* అదానీ కుంభకోణాన్ని అమెరికా అధికారులు బట్టబయలు చేశారని, వెంటనే అతన్ని అరెస్టు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేఏసీ) ఏర్పాటు చేయాలని కోరారు.
* గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్- ‘సెకీ’ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తును తీసుకోవడం వల్ల ఏపీ ఖజానాకు, తద్వారా ప్రజలపై రూ.1.10 లక్షల కోట్లు అదనపు భారం పడనుంది. ఈ విషయం తెలిసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఒప్పందం విషయంలో ముందుకే వెళ్లింది. ‘సెకీ’ నుంచి ప్రతిపాదన వచ్చిన తర్వాత రోజే పరిశీలన లేకుండానే ప్రతిపాదనను మంత్రివర్గ ఆమోదానికి పెట్టింది. తర్వాత గుట్టుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల మీద తనకే వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు రానున్న 30 ఏళ్లపాటు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికే ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తుందంటూ తీయని మాటలు చెప్పుకొచ్చారు.
* దలాల్ స్ట్రీట్‌లో చాలా రోజుల తర్వాత కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. వరుస నష్టాలతో సూచీలు 5 నెలల కనిష్ఠానికి చేరిన వేళ.. అనూహ్యంగా వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు నేడు కళకళలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఓ దశలో 2 వేల పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ సైతం 550 పాయింట్లకు పైగా లాభపడింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజులో దాదాపు రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.432 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 77,349.74 పాయింట్ల (క్రితం ముగింపు 77,155.79) వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత లాభాల పరంపర కొనసాగింది. ఇంట్రాడేలో 2 వేల పాయింట్లకు పైగా లాభపడి 79,218.19 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1,961.32 పాయింట్ల లాభంతో 79,117.11 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 557.35 పాయింట్లు లాభపడి పాయింట్ల 23,907.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభపడడం గమనార్హం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్, ఐటీసీ, టైటాన్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.39 వద్ద కొనసాగుతోంది. బంగారం మళ్లీ ఔన్సు మళ్లీ పెరిగి 2700 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది.
* ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా (BMW price hike) దేశీయంగా కార్ల ధరలను పెంచనుంది. తన వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయంగా తయారుచేస్తున్న 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్, 5 సిరీస్, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ మోడళ్లతో పాటు దిగుమతి చేసుకునే ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, బీఎండబ్ల్యూ ఐఎక్స్, జడ్ ఎం40ఐ, ఎం2 కూపే కార్లను దేశీయంగా బీఎండబ్ల్యూ విక్రయిస్తోంది. వీటి ధరలు 3 శాతం మేర పెరగనున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను రాజీ లేకుండా అందించేందుకు ధరలను పెంచుతున్నట్లు బీఎండబ్ల్యూ తెలిపింది. దేశీయంగా బీఎండబ్ల్యూ కార్ల ధరలు రూ.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సైతం ఇప్పటికే ధరల పెంపును ప్రకటించింది. జనవరి 1 నుంచి ధరల పెంపు చేపట్టనున్నట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులను కారణంగా చూపింది. కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు బెంజ్ కార్ల ధరలు పెరగనున్నాయి.
* ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఉద్యోగులకు షాకిచ్చింది. 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. కంపెనీ తన పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో, వేర్వేరు స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు లేఆఫ్ ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విక్రయానంతర సేవల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. ఈ తొలగింపు ప్రక్రియ జులై నుంచి కొనసాగుతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి వెల్లడించారు. వివిధ విభాగాల్లో వివిధ స్థాయిల్లో దశలవారీగా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా లేఆఫ్‌ల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తిని సమర్థంగా వినియోగించుకుని తద్వారా మార్జిన్లు, లాభదాయకతను పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z