* శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South central Railway) శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. నవంబర్ 18 (ఈ రైలు ఇప్పటికే బయల్దేరింది), నవంబర్ 25, డిసెంబర్ 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నం – కొల్లాం మధ్య (రైలు నం.07145) ; నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18 మధ్య కొల్లాం- మచిలీపట్నం (రైలు నం.07146) మొత్తం 10 సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇవి కాకుండా 23, 30 తేదీల్లో మచిలీపట్నం- కొల్లాం (రైలు నం.07147), తిరుగు ప్రయాణంలో నవంబర్ 25, డిసెంబర్ 1 తేదీల్లో మరో 2 రైళ్లను (రైలు నం.07148) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
* థాయ్‌లాండ్ (Thailand) నుంచి దిల్లీకి (Delhi) బయలుదేరిన ఎయిరిండియా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో పలుమార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో వారంతా 80 గంటలుగా ఆ దేశంలోనే చిక్కుపోయారు. ఈ మేరకు సంఘటనకు సంబంధించి ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. ఎయిరిండియాకు చెందిన ఓ విమానం 100 మందికి పైగా ప్రయాణికులతో నవంబరు 16న థాయ్‌లాండ్ నుంచి దిల్లీకి బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటల పాటు ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. అలా 80 గంటలుగా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో చిక్కుకుపోయాం అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ‘‘దిల్లీకి వెళ్లేందుకు ప్రయాణికులంతా సిద్ధమయ్యారు. కానీ, విమానంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తినట్లు ఎయిర్‌లైన్స్ మాకు తెలియజేసింది. దీంతో తొలుత ఆరు గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే వేచి చూశాం. ఆ తర్వాత సిద్ధంగా ఉన్న విమానంలో మమల్ని ఎక్కించారు. టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత ఫుకెట్‌లో మళ్లీ విమానాన్ని ల్యాండ్ చేశారు. మరోసారి సాంకేతిక లోపం కారణంగానే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. అలా 80 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయాం. చిన్నారులు, పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు’’ అని ఓ ప్రయాణికుడు పోస్టు పెట్టాడు.
* డీప్‌ఫేక్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పేరిట డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం కలకలం రేపుతోంది. పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆర్‌బీఐ స్పందించింది. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
* మనలో చాలా మంది వ్యక్తిగత అవసరాలకు ఒక మెయిల్ ఐడీ, ఆఫీసు అవసరాలకు ఇంకోటి వాడుతుంటారు. ముఖ్యమైన మెయిల్స్‌ను మిస్ అయ్యే అవకాశం ఉండకూడదనే ఇలా చేస్తుంటారు. పైగా లాగిన్ కోసం ఎక్కడిపడితే అక్కడ మెయిల్ ఐడీ ఇవ్వడానికీ జంకుతుంటారు. దీనికి కారణం స్పామ్ బెడద. కొన్నిసార్లు అవసరమైన మెయిల్స్ కంటే ఈ అవాంఛిత మెయిల్స్‌తోనే మన ఇన్‌బాక్స్ అంతా నిండిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది! షీల్డ్ ఈమెయిల్ పేరిట జీమెయిల్ ఈ కొత్త సేవల్ని తీసుకురానుంది. ఈ ఫీచర్ సాయంతో తాత్కాలికంగా మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇకపై ఏదైనా యాప్‌లో లాగిన్ కావాలంటే వెంటనే ఈ షీల్డెడ్ మెయిల్ ఐడీని వాడుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసిన ఐడీ 10 నిమిషాలు మాత్రమే పనిచేస్తుందని తెలుస్తోంది. ఆ తర్వాత అవసరం అనుకుంటే మరో మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. అయితే ఈ ఫీచర్ గురించి ఇంకా అధికారికంగా గూగుల్ ప్రకటించలేదు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. కొనుగోళ్ల ఉత్సాహంతో ఓ దశలో భారీగా రాణించిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలు పరిమితం అయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్న సంకేతాలు దీనికి నేపథ్యం. ఈ క్రమంలోనే ఇంట్రాడే 23,750 స్థాయిని దాటిన నిఫ్టీ.. చివరికి 23,500 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 77,548 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,339.01) లాభాల్లో ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. ఈ క్రమంలో దాదాపు 1100 పాయింట్లకు పైగా లాభపడి 78,451 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో అమ్మకాలతో 239 పాయింట్ల లాభంతో 77,578.38 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 64.70 పాయింట్ల లాభంతో 23,518 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.42గా ఉంది.
* పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కావడంతో రిటైలర్లు, జ్యువెల్లర్ల నుంచి గిరాకీ పెరగడంతో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు తిరిగి ధగధగ మెరుస్తున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.600 వృద్ధితో రూ.78,050లకు చేరుకుంది. సోమవారం తులం బంగారం ధర రూ.77,450 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర బుధవారం రూ.1,500 పుంజుకుని రూ.93,500 వద్ద ముగిసింది. సోమవారం కిలో వెండి ధర రూ.92 వేలు పలికింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం రూ.600 పెరిగి రూ.77,650 వద్ద నిలిచింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ బంగారం తులం ధర రూ.615 వృద్ధితో రూ.75,662లకు చేరుకున్నది. అలాగే డిసెంబర్ డెలివరీ వెండి కాంట్రాక్ట్స్ ధర రూ.677 వృద్ధితో రూ.91,190 వద్ద ముగిసింది.
* అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఒక్కోసారి బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రుణాలు (Gold Loans) చాలా సురక్షితమే అయినప్పటికీ ప్రస్తుతానికి వీటిని వాయిదాల్లో చెల్లించే సదుపాయం లేదు. అయితే, త్వరలోనే బంగారం రుణాలను ఈఎంఐ (EMI) పద్ధతిలో చెల్లించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ (RBI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం బంగారం (Gold) తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే సంస్థలు కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి. అంటే రుణ కాలపరిమితి పూర్తయిన తర్వాత గ్రహీత తీసుకున్న మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. లేదా కాలపరిమితికి ముందే రుణగ్రహీత వద్ద నిధులు అందుబాటులో ఉంటే.. అప్పటికి అసలు, వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించి బంగారం విడిపించుకునే సౌలభ్యం ఉంది.
* అమెరికా (USA) తీర ప్రాంతానికి తీవ్ర తుపాను ముప్పు పొంచివుంది. ‘బాంబ్ సైక్లోన్’ (Bomb Cyclone)గా పిలిచే దీని ప్రభావం అనేక రాష్ట్రాలపై పెద్దఎత్తున ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భీకర గాలులు, భారీ వర్షాలతోపాటు కొన్ని పర్వత ప్రాంతాల్లో మంచుకు కారణమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు 8 ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z