Business

AWSను ఢీకొట్టనున్న RBI-BusinessNews-Nov 18 2024

AWSను ఢీకొట్టనున్న RBI-BusinessNews-Nov 18 2024

* ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio 5G voucher) కొత్త వోచర్‌ను తీసుకొచ్చింది. ఏడాదంతా అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవడానికి గానూ రూ.601తో ‘అన్‌లిమిటెడ్‌ 5జీ అప్‌గ్రేడ్‌ వోచర్‌’ను తీసుకొచ్చింది. 4జీ వినియోగదారులు కూడా ఈ వోచర్‌ సాయంతో 5జీ సేవలను ఆనందించొచ్చు. జియో 5జీ సేవలను తీసుకొచ్చినప్పుడు 5జీ స్మార్ట్‌ఫోన్‌, నెట్‌వర్క్‌ ఉన్న వారందరికీ వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉచిత 5జీ డేటాను అందించింది. రూ.239 కంటే ఎక్కువ రీఛార్జి చేసిన వారందరికీ ఈ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఏడాది జులైలో ప్లాన్ల ధరల సవరణ సందర్భంగా అపరిమిత 5జీ డేటాకు పరిమితి నిర్దేశించింది. ఎవరైతే రోజుకు 2జీబీ డేటా అందించే ప్లాన్‌ను రీఛార్జి చేసి ఉంటారో వారికి మాత్రమే అపరిమిత 5జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది. అంటే నెలకు రూ.349 ప్లాన్‌ రీఛార్జి చేసే వారికే ఉచిత 5జీ డేటా అన్నమాట.

* క్లౌడ్‌ సర్వీసుల విషయంలో అంతర్జాతీయ ప్రముఖ కంపెనీల గుత్తాధిపత్యం కొనసాగుతున్న వేళ రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త తరహా ఆలోచనతో సిద్ధమవుతోంది. తక్కువ ధరకే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డేటా స్టోరేజీ సదుపాయాన్ని అందించేందుకు గానూ క్లౌడ్‌ స్టోరేజీ సేవలను వచ్చే ఏడాది పైలట్‌ ప్రాతిపదికన ప్రారభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం స్థానిక ఐటీ సంస్థల సేవలను వినియోగించుకోనుంది. తద్వారా క్లౌడ్‌ విభాగంలో ఉన్న అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌, గూగుల్‌ క్లౌడ్‌, ఐబీఎం క్లౌడ్‌ వంటి సంస్థల ఆధిపత్యానికి చెక్‌ పెట్టనుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. బలహీన త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో సూచీలు మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి ఐటీ స్టాక్స్‌ సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్‌ ఓ దశలో 600 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 23,450 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 77,863.54 (క్రితం ముగింపు 77,580.31) తొలుత లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,965.06 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఓ దశలో కాస్త లాభాల్లోకి వచ్చినప్పటికీ.. లాభాల స్వీకరణతో మళ్లీ సూచీకి నష్టాలు తప్పలేదు. చివరికి 241.30 పాయింట్ల నష్టంతో 77,339 వద్ద ముగిసింది. నిఫ్టీ 78.90 పాయింట్ల నష్టంతో 23,453 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.40గా ఉంది.

* అత్యంత ప్రజాదరణ పొందిన ‘హ్యుందాయ్ వెన్యూ’ కారును దేశీయ విఫణిలో ఆరు లక్షల మంది కొనుగోలు చేశారు. 2019లో ప్రారంభమైన ఈ ఎస్‌యూవీ ఐదున్నర సంవత్సరాల్లో ఈ మైలురాయిని చేరుకుంది. అత్యధికంగా 2024 ఆర్ధిక సంవత్సరంలో 1,28,897 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మొదటి ఆరు నెలల్లో 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తరువాత 15 నెలల్లో లక్ష యూనిట్లు, 25 నెలల్లో రెండు లక్షల యూనిట్లు, 36 నెలల్లో మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2023 నవంబర్ నాటికి వెన్యూ సేల్స్ ఐదు లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఆ తరువాత లక్ష యూనిట్లు అమ్ముడు కావడానికి 12 నెలల సమయం పట్టింది.

* భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) తన నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు చేరువవుతోంది. తాజాగా ఎస్‌బీఐ తన ముంబైలోని ప్రధాన కేంద్రం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ముంబైలో జరిగిన ఎస్‌బీఐ 100వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి ‘నిర్మలా సీతారామన్’ మాట్లాడుతూ.. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IBI)గా ఏర్పాటు చేశారు. 1955 సంవత్సరంలో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22,500 శాఖలను కలిగి ఉంది. ఈ సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 23వేలుకు చేరుతుందని సీతారామన్ పేర్కొన్నారు. అంటే మరో 500 ఎస్‌బీఐ కొత్త శాఖలు ఏర్పాటు అవుతాయని స్పష్టం చేశారు. 1921లో ఎస్‌బీఐ కేవలం 250 శాఖలను మాత్రమే కలిగి ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య 90 రెట్లు పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 65,000 ఏటీఎంలను కలిగి ఉంది. ఎస్‌బీఐకు 50 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఎస్‌బీఐ వాటా 22.4 శాతంగా ఉంది. అంతే కాకుండా రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z