లాన్‌ను వినియోగిస్తున్నవాళ్లు హైస్పీడ్‌ డేటా కోసం ఈ డేటా బూస్టర్‌తో రీఛార్జి చేసుకోవచ్చు. లార్జ్‌ ఫైల్స్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు డౌన్‌లోడ్‌ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త డేటా బూస్టర్‌ ప్లాన్‌ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. అయితే గంటలోపు 10జీబీ డేటా పూర్తయిపోయినా 64kbps వేగంతో అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చని జియో తెలిపింది.

* ట్రంప్‌ హయాంలో అమెరికాతో భారత్‌ సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) అన్నారు. ప్రధాని మోదీకి, ట్రంప్‌ మధ్య ఉన్న సాన్నిహిత్యమే అందుకు కారణమన్నారు. ఈమేరకు సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించిన గ్లోబల్ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. గతంలో ఒబామా, తర్వాత బైడెన్‌ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేశామని, ఇరు దేశాల మధ్య బంధం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతూ వస్తోందన్నారు. ట్రంప్ ప్రభుత్వంతో ఈ బంధం మరింత బలోపేతం కానుందని పీయూష్‌ అన్నారు. ప్రధాని మోదీని ‘అద్భుతమైన వ్యక్తి’, ‘డియర్‌ ఫ్రెండ్’ అని ట్రంప్‌ సంబోంధించడాన్ని ఈసందర్భంగా ప్రస్తావించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z