* సినీనటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కౌంటర్‌ను కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ దాఖలు చేశారు. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే నాగార్జున (Nagarjuna), ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు. ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని చెప్పారు.
* విడాకుల కేసు విచారణలో భాగంగా నటుడు ధనుష్ (Dhanush), ఆయన సతీమణి ఐశ్వర్య (Aishwarya) తాజాగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలని (Dhanush Aishwarya Divorce) నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. ఈసందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది తీర్పును ఈనెల 27కు వాయిదా వేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఐశ్వర్య పెద్ద కుమార్తె. వయసులో ధనుష్ కంటే ఐశ్వర్య పెద్దదనే విషయం తెలిసిందే. చదువుకునే రోజుల్లో ధనుష్ వాళ్లక్క, ఐశ్వర్యకు మంచి స్నేహితురాలు. అలా, వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది.
* కాకినాడ (Kakinada) నగరంలో బుధవారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా కలెక్టర్ షాన్మోహన్ (Shan mohan) హాజరై మాట్లాడారు. దేశ భవిష్యత్తుకు బాలలే బంగారు గనులు. వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సింది గురువులే. కొంతమంది ఆ బాధ్యతను విస్మరిస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయులైన తన తల్లిదండ్రులు ఎంతో నిబద్ధతతో వృత్తిధర్మాన్ని పాటించారు కాబట్టే తాము ఈ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. వారు సక్రమంగా విధులు నిర్వహించకపోయి ఉంటే ఆ పాపం తమకు తగిలేదన్నారు. ఈ సందర్భంలో కంటతడి పెట్టారు.
* రష్యా తొలిసారి ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణితో (Intercontinental Ballistic Missile) దాడి చేసింది. ఈ విషయాన్ని గురువారం కీవ్ వాయుసేన వెల్లడించింది. డెనిపర్ నగరంలోపై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. కచ్చితంగా ఏ రకం క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు. దీంతోపాటు ఎక్స్-47ఎం2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్లు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. దీనిపై చెప్పేందుకు ఏమీ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. ఇది తమ సైనికులను అడిగాల్సిన ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు.
* రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి సిసోడియా తెలిపారు. రైతులు తక్షణమే వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు జిల్లాల్లో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా.. ఈ ప్రభావంతో ఈనెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందన్న అంచనాలు ఉన్నాయని సిసోడియా తెలిపారు. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోందని, ఫలితంగా ఈనెల 24 నుంచి అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సిసోడియా వివరించారు.
* తిరుమలలో ఆధ్యాత్మిక శైలి లేకుండా భవనాలు నిర్మించారని తితిదే ఈవో శ్యామలరావు అన్నారు. చరిత్ర ఉట్టిపడేలా నిర్మాణాలు జరగలేదని అభిప్రాయపడ్డారు. తిరుమలలోని అతిథిగృహాలకు సొంత పేర్లు ఉండకూడదన్న ఈవో.. అతిథిగృహాలకు తితిదే సూచించిన పేర్లనే పెట్టాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని భవనాలపై చర్యలు తీసుకుంటామన్నారు. తితిదేలో పట్టణ ప్రణాళిక విభాగం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తిరుమలలో 25 ఏళ్లకు సంబంధించి విజన్ డాక్యుమెంటరీ, భక్తులకు ఇబ్బందుల్లేకుండా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామన్నారు.
* ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ (పీఏసీ)గా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైకాపా నామినేషన్ ఉపసంహరణ జరగకపోతే శుక్రవారం అసెంబ్లీ కమిటీహాల్లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
* భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశమంతా అధ్యయనం చేసి మహిళల భద్రతకు చట్టాలు చేస్తామన్నారు. గురువారం శాసనసభలో సీఎం మాట్లాడుతూ.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు.
* త్వరలోనే కర్నూలులో ఏపీ హైకోర్టు (AP High Court) బెంచ్ ఏర్పాటవుతుందని సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. లోకాయుక్త, ఏపీ హెచ్ఆర్సీ తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని వెల్లడించారు. కర్నూలు(Kurnool News)లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడారు.
* నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి.. వాటిని కనుమరుగయ్యేలా చేస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజారోగ్యం, పటిష్ఠ ఆర్థిక పర్యావరణ కోణాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలి. కానీ శాపంగా మిగిలిపోకూడదు అని సీఎం సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.
* వీడియో గేమింగ్, వినోదరంగానికి భారత్ ప్రధాన గమ్యస్థానం కావాలనే లక్ష్యంతో ప్రసార భారతి (Prasar Bharati OTT) ఓటీటీ ‘వేవ్స్’ను (Waves) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రసార వేదిక రామాయణం, మహాభారతాలను ఉచితంగా అందిస్తోంది.
* గూగుల్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈమేరకు అక్కడి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 23 పేజీల ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. దీనిలో క్రోమ్ బ్రౌజర్ విక్రయంతోపాటు.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ తన సొంత సెర్చిఇంజిన్కు అనుకూలంగా వ్యవహరించకుండా ఆంక్షలు విధించడం వంటివి ఉన్నాయి. ‘‘క్రోమ్ విక్రయంతో కీలకమైన సెర్చి పాయింట్లో గుగుల్ ఆధిపత్యానికి గండి పడుతుంది. ఇది దాని ప్రత్యర్థి సెర్చిఇంజిన్లకు కూడా బ్రౌజర్లలో స్థానం కల్పిస్తుంది. ఫలితంగా వినియోగదారులు ఇంటర్నెట్ వినియోగానికి మరిన్ని మార్గాలు లభిస్తాయి’’ అని జస్టిస్ డిపార్ట్మెంట్ న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ విక్రయాన్ని కోరడం నిలిపేశామని తెలిపింది. కానీ, తప్పుడు ప్రవర్తనకు సంబంధించి దీని పర్యవేక్షక కమిటీ ఏమైనా ఆధారాలను గుర్తిస్తే మాత్రం విక్రయించాల్సి ఉంటుందని పేర్కొంది. వాషింగ్టన్ డీసీ కోర్టు ఈ కేసుకు సంబంధించి తర్వాత విచారణను వచ్చే ఏప్రిల్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ‘లేబర్ డే’ కంటే ముందే దీనిపై తుదితీర్పు ఇవ్వాలని న్యాయమూర్తి మెహతా భావిస్తున్నారు. ఆయన కనుక ప్రభుత్వ ప్రతిపాదనలతో ఏకీభవిస్తే మాత్రం ఆరు నెలల వ్యవధిలో గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాల్సి ఉంటుంది. కానీ, ఈ నిర్ణయంపై కంపెనీ అప్పీల్‌కు వెళితే మాత్రం.. మరో నాలుగేళ్ల వరకు కేసు తేలే అవకాశం లేదు. వినియోగదారుల సెర్చిల ద్వారా సంపాదించే డేటాను చూసేందుకు పోటీదారులకు కూడా గూగుల్ అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీంతోపాటు పలు ప్రతిపాదనలను వారు న్యాయస్థానం ముందు ప్రస్తావించారు.
* సామాజిక మాధ్యమాల వేదికగా అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు ఐటీ చట్టం కింద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Goapl Varma)పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
* లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని (Gautam adani) తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z