* బ్రిటన్‌లో గతేడాది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో లోపం కారణంగా ఓ రోజు అనేక విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో ఇంజినీర్లంతా ఇంటి నుంచి పని (Work From Home)చేస్తుండడంతో సమస్య పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టింది. ముఖ్యంగా ఓ ఇంజినీర్ ‘పాస్‌వర్డ్ అథెంటికేషన్’లో ఇబ్బందితో ఆ సమస్య మరింత జటిలమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. గతేడాది ఆగస్టు 28న బ్రిటన్‌లో హాలీడే రోజు.. అనేక విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా వందలాది విమానాలు ఆలస్యం కాగా.. మరిన్ని రన్‌వేకే పరిమితమయ్యాయి. సమస్య పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టడంతో దాదాపు ఏడున్నర లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్‌కు చెందిన అనేక మంది సీనియర్ ఇంజినీర్లు ఇంటి నుంచి పని (Work From Home) చేస్తున్నారు. సాంకేతిక సమస్య తలెత్తిన సమయంలో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ జూనియర్ ఇంజినీర్.. సమస్య పరిష్కారానికి ప్రయత్నించాడు. అతనికి తోడుగా ఇంటినుంచి పనిచేస్తున్న సీనియర్ ఇంజినీర్ లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ.. పాస్‌వర్డ్ అథెంటికేషన్‌లో సమస్య కారణంగా సిస్టమ్‌ను యాక్సెస్ చేయలేకపోయాడు. వెంటనే కార్యాలయానికి బయలుదేరి వచ్చేందుకు గంటన్నర సమయం పట్టగా.. సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు మరింత సమయం పట్టింది. ఈ ఘటనలో వందలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో సదరు విమానయాన సంస్థలు ప్రయాణికులకు 126 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సివిల్ ఏవియేషన్ అథారిటి (CAA).. అనేక విధానపరమైన సిఫార్సులు చేసింది. వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఉన్నప్పటికీ కీలక సమయాల్లో సీనియర్ ఇంజినీర్లు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించింది.
* ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీకి పాటించాల్సిన నిబంధనలకు సంబంధించి సిబ్బందికి ఏపీఎస్‌ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధరలో 25 శాతం రాయితీని ఆర్టీసీ ఎప్పటినుంచో కల్పిస్తోంది. టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్ధరణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బందికి, వృద్ధులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆధార్‌కార్డ్ ఒరిజినల్ ఉంటేనే సిబ్బంది టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను అంగీకరించడం లేదు.
* భారతీయులు శ్రమించి పనిచేస్తేనే దేశం ముందుకుపోతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి (Narayana Murthy) పేర్కొన్నారు. వారానికి ఆరు పని దినాల విధానానికే తుదివరకు తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. ఆయన సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను క్షమించండి. నేను నా భావాలను మార్చుకోలేను. నా తుది వరకు దీనికి నేను కట్టుబడి ఉంటాను. ప్రధాని మోదీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనం కూడా అలానే కష్టపడటమే అతనికి మనం ఇచ్చే గౌరవం. భారత్ వృద్ధి త్యాగాలు, ప్రయత్నాలపైనే ఆధారపడి ఉంటుంది కానీ.. సౌకర్యాలు, విశ్రాంతిపై కాదు. బలమైన పని విలువలు లేని దేశం.. ప్రపంచ స్థాయిలో పోటీపడటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
* భారత్‌లో సాధారణంగా పండుగ సీజన్లో వాహన కొనుగళ్లపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్‌లో రిటైల్ ఆటో అమ్మకాలు సుమారు 12% పెరిగాయి. ముఖ్యంగా, భారత గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా ఈ అమ్మకాల్లో పెరుగుదల సాధ్యమైందని డీలర్ల సంఘం పేర్కొంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(FADA) అక్టోబర్ 3 నుంచి నవంబర్ 13 వరకు పండుగ సమయంలో విక్రయాల వివరాలను తెలిపింది. ఈసారి మొత్తం 45 లక్షల వాహన అమ్మకాలు లక్ష్యంగా ఉన్నప్పటికీ, ఆటోమొబైల్ డీలర్లు 43 లక్షల వాహనాలను విక్రయించారు. దక్షిణ భారత దేశంతో పాటు ఒడిశాలో భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల అమ్మకాలపై ప్రభావం కనపడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పండుగ సీజన్లో దాదాపు 33 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది కంటే ౧౪ శాతం ఎక్కువ. ప్రయాణీకుల వాహన అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ౭.౧౦ శాతం పెరిగి 6,03,000 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ-వీలర్ అమ్మకాలు 14 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన విక్రయాలు 1,29,000గా నమోదయ్యాయి. ఈ పండుగ సీజన్లో 85,216 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి.
* లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా (Mercedes Benz) కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. అన్నీ మోడల్ కార్ల ధరల్ని 3 శాతం పెంచనున్నట్లు తాజాగా ప్రకటించింది. 2025 జనవరి1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని వెల్లడించింది. దీంతో కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z