Agriculture

ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేస్తాం-NewsRounup-Nov 16 2024

ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేస్తాం-NewsRounup-Nov 16 2024

* మూసీ బాధితుల పక్షాన పోరాటం చేసే బాధ్యతను భాజపా తీసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు బాధిత ప్రాంతాల్లో వారితో కలిసి నిద్రపోతున్నామని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతమైన అంబర్‌పేట తులసీనగర్‌లో బాధిత కుటుంబాలతో కలిసి రాత్రి బస చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, ఎప్పుడు బుల్డోజర్‌తో ఇల్లు కూలగొడతారో అనే భయంతో ప్రజలున్నారని చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే భాజపా అనేక బస్తీల్లో రాత్రి బస చేస్తుందన్నారు. మూసీ బాధితుల బాధ్యత తమ పార్టీ తీసుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు.

* ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలన్నారు. ఇందుకోసం కావాల్సిన అన్ని రకాల చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పామాయిల్ కంపెనీల పురోగతిపై మంత్రి సమీక్షించారు. పురోగతి చూపించని ఆయిల్ కంపెనీలపై అసహనం వ్యక్తం చేశారు. తీరుమార్చుకోని కంపెనీల అనుమతులు రద్దు చేసి, టీజీ ఆయిల్ ఫెడ్‌కు కేటాయిస్తామన్నారు. 2025 చివరి నాటికి ప్రతి కంపెనీ వారికి కేటాయించిన జోన్లలో ప్రాసెసింగ్ యూనిట్స్‌ ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే 64,040 హెక్టార్లలో ఆయిల్ పామ్‌ ప్లాంటేషన్ చేసినట్లు చెప్పారు.

* సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి తల్లి, చెల్లిపైన వారి పార్టీ నాయకులే అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు. దిల్లీలో పర్యటించిన చంద్రబాబు.. హిందూస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసి అక్రమ కేసులకు గురికావడం తనను బాధించిందన్నారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారు.. చేయని తప్పునకు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎక్కడా నిరాశకు గురికాలేదు, ధైర్యం కోల్పోలేదన్నారు. 53 రోజుల జైలు జీవితం.. మరింత పట్టుదల పెరిగేలా చేసిందని, ఆ పట్టుదలను ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

* తన డాక్యుమెంటరీ విషయంలో నటుడు ధనుష్‌ (Dhanush) తీరును తప్పుబడుతూ నటి నయనతార (Nayanthara) తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘నానుమ్‌ రౌడీ దాన్‌’కు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్స్‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో వాడుకున్నందుకు రూ.10 కోట్లు నష్టపరిహారంగా ఆయన డిమాండ్‌ చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు లీగల్‌ నోటీసులు పంపించారన్నారు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే నయనతారకు పలువురు సినీ తారల నుంచి మద్దతు లభించింది. ఆమె షేర్‌ చేసిన స్టేట్‌మెంట్‌కు శ్రుతిహాసన్‌, ఐశ్వర్య లక్ష్మి, నజ్రియా, ఏక్తాకపూర్‌, దియా మీర్జా, శిల్పారావు లైక్‌ కొట్టి తమ సపోర్ట్‌ తెలియజేశారు.

* కేంద్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల ఇళ్లు కేటాయించిందని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు(Vishnukumar Raju) తెలిపారు. 5 లక్షల ఇళ్లకు పాలనా ఆమోదం కూడా ఇచ్చారని చెప్పారు. జగన్‌ దుర్మార్గంగా 2.3 లక్షల టిడ్కో ఇళ్లను వద్దని రద్దు చేశారని తెలిపారు. టిడ్కో ఇళ్లపై ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భగా విష్ణుకుమార్‌ రాజు మాట్టాడారు.

* భారాస ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయిందని.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. పదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదని.. కేవలం దోపిడీనే జరిగిందన్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలనను అందిస్తున్నామన్నారు.

* పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెన్ను విషయంలో స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదం నేపథ్యంలో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

* ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర ఐఐఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న బాసర ఐఐఐటీ విద్యార్థిని స్వాతిప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని అడిగితే విచక్షణ రహితంగా దాడి చేయిస్తారా? అని ప్రశ్నించారు. బాసర ఐఐఐటీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు.

* తిరుమల తిరుపతి దేవస్థానాన్ని.. వైకాపా పాలకులు ధనార్జన క్షేత్రంగా మార్చారని తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. కాలపరిమితి ఉన్న తితిదే సత్రాలను కమిషన్లకు కక్కుర్తిపడి కూల్చివేశారన్నారు. తిరుపతిలో రూ.500 కోట్ల బడ్జెట్‌తో తితిదే నిర్మిస్తున్న గోవిందరాజస్వామి సత్రాలను ఆయన పరిశీలించారు. తితిదే ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్ళి సబ్‌కమిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

* అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌పై వరుస హత్యాయత్నాలు తీవ్ర కలకలం రేపాయి. దీని వెనుక ఇరాన్‌ (Iran) హస్తం ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు రావడంతో అగ్రరాజ్యం గట్టిగా హెచ్చరించింది. ఈ క్రమంలోనే టెహ్రాన్‌ స్పందిస్తూ.. తమకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. ఈ మేరకు బైడెన్‌ (Joe Biden) సర్కారుకు సందేశం పంపినట్లు తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది.

* అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పాలనలో అమెరికా మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర విదేశాంగమంత్రి జై శంకర్‌ (Jaishankar) పేర్కొన్నారు. ఆయన ఎన్నికతో యూఎస్‌ ఆర్థిక, తయారీ రంగాల్లో మరిన్ని ప్రయోజాలు పొందుతుందని తెలిపారు. ప్రపంచీకరణ అంశంపై ఓటర్లలో ఉన్న అసంతృప్తి అమెరికా ఎన్నికల్లో కనిపించిందన్నారు. హిందుస్థాన్ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో జైశంకర్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచీకరణ(globalisation) వల్ల చైనా (China) ఇతర దేశాల కంటే అధికంగా లబ్ధి పొందుతుందని ఆయన అన్నారు. క్లింటన్‌(Clinton) పరిపాలనలో మొదట దీనిని అవంలంభించారని పేర్కొన్నారు. అప్పట్లో దీనివల్ల యూఎస్‌, భారత్‌ సహా ఇతర దేశాల్లో అనిశ్చితి నెలకొందని వెల్లడించారు. అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశమయినప్పటికీ.. దానికి ప్రపంచ భాగస్వామ్య దేశాల మద్దతు అవసరమని అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశ భద్రత గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికత, జాతీయ భద్రతను విభజించలేమని.. డిజిటల్‌, ఏఐ విప్లవంలో ఇది భాగమని అన్నారు.

* ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మళ్లీ రాజుకున్నాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య వైరంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీలు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిన మైతీ వర్గానికి చెందిన వారి ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో రాష్ట్రంలో తాజాగా అలజడి రాజుకుంది.

ఈ క్రమంలో వీరి హత్యకు నిరసనగా జిరిబామ్ జిల్లాలో నిరసనలు ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంఫాల్‌లో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనకారులు దాడి చేశారు. శాసనసభ్యుల ఇళ్లపై అల్లరి మూకలు దాడులు చేయడంతో జిరిబామ్ జిల్లాలో అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్‌ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు. లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసిందని సీనియర్ అధికారి తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బంద్ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్‌కే ఇమో నివాసం ముందు నినాదాలు చేశారు. ముగ్గురిని హత్య చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కైషామ్‌థాంగ్ నియోజకవర్గ స్వతంత్ర శాసనసభ్యుడు సపం నిషికాంత సింగ్‌ను తిడ్డిమ్ రోడ్‌లోని ఆయన నివాసంలో కలవడానికి నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే రాష్ట్రంలో లేరని చెప్పడంతో ఆయనకు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయ భవనాన్ని లక్ష్యంగా చేసుకొనిదాడులు చేశారు.

* ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) త్వరలో శాటిలైట్‌ని నింగిలోకి పంపనున్నది. ఇటీవల వరుస విజయాలతో ఊపుమీదున్న ఇస్రో తొలిసారిగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ సహాయం తీసుకోనున్నది. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఇటీవల ఇస్రో పలు దేశాలకు చెందిన రాకెట్లను నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతూ.. భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. తాజాగా భారత్‌కు చెందిన శాటిలైట్‌ని అంతరిక్షంలోకి స్పేస్‌ఎక్స్‌ కంపెనీని సహాయం కోరుతున్నది. ఇస్రో భారీ ఉపగ్రహాలను మార్క్‌-3 ద్వారా నింగిలోకి తీసుకెళ్తుంది. మార్క్‌-3 రాకెట్‌ 4వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది.

* రుణ‌మాఫీ విష‌యంలో దేవుళ్లను కూడా వదలకుండా ఏ దేవుని దగ్గరకు పోతే అక్కడ ఒట్లు వేశాడు రేవంత్ రెడ్డి. దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డినే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని సాంకేతిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఎత్తైన కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నారు. లేదంటే రెండు కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నారు. ఎత్త‌యిన కుర్చీలో కూర్చొంటే పెద్దోడివి అయిపోవు రేవంత్ రెడ్డి. ప్ర‌జ‌ల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ చుర‌క‌లంటించారు. రైతు భ‌రోసా కింద ఎక‌రానికి రూ. 15 వేలు ఇస్తా అన్నాడు. దాని కోసం రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తోంది. మూడు పంట‌ల‌కు రైతు భ‌రోసా ఎక్క‌డ పోయింది. వానాకాలం రైతుబంధు ఇంకా ఖాతాల్లో ప‌డ‌లేదు. రైతున్న‌లు మోస‌పోయామ‌ని బాధ‌ప‌డుతున్నారు. రుణ‌మాఫీ 2 ల‌క్ష‌లు చేస్తాన‌ని చెప్పి మోసం చేశావు. డిసెంబ‌ర్ 9న రుణ‌మాఫీ చేస్తాన‌ని మాటిచ్చి త‌ప్పావు. ఇక ఆ త‌ర్వాత ఏ దేవుడి వ‌ద్ద‌కు వెళ్తే.. అక్క‌డ ఒట్లు. నిన్న దేవుళ్లంద‌రూ మీటింగ్ పెట్టుకున్నార‌ట‌.. వీడు ఎక్క‌డ దొరికిండ్రా నాయానా.. మ‌న‌కు ఏడ క‌న‌బ‌డితే అడ ఒట్లు వేస్తున్నాడ‌ని అనుకున్నారంట‌. మ‌న‌షుల‌ను మోసం చేసిన వారు ఉన్నారు. దేవుళ్ల‌ను మోసం చేసిన తొలి వ్య‌క్తి ఈయ‌నే. పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ అంటివి. ఎగిరెగిరిపడితివి. హరీష్ రావుతో సవాల్ చేస్తివి. ఇప్పుడు ఏమైంది? మ‌రి ఏడ పోయింది రుణ‌మాఫీ.. జేపీ ద‌ర్గా వ‌ద్ద కూడా ఒట్టు పెడితివి. నీ ఒట్ల‌కు మెద‌క్ చ‌ర్చిలో యేసుక్రీస్తు కూడా బాధ‌ప‌డుతున్నాడు అని కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

* Pushpa 2 Trailer | ప్రపంచ‌వ్యాప్తంగా పుష్ప గాడి రూల్ స్టార్ట్ అవ్వ‌డానికి ఇంకా 19 రోజులు మాత్రమే ఉంది అన్న విష‌యం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని అటు బ‌న్నీ అభిమానుల‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా నుంచి వ‌రుస అప్‌డేట్‌ల‌ను ఇస్తున్నారు మేక‌ర్స్. ఇప్ప‌టికే ర‌ష్మిక మంద‌న్నా కొత్త పోస్ట‌ర్‌తో పాటు, శ్రీలీల పోస్ట‌ర్‌ను పంచుకున్న మేకర్స్ తాజాగా ట్రైల‌ర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను నవంబ‌ర్ 17 (ఆదివారం)న సాయంత్రం 6.03 గంట‌ల‌కు బిహార్ రాజ‌ధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా పుష్ప నుంచి కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z