Devotional

శబరిమల ఆలయం తెరచుకుంది-NewsRoundup-Nov 15 2024

శబరిమల ఆలయం తెరచుకుంది-NewsRoundup-Nov 15 2024

* తన సతీమణి ఆర్తి నుంచి విడిపోతున్నానని కొంత కాలం క్రితం నటుడు జయంరవి (Jayam Ravi) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెన్నై ఫ్యామిలీ కోర్టు తాజాగా ఈ పిటిషన్‌ను పరిశీలించింది. జయంరవి కోర్టుకు హాజరు కాగా.. ఆర్తి వీడియో కాల్‌లో అందుబాటులోకి వచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని.. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది.

* రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని చెప్పారు. బడ్జెట్‌పై శాసనసభలో ఆయన మాట్లాడారు. మోదీ, పవన్‌, ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని దానిని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

* ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న రూ.15వేల కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. నిర్మలా సీతారామన్‌తో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో సీఎం సమావేశమయ్యారు.

* భారాస ప్రభుత్వ హయాంలో ముమ్మాటికీ అవకతవకలు జరిగాయని.. బాధ్యులపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. భారాస, భాజపా నేతలు సామాజిక మాధ్యమాలను మితిమీరి వినియోగిస్తూ.. ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారంతా విదేశాల్లో ఉంటూ ఇలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ.. భారాస అధినేత కేసీఆర్‌ ఏడాదిగా బయటకు రావడం లేదన్నారు.

* రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్‌, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్‌, టీజీ భరత్‌ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేయనున్నారు. కొత్తగా వచ్చే సంస్థలకు చేయాల్సిన కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడంపై కమిటీ చర్చించనుంది. గతంలో 120కి పైగా సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం రాజధానిలో మళ్లీ భవనాల నిర్మాణాన్ని పునః ప్రారంభిస్తామని 115కు పైగా సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి.

* మండల-మకరవిళక్కు సీజన్‌లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. తొలిరోజే వర్చువల్‌ బుకింగ్‌ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఓ గంట ముందే ఆలయాన్ని తెరచినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ సీజన్‌లో దర్శన సమయాలను పొడిగించినట్లు తెలిపింది. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్‌ కుమార్‌ నంబూథిరి తెరవనున్నట్లు దేవస్థానం బోర్డు పేర్కొంది. మండల సీజన్‌ శనివారం నుంచి అధికారికంగా ప్రారంభమై డిసెంబర్‌ 26 వరకు కొనసాగుతుంది. డిసెంబర్‌ 30 నుంచి మొదలయ్యే మకరవిళక్కు.. జనవరి 20, 2025 వరకు కొనసాగుతుంది. నిత్యం 18 గంటల పాటు దర్శనాలకు అనుమతిస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల దర్శనాలు ఉంటాయి.

* రంజీ ట్రోఫీలో హరియాణా పేసర్ అన్షుల్ కాంబోజ్‌ (Anshul Kamboj) అరుదైన రికార్డు సాధించాడు. ఎలైట్‌ గ్రూప్‌ సిలో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అతను 49 పరుగులే ఇచ్చి మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ప్రేమంగ్సు మోహన్ ఛటర్జీ (1956-57), ప్రదీప్ సుందరం (1985-86) ఈ ఘనత అందుకున్నారు. మోహన్‌ ఛటర్జీ బెంగాల్ తరఫున 1956-57 సీజన్‌లో అస్సాంపై తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. ప్రదీప్‌ సుందరం 1985-86 ఎడిషన్‌లో విదర్భతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. అన్షుల్ ధాటికి కేరళ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హరియాణా 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. కాంబోజ్ పడగొట్టిన 10 వికెట్లకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. మీరూ చూసేయండి

* పులివెందుల ప్రజలకు వైకాపా అధినేత జగన్‌ సమాధానం చెప్పి తీరాలని తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు రానని అనడం సరికాదన్నారు. జగన్‌ అసెంబ్లీకి రాకపోవడం వల్ల తమకేమీ నష్టం లేదని.. జగన్‌కు ఓటేసిన పులివెందుల నియోజకవర్గ ప్రజలకే నష్టమన్నారు. జగన్‌ అసెంబ్లీకి రాకపోగా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలనూ రావొద్దని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ పరిణామాలన్నీ అతని పెత్తందారీ మనస్తత్వం, మానసిక స్థితిని తెలియజేస్తోందన్నారు. ఓటేసిన ప్రజల కోసమైనా వైకాపా నేతుల సభకు వచ్చి మాట్లాడాలన్నారు. చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేల హక్కులనూ జగన్‌ హరిస్తున్నారని ప్రత్తిపాటి మండిపడ్డారు.

* శాసనమండలి ఛైర్మన్‌ తన హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తుండటం దారుణమని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి విమర్శించారు. మండలి సభ్యత్వానికి తాను రాజీనామా చేసి దాదాపు రెండు నెలలు దాటిందని.. తాను వ్యక్తిగతంగా హాజరై ఛైర్మన్‌కు రాజీనామా పత్రం అందజేసినట్లు చెప్పారు. ఆ తర్వాత పలుమార్లు ఛైర్మన్‌ని కలిశారని.. గురువారం మరోసారి రాజీనామాను ఆమోదించమని కోరినట్లు పేర్కొన్నారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంకా రాజీనామా ఆమోదించకపోవడం తన హక్కులను కాలరాయడమేనని కల్యాణ చక్రవర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

* మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత.. కడప ఎస్పీ విద్యాసాగర్‌ను కలిశారు. వివేకా హత్య కేసు గురించి ఎస్పీకి వివరించారు. సోషల్‌ మీడియాలో వర్రా రవీందర్‌ రెడ్డి చేసిన అసభ్యకర పోస్టుల వ్యవహారంపైనా ఆమె ఎస్పీతో చర్చించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z